నాగర్‌కర్నూల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : ఎస్ ఎల్ బి సి టన్నెల్ కొనసాగుతున్న సహాయక చర్యలపై శుక్రవారం జేపీ బేస్ క్యాంప్ ఆఫీస్ లో సహాయక బృందాల అధికారులతో జిల్లా కలెక్టర్ ఎస్పీ, ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్డిఆర్‌ఎఫ్ అధికారి సుఖేండు, టిఎస్‌ఎస్పీడీసీఎల్ సిఎండి ముషరఫ్ ఆలీ,ఆర్మీ అధికారులు కల్నల్ పరీక్షిత్ మెహ్ర, కల్నల్ అమిత్ కుమార్ గుప్తా, సింగరేణి మైన్స్ రెస్క్యూ అధికారి బలరాం, హైడ్రా అధికారులు, జేపీ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టన్నెల్‌లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. వైద్య సిబ్బంది ఆక్సిజన్ అందుబాటులో ఉంచారు. సహాయ చర్యలను మరింత వేగవంతం చేసేందుకుఎస్ ల్బిసి టన్నెల్ ప్రమాదంలో 12 బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని వాటిలో ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డిఆర్‌ఎఫ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ, ఫైర్ సర్వీసెస్, నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, హైడ్రా, సౌత్ సెంట్రల్ రైల్వే ప్లాస్మా కట్టర్స్, ర్యాట్ మైనర్స్, బృందాలు నిరంతరం సమన్వయంతో సహాయక చర్యలు వేగవంతం చేసినట్లు వివరించారు.
ప్రమాద ప్రదేశంలో కొనసాగుతున్న సహాయక చర్యలను వేగవంతం చేసేలా సహాయక బృందాలను నిరంతరం పనిచేసేలా పక్కా ప్రణాళికతో సహాయక చర్యలకు కావలసిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటూ ప్రమాద ప్రదేశంలోని నీటిని పంపుల ద్వారా బయటికి తరలిస్తూ, ప్లాస్మా గ్యాస్ కట్టల ద్వారా శిథిలాలను తొలగిస్తూ సహాయక చర్యలు వేగవంతం చేసినట్లు వివరించారు. సహాయక చర్యలు కావలసిన సామాగ్రిని అందుబాటులో ఉంచుకుంటూ వీలైనంత త్వరగా కన్వేయర్ బెల్ట్ ను ఉపయోగంలోకి తీసుకురానున్నట్లు, బురదను తీసి వేసేందుకు కావలసిన ఎస్కావేటర్లను సిద్ధం చేసినట్లు వివరించారు. ప్రత్యేక కెమేరాలు, సెన్సార్ల ద్వారా లోపలి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడం వంటి చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఎస్ ఎల్ బి సి టన్నెల్ ప్రమాదంపై వైరల్ అవుతున్న సమాచారం అవాస్తవమని కలెక్టర్ తెలిపారు.
ఫెక్ న్యూస్ ను ఖండించిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 :ఎస్ ఎల్ బి సి టన్నెల్ ప్రమాదంలో ఎనిమిది మందిలో ఐదుగురి మృతదేహాలు లభ్యమైనట్లు శుక్రవారం సాయంత్రం పలు మీడియా ఛానెల్‌లలో, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఖండించారు. కొద్ది సేపటి క్రితం జిల్లా కలెక్టర్ ఎస్పీతో కలిసి మీడియాతో మాట్లాడుతూ … ప్రమాదం పై వైరల్ అవుతున్న సమాచారం తప్పుడు సమాచారం అని కలెక్టర్ తెలిపారు.మీడియా మిత్రులు గమనించాలని కోరారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా జరుగుతుందని ఏమైనా సమాచారం ఉంటే డిపిఆర్‌ఓ ద్వారా తెలియజేస్తామని .తప్పుడు సమాచారం ప్రచారం చేయొద్దని కోరారు.