రెండిరటి మధ్యే హోరా హోరీ పోరు..

ఎంఎల్సీ ఎన్నికల్లో తలబడుతున్న కాంగ్రెస్‌, బిజెపి
బిఆర్‌ఎస్‌ తప్పుకోవడంతో  లాభపడేదెవరు?..

మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి

మరో వారం రోజుల్లో ఎంఎల్సీ ఎన్నికలు జరగనుండటంతో రెండు జాతీయ పార్టీల మధ్య పోటీ మరింత ఉత్కంఠగా రసవత్తరంగా మారింది. తన ప్రతిష్టను కాపాడుకోవాలని అధికార పార్టీ ఒకవైపు, భవిష్యత్‌లో అధికారంలోకి వొచ్చేందుకు పార్టీని విస్తరించుకునేందుకు ఈ ఎన్నికలను కీలకంగా భావిస్తున్న బిజెపి మరోవైపు ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేశాయి. విచిత్రంగా గడచిన దశాబ్దకాలం తెలంగాణలో అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్‌ ఈ ఎన్నికల్లో పాల్గొనకపోవడంతో రెండు జాతీయ పార్టీల మధ్యనే నువ్వా నేనా అనే రీతిలో పోటీ ఏర్పడిరది. అయితే ఈ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ సైలెంట్‌ కావడం వెనుక ఎదుటి పార్టీకి మద్దతు కోసమేనంటూ పై రెండు పార్టీలు కూడా విమర్శించడం గమనార్హం. ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనకపోయినప్పటికీ పరోక్షంగా బిజెపికి బిఆర్‌ఎస్‌ సహకరిస్తున్నదని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.  అలాగే కాంగ్రెస్‌కు బిఆర్‌ఎస్‌కు మధ్య రహస్య ఒప్పందం ఉందని బిజెపి విమర్శిస్తుండడంతో మూడు పార్టీల మధ్య మాటల యుద్ధంతో తెలంగాణ రాజకీయాలను  వేడెక్కించాయి. ఏది ఏమైనా ప్రస్తుతం రాష్ట్రంలో ఖాలీ ఏర్పడిన మూడు ఎంఎల్సీ స్థానాలకు జరుగుతున్న ఈఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలు నువ్వానేనా అన్నట్లుగా ప్రచారాన్ని చేపట్టాయి. ఒక గ్రాడ్యుయేట్‌, రెండు టీచర్‌ ఎంఎల్సీ స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో మిగతా పార్టీల కన్నా బిజెపి ఈసారి తమ అభ్యర్ధులను ముందుగా ప్రకటించింది.

గత ఎన్నికల్లో ఎనిమిది పార్లమెంటు స్థానాలను మరో ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్న బిజెపి ఈసారి శాసనమండలిలో కూడా తమ ఆధిక్యాన్ని పెంచుకునే పట్టుదలతో ఉంది. ఎట్టి పరిస్థితిలో ఈ మూడు స్థానాలను గెలుచుకునేందుకు పార్టీ ముఖ్య నేతలు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ పట్టభద్రుల ఎంఎల్సీ, అదే పరిధిలోని టీచర్‌ ఎంఎల్సీ స్థానంతోపాటు, నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం పరిధికి చెందిన మరో ఉపాధ్యాయ ఎంఎల్సీ స్థానాలుండడంతో ఆయా జిల్లాల వోటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న బిజెపి ఎంపీలకు ఈ స్థానాలను గెలిపించుకోవడం ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా  మారింది. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న జి. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కుమార్‌లతో పాటు పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్‌, ఈటల రాజేందర్‌, జి.నగేష్‌, రఘునందన్‌రావులకు ఈ ఎన్నికలు పరీక్షగా నిలిచాయి. సార్వత్రిక ఎన్నికలు జరిగిన ఒక సంవత్సరానికి వొచ్చిన ఎన్నికలు కావడంతో ఈ స్థానాలను గెలుచుకోవడంద్వారా తమ ప్రతిష్టను నిలబెట్టుకోవాలని అధికార కాంగ్రెస్‌ పట్టుదలతో ఉంది.

ఈ ఎన్నికల్లో తమ అభ్యర్దులను గెలిపించాలంటూ సాక్షాత్తు  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు ఆయా జిల్లాల నుంచి రాష్ట్ర క్యాబినెట్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పిసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌, ప్రస్తుత ఎంపీ జీవన్‌రెడ్డి తదితరులు అభ్యర్ధుల గెలుపును తమ భుజాలపై వేసుకున్నారు. రాష్ట్రం నుంచి కేంద్ర క్యాబినెట్‌లో ఇద్దరు మంత్రులున్నప్పటికీ బడ్జెట్‌లో అధిక నిధులు తెచ్చుకోవడంలో విఫలమైందని, అలాంటి పార్టీకి ప్రజలను ఓట్లుఅడిగే హక్కులేదని కాంగ్రెస్‌ బిజెపి నేతలపై దాడి చేస్తున్నది. గడచిన పదేళ్ళుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెద్దగా ఒరగబెట్టిందేమీ లేదని, కేవలం మతాన్ని రెచ్చగొట్టి కాలం గడుపుతున్నదంటూ కాంగ్రెస్‌ నేతలు బిజెపిపైన విరుచుకుపడుతున్నారు. తాము అధికారం చేపట్టిన ఏడాదిలోనే 55వేల ఉద్యోగాలను భర్తీ చేసిన విషయాన్ని విస్తృత ప్రచారం చేసుకోవడం ద్వారా యువతను ఆకర్షించే ప్రయత్నంచేస్తోంది కాంగ్రెస్‌. అయితే అంతే తీవ్రంగా బిజెపితోపాటు బిఆర్‌ఎస్‌ కూడా కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నాయి. మాటల గ్యారంటీలేతప్ప ఇచ్చిన మాటను నిలబెట్టుకోని కాంగ్రెస్‌ను నమ్మవద్దని ఆ పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్‌ ఏడాదిపాలనలోనే ప్రజావ్యతిరేకతను మూటకట్టుకుందంటూ ఆ పార్టీలు విమర్శనాస్త్రాలను సందిస్తున్నాయి.

రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న విధానలవల్ల అనేక విద్యాలయాలు మూతపడుతున్నాయని, ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌, స్కాలర్‌షిప్‌లు విడుదలకాకపోవడంతో టీచర్లకు వేతనాలు చెల్లించని పరిస్థితిలో విద్యాసంస్థల ఉన్నాయంటూ బిజెపి ఎంపీ, ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్‌ దుయ్యబట్టారు. కాగా నిరుద్యోగులను నిండా ముంచిందని, ఉద్యోగులు దాచుకున్న జిపిఎఫ్‌,గ్రాట్యుటీ పైసలుకూడా ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్నదంటూ కేంద్రమంత్రి బండి సంజయ్‌ విమర్శిస్తున్నారు. నాలుగువందల ఇరవై హామీలతో అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్‌ వాటిని నెరవేర్చకపోగా 430 మంది రైతుల బల్వన్‌మరణానికి కారణంగా మారిందని బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు ఆరోపిస్తున్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో కాంగ్రెస్‌ అసమర్థ పాలనతో ఆత్మహత్యలు నిత్యకృత్యంగా మారాయని, త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి మోసం చేసేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సిద్దమవుతోందని ఆయన ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే స్వతంత్ర అభ్యర్థులు కూడా గట్టి పోటీనిస్తుండడంతో చీలిన వోట్లు ఎవరికి లాభిస్తాయన్న లెక్కలు వేసుకునే పనిలో అభ్యర్థులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page