– పరిగి నియోజకవర్గంలో విద్యుత్ అభివృద్ధి పనులు
– ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
పరిగి, ప్రజాతంత్ర, నవంబర్ 5: కాంగ్రెస్ అంటేనే కరెంటు అని, కరెంటు అంటేనే కాంగ్రెస్ అlr, కాంగ్రెస్ అధికారంలోకి వొస్తే కరెంటు ఉండదన్న వారు కరెంటుతోపాటు కాంగ్రెస్ ను ముట్టుకుంటే తెలుస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. పరిగి నియోజకవర్గం లో బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. రాష్ట్రంలో 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తును 53 లక్షల కుటుంబాలకు అందజేస్తున్నామన్నారు. వికారాబాద్ జిల్లాలో 2.48 లక్షల కుటుంబాలకు గాను నిరుపేదలైన లక్షా 43 వేల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఒక్క ఈ నియోజకవర్గంలోనే 44,500 కుటుంబాలకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నామన్నారు. వికారాబాద్ జిల్లాలో ఉచిత విద్యుత్తుకు సంబంధించి రూ.42 కోట్లను ప్రభుత్వమే విద్యుత్ శాఖకు చెల్లిస్తున్నదని భట్టి తెలిపారు. ఈ విధంగా ప్రతి నెలా గృహ జ్యోతి పథకం కింద రాష్ట్ర నిరుపేద ప్రజల కోసం రూ.2830 కోట్లను ప్రభుత్వమే విద్యుత్ శాఖకు చెల్లిస్తున్నదని తెలిపారు. నియోజకవర్గంలో రూ.1000 కోట్లతో విద్యుత్ 9 సబ్ స్టేషన్ లతోపాటు 33/11 కెవి, 400kv సబ్ స్టేషన్, 220 కెవి సబ్ స్టేషన్ ను మంజూరు చేశామన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం రామ్మోహన్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. నావెల్ ప్రాజెక్టుకు సంబంధించిన రూ.3 వేల కోట్ల సాధన కోసం ఆయన ఎంతగానో కృషి చేశారని, అయితే గత ప్రభుత్వం పదేళ్లపాటు పట్టించుకోలేదని విమర్శించారు. డిఫెన్స్ కు సంబంధించి రూ.3 వేల కోట్లు రావడం ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. భవిష్యత్తులో పరిగి నియోజకవర్గంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి కోసం విద్యుత్తు సబ్ స్టేషన్ లు పెద్ద ఎత్తున మంజూరు చేశామని, వాటికి భూమి పూజ కూడా చేశామని భట్టి తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ఆదుకుంటాం
చేవెళ్ల మండలంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోనే మన్నెగూడ నుంచి బీజాపూర్ వరకు రోడ్డు మంజూరైందని, అయితే గత పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం రోడ్డు వేయకుండా నిర్లక్ష్యం చేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్జీటీ 2 లో ఉన్న కేసును గత నెల 30న తొలగింపునకు కృషి చేయడం వల్ల నాలుగు లేన్ల రహదారి పనులు వడివడిగా నడుస్తున్నాయన్నారు. కొద్దిమంది ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ వల్ల పేదలకు నష్టం జరిగిందని అంటున్నారని, పదేళ్లలో అప్పటి ప్రభుత్వం చేసిన పనుల గురించి చెబితే ఏ ఒక్కటీ కాలేదన్నది స్పష్టమవుతుందన్నారు. గత ప్రభుత్వ మూడెకరాల భూమి ఇంటికో ఉద్యోగం, బంగారు తెలంగాణ చేస్తామని చెప్పిందని అందులో ఒక్కటైనా అమలైందా అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా ప్రాజెక్టు కడతామని చెప్పి మోసం చేసిందని, కృష్ణా నదిపై ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదని, గోదావరిపై రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు సంగతి ఏమైందో ప్రజలందరికీ తెలుసని అన్నారు.
4 లక్షల 50వేల ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం
బిఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి ఏ ఒక్క నిరుపేదకు ఇల్లు కట్టించి ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లను మంజూరు చేసి ప్రతి ఇంటికి రూ.5 లక్షల చొప్పున కేటాయించామని, రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల 50 వేల ఇండ్లను నిర్మిస్తున్నామన్నారు. ఈ విషయంపై ప్రతిపక్షాలకు తాను చాలెంజ్ విసురుతున్నానని ఏ నియోజకవర్గానికి వొచ్చినా ఇండ్ల నిర్మాణం చూపిస్తానని భట్టి తెలిపారు. 93 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 93 లక్షల కుటుంబాలకు రూ.10 లక్షలతో ఏ హాస్పిటల్కు వెళ్లినా వైద్యం చేస్తున్నామన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న అప్పటి ప్రభుత్వం గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదని, రాష్ట్రం కోసం పోరాడిన నిరుద్యోగులకు వయసు మీరిపోతున్నా ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం 60 వేల ఉద్యోగాలను కల్పించిందని, కొందరు గ్రూప్-1 అడ్డుకోవాలని చూస్తే, కోర్టుకు వెళ్లి వారికి నియామక పత్రాలను అందజేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 100 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను మంజూరు చేశామని, ప్రపంచంతో పోటీపడేలా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో విద్య ఉండబోతుందని చెప్పారు.
విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా బాట
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో వారానికి మూడు రోజులు ప్రజాబాట నిర్వహించబోతుందని తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులే ప్రజల వద్దకు వెళ్తారని ,అంబులెన్స్ లాగా ఒక వాహనం కూడా ఉంటుందన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిని పెంచబోతున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ ను ఎవరు ఆపలేరని ఏ ఒక్క ప్రతిపక్షం కూడా ఆపలేదని స్పష్టం చేశారు. ప్రజలను మభ్యపెట్టే విధంగా కాంగ్రెస్ పాలన చేయదని, ప్రతిక్షణం ప్రజల కోసమే ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని, ఇది కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతమని ఉప ముఖ్యమంత్రి చెప్పారు.





