జగదీప్ ధన్‌కడ్,మల్లిఖార్జున్‌ఖర్గేల మధ్య మాటల యుద్ధం
న్యూదిల్లీ, డిసెంబర్ 13 : రాజ్యసభలో శుక్రవారం గందరగోళం నెలకొంది. చైర్మన్ జగదీప్ ధన్‌కడ్.. ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే మధ్య మాటల యుద్ధం సాగింది. అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. వాయిదా తీర్మానాలను స్వీకరించాలని విపక్షాలు కోరాయి. ఆ సమయంలో చైర్‌లో ఉన్న ధన్‌కడ్ మాట్లాడుతూ.. గడిచిన 30 ఏండ్లలో ఎన్ని సార్లు రూల్ 267 వాడారో తనకు తెలుసు అన్నారు. మీ విజ్ఞతకే ఈ విషయాన్ని వదిలి వేస్తున్నట్లు చెప్పారు.
రికార్డు స్థాయిలో రూల్ 267 కింద వాయిదా తీర్మానాలను ఇచ్చినట్లు ధన్‌కడ్ పేర్కొన్నారు. విపక్షాలు పట్టుపట్టడంతో.. చైర్మెన్ ధన్‌కడ్ సీరియస్ అయ్యారు. నేను రైతు బిడ్డను, నేను ఎటువంటి బలహీనతను ప్రదర్శించబోనని ధన్‌కడ్ తెలిపారు. ఈ దేశం కోసం ప్రాణాలిస్తాను, ఓ రైతు బిడ్డ ఎలా ఈ స్థానంలో కూర్చున్నారన్న విషయాన్నిజీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. మీ వెకిలి చేష్టలు అందరికీ తెలుసు అని, నేను చాలా ఓపిక పట్టాను, కానీ నేటి రైతు కేవలం పంటపొలాలకే పరిమితం కాడు అని అన్నారు. రూల్స్‌ను చదువుకోవాలని, ఒకవేళ మోషన్ మూవ్ చేస్తే అది 14 రోజులు పడుతుందన్నారు. మీరు టైం తీసుకుని వచ్చి చర్చించండి, లేదంటే నేనే మీవద్దకు వచ్చి చర్చిస్తానన్నారు