కాంగ్రెస్ హయాంలోనే సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి
థియేటర్ ఘటనలో వివరాలు వెల్లడించిన సిఎం
ఎవరో రాసిన స్క్రిప్టు చదివిన అల్లు అర్జున్
ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్23: సినీ పరిశ్రమ అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. అందరూ బాగుండాలనే కాంగ్రెస్ కోరుకుంటుందన్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాస్తవాలను ప్రజలకు వివరించారని చెప్పారు. ఈ మేరకు గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. ‘సినీ పరిశ్రమపై అవగాహన లేని వ్యక్తికి ఛైర్మన్ పదవి ఇస్తే సమస్యలు పరిష్కారం కావేమోనని ఆలోచించి.. పరిశ్రమకు చెందిన ఒక కీలకమైన వ్యక్తికి ఇచ్చాం. దిల్ రాజు అనే వ్యక్తి ఒక బ్రాండ్ మార్క్ లాంటివారు. ఇండస్టీల్రో పనిచేసే కార్మికులు ఎంతో మంది ఉన్నారు. అంజయ్య ప్రభుత్వ హయాంలో సినీ ఇండస్టీన్రి హైదరాబాద్ తీసుకొచ్చే క్రమంలో ఫిల్మ్ నగర్‌లో స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. పద్మాలయ, రామానాయుడు స్టూడియోస్‌కు కూడా ప్రభుత్వం తరఫున స్థలాన్ని కేటాయించాం. ప్రొడ్యూసర్ నుంచి మొదలు పెడితే కింది స్థాయి కార్మికుడి వరకు బాగుండాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందని అన్నారు. నటుడు అల్లు అర్జున్‌పై కేసు ఎందుకు పెట్టాల్సి వొచ్చిందనే విషయాన్ని పోలీసులు స్పష్టంగా చెప్పారు.
ఇది కేవలం బాధ్యత లేకుండా వ్యవహరించడం వల్లే జరిగిందని క్లారిటీగా విజువల్స్‌తో పోలీసులు వివరించారు. జైలు నుంచి బయటికొచ్చాక అల్లు అర్జున్ చట్టానికి కట్టుబడి ఉంటానని బాధ్యతాయుతమైన పౌరుడిగా మాట్లాడారు. ఈ ఘటనలో ఎవరినీ బాధ్యులను చేయడం లేదని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఎంఐఎం పార్టీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చారు. వాస్తవాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. థియేటర్ యాజమాన్యం అనుమతి కోసం దరఖాస్తు చేయడం వాస్తవం.. కానీ అనుమతిచ్చారని చెప్పడం అవాస్తవం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన రోజే.. అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. ఒక కుటుంబంలో మహిళ చనిపోయింది.. మరో బాలుడు చికిత్స తీసుకుంటున్నాడు. ఇలాంటి ఘటనలు జరిగితే భవిష్యత్తులో బెనిఫిట్ షోలు ఇతరత్రా రాయితీలకు సంబంధించిన అనుమతులు ఇవ్వబోమని సీఎం తేల్చి చెప్పారు. సామాన్యులకు ఇబ్బంది కలిగే పరిస్థితి వొచ్చినప్పుడు ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని సీఎం చెప్పారని ఎంపి అన్నారు. అల్లు అర్జున్ కూడా మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి సినీపరిశ్రమను ఉద్దేశించి మాట్లాడిన విషయాలపై వివరణ ఇస్తూ సినీ పరిశ్రమకు వివరణ ఇవ్వాల్సింది.
అలా కాకుండా.. తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది.. బాలుడు చికిత్స తీసుకుంటున్నాడు.. అనే విషయాలు మరుసటి రోజు వరకు తెలియదని మీడియా ముందు చెప్పారు. తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఏమాత్రం అవగాహన లేకుండా ఎవరో స్క్రిప్ట్ ఇస్తే చదివారని మండిపడ్డారు. అయితే, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని అల్లు అర్జున్ చెప్పి ఉంటే రీల్ స్టార్ నుంచి రియల్ స్టార్ అయ్యేవారని చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. హీరో అల్లు అర్జున్‌తోపాటు టాలీవుడ్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కోపం లేదన్నారు. అయినా అల్లు అర్జున్, సినిమా ఇండస్ట్రీతో తమకు వైరం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. బాధ్యత లేకుండా వ్యవహరించడం వల్లే ఇలా జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా హాల్‌కు హీరో, హీరోయిన్ రావడానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదన్నారు. సామాన్యులకు ఇబ్బంది ఎదురవుతోందనే స్పెషల్ షోలు ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. హ్యూమిలేట్ చేస్తున్నారంటూ అల్లు అర్జున్ చెప్పడం తప్పు అని పేర్కొన్నారు.
అల్లు అర్జున్ నివాసంపై ఎవరో దాడి చేశారని.. కానీ ఆ పని కాంగ్రెస్ పార్టీ నేతలు చేశారనే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దాడి చేసిన వ్యక్తులు బీఆర్‌ఎస్ కండువాతో కేటీఆర్ తో ఫోటోలు దిగారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి ఒక్క రూపాయి అయినా చనిపోయిన కుటుంబానికి ఇప్పించారా? అంటూ తెలుగు రాష్టాల్రకు చెందిన బీజేపీ ఎంపీలు బండి సంజయ్, పురందేశ్వరిలను ఈ సందర్భంగా ఆయన సూటిగా ప్రశ్నించారు. తొక్కిసలాట ఘటనలో మహిళా చనిపోతే నాయకురాలైన పురంధేశ్వరి కనీసం బాధితురాలి కోసం స్పందించ లేదన్నారు. తాము ఎవరిపై కక్ష సాధింపు చర్యలకు దిగమని ఎంపీ స్పష్టం చేశారు. అయితే ఇమేజ్ పెంచుకోవడానికే కొందరు అల్లు అర్జున్ అంశంపై మాట్లాడుతున్నారంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. బీజేపీ హాయాంలో అనేక చోట్ల తొక్కిసలాటలు జరిగాయని ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు.