అర్హత, ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాల భర్తీ

దలారులను నమ్మి మోసపోవద్దు..
రోజ్‌గార్ మేలా కార్యక్రమంలో కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 23 : ప్ర‌ధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో విద్యార్హత, ప్రతిభ ఆధారంగా పారదర్శకంగా ఉద్యోగ నియామక ప్రక్రియ జరుగుతోంద‌ని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి అన్నారు. చాంద్రాయణగుట్ట సీఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్ లో రోజ్ గార్ మేలా కార్యక్రమాన్ని కిషన్ రెడ్డి ప్రారంభించారు. పూర్తి పారదర్శక విధానంలో ఉద్యోగాలు కల్పిస్తున్నామని, దలారుల మాట విని మోసపోవద్దని సూచించారు. కేంద్ర ఉద్యోగాలకు ఎంపికైన 526 మందికి ఆయన నియామక పత్రాలు అందజేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..  దేశ సేవలో యువతను భాగస్వామ్యం చేసేలా, వారికి ఉద్యోగాలను కల్పించేందుకు కేంద్రం రోజ్‌గార్ మేలా నిర్వ‌హిస్తోంద‌ని తెలిపారు. 11వ విడ‌త రోజ్‌గార్ మేలాలో భాగంగా భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా సుమారు 71వేల మందికి  సోమ‌వారం నియామకపత్రాలను అందించింద‌ని తెలిపారు. 10 కేంద్ర ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన ఉద్యోగాలకు అపాయింట్‌మెంట్ లెటర్లు అందజేస్తున్నామ‌న్నారు. నేటితో క‌లిపి ఇప్పటివరకు.. సుమారు 10 లక్షల మంది యువతీ యువకులు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ ఉద్యోగాలకు సంబంధించిన అపాయింట్‌మెంట్ లెటర్లు అందుకున్నారని కిష‌న్ రెడ్డి తెలిపారు.

ప్ర‌తినెలా ఉద్యోగ నియామ‌కాలు
దేశంలో ప్రతి నెలా ఉద్యోగ నియామకాలు జరిగేలా ప్రధాని మోదీ ప్రకటించార‌ని, దీంతో అధికారులు వేగవంతంగా ఉద్యోగ భర్తీలు చేస్తున్నార‌ని చెప్పారు.  22 అక్టోబర్ 2022 నాడు దేశ యువతకు దీపావళి కానుకగా ‘రోజ్ గార్ మేలా’ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారని గుర్తుచేశారు. ఇదొక నిరంతర ప్రక్రియ అని,  12 లక్షల ఉద్యోగాలు టార్గెట్‌గా పెట్టుకుని.. దీన్ని పూర్తిచేసే దిశగా కేంద్రం ముందుకెళ్తోంద‌ని తెలిపారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖలో సుమారు 4 లక్షల ఉద్యోగులున్నారు. రానున్న రోజుల్లో మరికొన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తాం. నరేంద్రమోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వొచ్చాక.. ఇది రెండో రోజ్‌గార్ మేలా  అని చెప్పారు. ఇందులో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, పోస్టల్ డిపార్ట్‌మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తదితర పది సంస్థలకు సంబంధించిన ఉద్యోగులున్నారు. ఈ 12 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగ, కేంద్ర ప్రభుత్వ వ్యవస్థ పనిచేసేందుకు అవసరమైన ఉద్యోగాలు మాత్రమే.

కానీ ప్రయివేటు రంగంలో కోట్ల సంఖ్యలో ఈ పదేళ్లలో ఉద్యోగాల కల్పన మోదీ ప్రభుత్వం ఆధ్వ‌ర్యంలో జ‌రిగింద‌ని కిష‌న్ రెడ్డి వివరించారు.ప్రైవేటు రంగంలో భారీ సంఖ్యలో ఉద్యోగాల కల్పనకోసం కేంద్రం అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ప్రైవేటు సెక్టార్ లో కోట్లాది మందికి ఉద్యోగ అవకాశాలు క‌ల్పిస్తున్నాం. కొరోనా మహమ్మారితో ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అటువంటి పరిస్థితుల్లోనూ నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టి, అన్ని రంగాల్లో విశేష చర్యలతో ముందుకెళ్తోంది. ఇవి కాకుండా స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా యువతలోని పారిశ్రామిక నైపుణ్యాన్ని (ఎంటర్-ప్రెన్యూర్-షిప్ క్వాలిటీ) వెలికితీస్తూ.. వారు ఉపాధి కోసం వెతికే స్థితి నుంచి ఉపాధి కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోంది.  ఉద్యోగాలు పొందిన యువత .. సమాజంలో మరో పదిమందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదిగేలా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహం అందిస్తున్నద‌ని తెలిపారు.

స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా యువతలోని పారిశ్రామిక నైపుణ్యాన్ని (ఎంటర్-ప్రెన్యూర్-షిప్ క్వాలిటీ) వెలికితీస్తూ.. వారు ఉపాధి కోసం వెతికే స్థితి నుంచి ఉపాధి కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. దీనికితోడు ముద్ర యోజన ద్వారా రుణాలు పొందుతున్న వారిలో 70% మంది మహిళలు, యువతులే ఉండటం మారుతున్న పరిస్థితులకు నిదర్శనం. ఇవి కాకుండా ప్రైవేటు రంగానికి కేంద్రం ఇస్తున్న చేయూత కారణంగా భారతదేశంలో ఎగుమతులు పెరిగాయి. రక్షణ రంగంలో ఎగుమతులు 2014లో రూ.900 కోట్లు ఉంటే.. ఇప్పుడు దాదాపుగా రూ.15వేల కోట్ల ఎగుమతులు చేస్తున్నాం.

75 దేశాలకు మన రక్షణ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. దీని ద్వారా కూడా ఉపాధి గణనీయంగా పెరిగింది.  ఇలా ప్రతి రంగంలోనూ  పీఎల్ఐలు ఇవ్వడం ద్వారా ఆర్థిక స్థితిని మెరుగుపరచడంతోపాటు, ఉపాధి కల్పన కూడా గణనీయంగా పెంచేందుకు కేంద్రం పనిచేస్తోంద‌ని తెలిపారు. దేశంలో మొత్తం వాణిజ్య ఎగుమతులు 2021-22లో 418 బిలియన్ డాలర్లు. నెలకు దాదాపు 35 బిలియన్ డాలర్ల వాణిజ్య ఎగుమతులు 2021-22లో నమోదయ్యాయని వివ‌రించారు. ఇవి కాకుండా సేవల ఎగుమతుల కూడా దాదాపు 250 బిలియన్ డాలర్లకు పైగానే నమోదయ్యాయని చెప్పారు. ఇవన్నీ కేంద్రం తీసుకొచ్చిన మేకిన్ ఇండియా కార్యక్రమం ద్వారానే సాధ్యమవుతున్నాయని స్ప‌ష్టం చేశారు. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా భారతదేశం ఎదుగుతున్న క్రమంలో ప్రతీ రంగం ఆర్థికంగా సమృద్ధి సాధించాలనే సంకల్పంతో మోదీ ప్రభుత్వం పనిచేస్తోంద‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page