పాల్గొన్న ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 10 : ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంగళవారం ఘట్‌కేసర్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొని బిజీ బిజీగా గడిపారు. ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిలతో కలిసి గురుకుల జూనియర్ కళాశాలలో రూ.1.5 కోట్లతో అదనపు గదుల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు కలిసి శంకుస్థాపన చేశారు. ఘట్‌కేసర్ మండలం కొండాపూర్ లో రూ.7.96 కోట్ల వ్యయంతో బాలికల కోసం నిర్మించిన ఐటిఐ కళాశాల భవనాన్ని ప్రారంభించారు.
హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్(హెచ్‌ఎఎల్) సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కేటాయించిన నిధులతో ఈ భవనాన్ని నిర్మించారు. ఐటీఐ కళాశాలకు ఐదు ట్రేడ్లు మంజూరు కాగా, ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సు కోసం రూ.7 లక్షలతో కొనుగోలు చేసిన 20 అత్యాధునిక కుట్టు మిషన్ల ఫ్లోర్ ను శ్రీధర్ బాబు ప్రారంభించారు. వొచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభమయ్యే ఈ ఐటీఐ కళాశాలకు 224 సీట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు గురుకుల జూనియర్ కళాశాలలో సిఎం కప్ క్రీడలను ప్రారంభించారు. కార్యక్రమాల్లో హెచ్ ఏ ఎల్ జనరల్ మేనేజర్ డి. రామ్మోహన్ రావు, ఉపాధి కల్పన శాఖ జాయింట్ డైరెక్టర్ నగేశ్, ఐటీఐ ప్రిన్సిపల్ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
జిసిసి, కృత్రిమ మేధరంగాల్లో మేటి హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబు
మౌలిక వసతులు, ప్రతిభావంతులైన మానవ వనరులు సమృద్ధిగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని ప్రపంచస్థాయి, జిసిసి, కృత్రిమ మేథ రంగాలకు గమ్యస్థానంగా అభివృద్ధి చేయగలిగామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యుఎస్ ఐబిసి), తెలంగాణ (భారత్)ల మధ్య మంగళవారం ద్వైపాక్షిక వాణిజ్య భాగస్వామ్యం పెంపొందించే విషయమై ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. జిసిసిల ఏర్పాటుకు ప్రపంచ స్థాయి ఎకోసిస్టమ్ ను సృష్టించేందుకు తమ ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుందని తెలిపారు. ప్రపంచంలోని దిగ్గజ ఐటీ, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ జిసిసిలు ఇక్కడ ఉన్నాయని, భవిష్యత్తులో సిలికాన్ సిటీనే హైదరాబాద్ కు రప్పించాలన్న సంకల్పం తమకుందని వివరించారు.
పరిశోధన, అభివృద్ధి రంగాలకు కూడా అనువైన వాతావరణం ఉందని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడంలో హైదరాబాద్ ను భాగస్వామిగా చేయాలని ఆయన కోరారు. ఏఐ రంగంలో దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు ఉండేందుకు 200 ఎకరాల్లో ఏఐ సిటీని ఏర్పాటు చేస్తున్న విషయాన్ని శ్రీధర్ బాబు గుర్తు చేశారు. ఏరో స్పేస్, డిఫెన్స్, విద్యుత్, బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్స్, పారిశ్రామిక ఉత్పత్తులకు సంబంధించి హైదరాబాద్ లో అత్యంత అనుకూల వాతావరణం నెలకొల్పామని తెలిపారు. యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ అమెరికా వాణిజ్య, పారిశ్రామిక రంగానికి రాష్ట్రాన్ని మరింతగా పరిచయం చేసి పెట్టుబడులు వొచ్చేలా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లారెన్స్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, యుఎస్ ఐబిసి ఎండీ రాహుల్ శర్మ, సీనియర్ డైరెక్టర్ ఆదిత్య కౌషిక్, తదితరులు పాల్గొన్నారు