పిల్లల ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌కు కామన్ డైట్

500 కోట్ల భారం పడున్నా.. బాధ్యతగా చేప‌డుతున్నాం..
రూ.5వేల కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌
రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఖమ్మం టౌన్, డిసెంబర్ 14, ప్రజాతంత్ర: పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడే విధంగా ఇందిరమ్మ ప్రభుత్వం కామన్ డైట్ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శ‌నివారం మంత్రి, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డితో కలిసి పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం, మహ్మదాపురంలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాల, కళాశాలలో కామన్ డైట్ మెనూ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రికి విద్యార్థులు, అధికారులు బ్యాండ్ వాయిస్తూ, పూలతో ఘనంగా స్వాగతం పలికారు. ప్రభుత్వం పెంచిన మెస్ చార్జీలకు అనుగుణంగా రూపొందించిన కొత్త డైట్ మెనూను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. పేదోని పిల్లలు కూడా ధనికుల పిల్లల్లా చదవాలని, పేద‌వారి పిల్లల కోరికలు తీరేలా ప్రభుత్వం డైట్, కాస్మెటిక్ చార్జీలను పెంచిందన్నారు. ప్రభుత్వానికి అదనంగా సుమారు 500 కోట్ల భారం పడుతున్నప్పటికి, దాన్ని బాధ్యతగా చేశామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలే కాక ఇవ్వని వాటిని కూడా అమలు చేస్తున్నామన్నారు. గడిచిన పదేళ్ల‌లో గత  ప్రభుత్వం పేద పిల్లలను పట్టించుకోలేదని, ఇందిరమ్మ రాజ్యంలో హాస్టల్ విద్యార్థులకు డైట్ చార్జీలు నలబై శాతం కాస్మొటిక్ చార్జీలు 250 శాతానికి పెంచామని అన్నారు.

డైట్  చార్జీలను 3 నుంచి 7వ తరగతి విద్యార్థులకు 950 నుంచి1330 రూపాయలకు, 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 1100 నుంచి 1540 రూపాయలకు, ఇంటర్  నుంచి  పీజీ విద్యార్థులకు 1500 నుంచి 2100 రూపాయలకు ప్రజా ప్రభుత్వం పెంచిందని, అదేవిధంగా కాస్మోటిక్ చార్జీలను బాలికలకు  7వ తరగతి వరకు 55 నుంచి 175  రూపాయల వరకు, 11 సంవత్సరాల వయస్సు పై గల బాలికలకు 75 నుంచి  275 రూపాయలకు, బాలురు 7వ తరగతి  వరకు 62 నుంచి 150  రూపాయల వరకు, 11 సంవత్సరాల వయస్సు పై గల బాలురు 62 నుంచి  200 రూపాయలకు పెంచినట్లు మంత్రి తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో రూ.150 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మిస్తున్న‌ట్లు తెలిపారు.

52 నుంచి 54 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణాలకు ఈ సంవత్సరం బడ్జెట్ లోనే నిధులు కేటాయించుకున్నామని, త్వరలోనే నిర్మాణాలు చేపడతామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో కొన్ని చేశామ‌ని,  ఇంకా కొన్ని చేయాల్సి ఉందని, గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం వల్ల ఇబ్బందులు కలిగాయని, అన్నీ చక్కదిద్దుకొని, ఇచ్చిన ప్రతీ మాటను నెరవేరుస్తామని భ‌రోసా ఇచ్చారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించి ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతుందని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో విద్య, వైద్యానికి  పెద్దపీట వేశామని మంత్రి తెలిపారు. ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ ద‌వాఖాన‌ల్లో వైద్యం అందిస్తున్నామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేద‌ల‌కు 10 లక్షల ఉచిత వైద్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా  గత ప్రభుత్వం వదిలేసిన ప్రాజెక్టు లను పూర్తి చేస్తున్నామని అన్నారు. ఖర్చు పెట్టే ప్రతీ రూపాయి పేదవారికి చెందే విధంగా అధికారులు సహకరించాలని, పెంచిన డైట్, కాస్మొటిక్ చార్జీలు సద్వినియోగం చేయాలని మంత్రి అన్నారు. విద్యార్థుల పట్ల ఉపాద్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, స్వంత పిల్లలా చూసుకోవాలని మంత్రి తెలిపారు.

కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం డైట్, కాస్మెటిక్ చార్జీల పెంపుతో పాటు, కిచెన్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టిందన్నారు. దశల వారీగా 3 నెలలు సిబ్బందికి కిచెన్, స్టోరేజ్ నిర్వహణపై శిక్షణ ఇస్తామన్నారు. తల్లిదండ్రులు సంతృప్తి గా వుండేలా, పిల్లలు బాగుగా వుండేలా కృషి చేస్తామని అదనపు కలెక్టర్ అన్నారు.ఈ సందర్భంగా మంత్రి పిల్లలతో కలిసి భోజనం చేశారు. అంతకుముందు మంత్రి, పాఠశాలలో సిద్ధం చేసిన వంటలను పరిశీలించారు. స్టోర్ రూమ్ పరిశీలించారు. సామాగ్రి ఎన్ని రోజులకు వొస్తున్నది వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణంలో ఉన్న పాఠశాల భవన పనులను పరిశీలించారు. రూ. 5 కోట్లతో జి ప్లస్ 3 గా నిర్మిస్తున్న పాఠశాల కాంప్లెక్, ప్రిన్సిపాల్, స్టాఫ్ క్వార్టర్స్, సెక్యూరిటీ రూమ్‌ల‌ నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. నాణ్యతలో రాజీ లేకుండా, అగ్రిమెంట్ సమయంలోగా నిర్మాణం పూర్తి చేయాలన్నారు. పాఠశాల కాంపౌండ్ నిర్మాణం పూర్తి చేయాలని, సుందరీకరణ, జనరేటర్, ఆర్వో ప్లాంట్ ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అన్నారు .  కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీనివాస రెడ్డి, సిఇ శంకర్, డిప్యూటీ డైరెక్టర్ విజయలక్ష్మి, ఇఇ తానాజీ, తహసీల్దార్ రామకృష్ణ, పాఠశాల ప్రిన్సిపాల్, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page