– సాగు, నీరు, విద్యుత్‌పై ప్రభావం పడకుండా ముందస్తు చర్యలు
– వాతావరణ మార్పులపై గ్రామీణస్థాయి వరకు అవగాహన
– రైతుల మేలు కోరే ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం
– పగలు సోలార్ విద్యుత్ వినియోగంతో తగ్గనున్న ఆర్థిక భారం
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
– రవీంద్రభారతిలో ప్లానింగ్ శాఖ సదస్సు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 21 : ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో చోటుచేసుకుంటున్న ‘ఎల్ నినో’ వంటి మార్పులు రాష్ట్ర ప్రజలపై, ముఖ్యంగా సాగు, తాగునీరు, విద్యుత్ రంగాలపై ప్రభావం చూపకుండా ఉండేందుకు ప్రభుత్వం దూరదృష్టితో పక్కా ప్రణాళికలు రూపొందిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్లానింగ్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల పెరుగుదల నుంచి తెలంగాణ సంసిద్ధత వరకు’ అంశంపై రాష్ట్రస్థాయి అవగాహన సదస్సుకు ఆయన మంత్రి మహమ్మద్ అజారుద్దీన్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ కేవలం పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడమేకాక ఎల్ నినో ప్రభావంపై ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సమస్య తీవ్రతను ముందే గ్రహిస్తే ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం సొంతంగా సరైన ప్రణాళికలు వేసుకోగలుగుతుందని అన్నారు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమధ్యరేఖా పసిఫిక్ మహా సముద్రంలో జరిగే ఉష్ణోగ్రతల మార్పులు రాష్ట్రంలోని చెరువులు, వాగులు, గ్రామాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో శాస్త్రవేత్తల ద్వారా విశ్లేషింపజేసి సమర్థవంతమైన కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. తాగు, సాగునీటితోపాటు పశువులు, పక్షులు, అడవి జంతువుల నీటి, ఆహార అవసరాలకు ఇబ్బంది కలగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. వ్యక్తిగత, కుటుంబ, గ్రామ, మండల, జిల్లాస్థాయిల్లో ఎవరికి వారు సంసిద్ధమయ్యేలా ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని భట్టి స్పష్టం చేశారు. వర్షాభావ పరిస్థితులు ఎదురైనా రైతులు ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు నిపుణుల సూచనల మేరకు తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఈ సమాచారాన్ని ప్రత్యక్ష ప్రసారాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ తీసుకెళ్లడంలో టీవీ ఛానళ్లు తమ సామాజిక బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాయని అభినందించారు. మన జీవన విధానంలో విద్యుత్ అత్యంత ప్రధానమైనదని, ఎల్ నినో వల్ల పెరిగిన డిమాండ్‌ను తట్టుకునేందుకు ప్రభుత్వం అత్యంత సమర్థవంతమైన ‘ఎనర్జీ మేనేజ్‌మెంట’ అమలు చేస్తోందని వివరించారు. పగటి పూట విరివిగా, తక్కువ ధరకు లభించే సౌర విద్యుత్‌ను(సోలార్ పవర్) గరిష్థంగా వినియోగించుకోవడం ద్వారా ప్రజలపై, ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. తదుపరి అవసరాలకు థర్మల్ విద్యుత్‌ను క్రమబద్ధంగా వినియోగించడం ద్వారా గ్రిడ్ స్థిరత్వాన్ని కాపాడుతున్నామని స్పష్టం చేశారు.
వర్షాకాలంలోనూ వేసవిస్థాయి డిమాండ్
ఉష్ణోగ్రతలు పెరగడంతో పగలు, రాత్రి తేడా లేకుండా ఫ్యాన్లు, ఏసీలు, లైట్లు, బోర్‌వెల్స్, లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్ల వాడకం భారీగా పెరిగిందన్నారు. సాధారణంగా వర్షాకాలంలో విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉంటుంది, కానీ ఎల్ నినో ప్రభావంతో ప్రస్తుత డిమాండ్ ఏప్రిల్(వేసవి) నాటి గరిష్ఠ(పీక్) స్థాయికి చేరుకుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న సీజన్లకు అనుగుణంగా విద్యుత్ వినియోగంలో మార్పులు వస్తున్నాయని, పెరిగిన అవసరాలకు తగ్గట్టు ఎనర్జీ ప్లానింగ్ రూపొందించుకోవడంలో రాష్ట్రం ముందుంటుందని తెలిపారు. వీటిని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. తమ విధులతోపాటు సమాజానికి మేలు చేసే ఇలాంటి అంశాల్లో విషయ నిపుణులను ఆహ్వానించి ఈ సదస్సును ఏర్పాటు చేసిన ప్లానింగ్ శాఖను ఉప ముఖ్యమంత్రి అభినందించారు. వ్యవసాయ, విద్యుత్, సాగునీటి, భూగర్భ జల శాఖలతోపాటు అనుబంధ శాఖలన్నింటినీ సమన్వయం చేసుకుని సదస్సును నిర్వహించడం ప్రణాళికా శాఖ ప్రతిభకు, సామాజిక బాధ్యతకు నిదర్శనమని కొనియాడారు. భవిష్యత్తులో జిల్లాల వారీగా కూడా నిర్వహించి ప్రజలను భాగస్వాములను చేస్తూ పూర్తిస్థాయి చైతన్యం తేవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్, ప్లానింగ్ సెక్రటరీ గౌరవ ఉప్పల్, ప్లానింగ్ డైరెక్టర్ రూఫొస్ దత్తం, ఇతర అధికారులు దివ్య దేవరాజన్, గోపి, జితేష్ వి పాటిల్, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





