“తెలంగాణ రైజింగ్ 2047”
-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
“తెలంగాణ రైజింగ్ 2047” విజన్ రూపకల్పన ఏ కొద్దిమందో గదిలో కూర్చొని చేసిన పని కాదు, విస్తృతమైన, వైవిధ్యమైన వర్గాల జ్ఞానం, ఆశయాలు కలిసిన సమష్టి సృష్టి. ఈ విజన్ పత్రం ఒక శాఖ పని కాదు, ఒక నిపుణుల బృందం రాసింది కాదు. నెలల తరబడి ఫీల్డ్ పర్యటనలు, ప్రజా చర్చలు, స్థానికుల అభిప్రాయాలు ఇవన్నీ కలసి రూపొందిన జీవ పత్రం ఇది అని డిప్యూటీ సీఎం వివరించారు. రాష్ట్ర మంత్రులు లక్ష్యాన్ని స్పష్టంగా చెప్పారు, అధికారులు భూమ్మీదున్న వాస్తవాలను తీసుకొచ్చారు, చింతన నాయకులు, విద్యావేత్తలు మేధోపరమైన లోతు అంశాలను జోడిం చారు, ముఖ్యంగా రైతులు, యువత, వ్యాపారులు, కూలీలు వేలాదిగా తమ భవిష్యత్తు గురించి ఆశలు, సూచనలు పంచుకున్నారని డిప్యూటీ సీఎం వివరించారు. అలాగే ఈ పత్రాన్ని తుది రూపంలోకి తీసుకురావడంలో సహకరించిన నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు డా. సుమన్ బెర్రీ , సీఈఓ , నీతి ఆయోగ్ అధికారులకు, అలాగే ఈ పత్రాన్ని మెరుగుపర్చడంలో ఎంతో కృషి చేసిన ఐఎస్బీ డీన్ మదన్ పిల్లుట్ల బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విజన్ డాక్యుమెంట్ మనందరిది అన్నారు. ప్రపంచ సదస్సుల్లో నాయకులతో పాటు ఒక “షెర్పా” ఉంటాడు ప్రతీకాత్మకంగా, కఠినతలను దాటడానికి మార్గం చూపే ప్రేరణ. ఈ సదస్సుకూ అటువంటి ఒక షెర్పా ఉంటే, అది తెలంగాణకు హక్కైన గుర్తింపునిచ్చిన చారిత్రాత్మక నిర్ణయం నుంచి పుట్టిన ధృఢసంకల్పం ఇది అన్నారు. ఈ రోజు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా, ఇది రాజకీయ వేదిక కాదని తెలిసినా, ఆ నిర్ణయం వెనుక ఉన్న నిశ్శబ్దమైన ధైర్యాన్ని స్మరించుకోవడానికి మీ అనుమతిని కోరుతున్నాను అన్నారు. ఆ నిర్ణయం మన గతాన్ని మాత్రమే కాదు, మన భవిష్యత్ ఆశయాలనూ నిర్ధేశిస్తూ ఉంది అని డిప్యూటీ సీఎం వివరించారు. నిజానికి, సమ్మిట్ లు రెండు రకాలున్నాయి. మొదటిది పేరులో ఉన్నట్లే. అందరి ప్రసంగాలు, సూచనలు తీసుకుని మొత్తం కలిపితే అవుతుంది. ఈసారి, మనం పత్రాన్ని మాత్రమే కాదు వేదికను కూడా నిర్మించాం అని డిప్యూటీ సీఎం అన్నారు. క్యాపిటల్ మార్గదర్శకాలు నుంచి వ్యవసాయ విలువ శృంఖలాలు, ఫ్రాంటియర్ టెక్నాలజీ నుంచి అటవీ ఆర్థిక వ్యవస్థల వరకు ప్రజలు కేవలం మాట్లాడకుండా, కట్టుబడి పనిచేయ డానికి సిద్ధమయ్యారనే భావన వచ్చింది అన్నారు. తాను అధ్యక్షత వహించిన రెండు సెషన్ల గురించి చిన్నగా చెప్పాలనుకుంటున్నాను. అవి ఉత్పాదకత, విద్యుత్ అని తెలిపారు. విద్యుత్ సెషన్‌లో వినియోగదారుడిగా కాకుండా, ఉత్పత్తిదారుడిగా మారాలనుకునే తెలంగాణను చూశాను గ్రీన్ హైడ్రజన్, డిస్ట్రిబ్యూటెడ్ రిన్యూవబుల్స్, స్మార్ట్ గ్రిడ్స్ దారిని చూపించాయి అన్నారు. ఉత్పాదకత సెషన్‌లో భారత్ తదుపరి దూకుడు కేవలం కష్టపడి కాదు, తెలివిగా సిస్టమ్‌లు నిర్మించడం ద్వారా వస్తుందని ఏకాభిప్రాయం ఏర్పడింది, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, శక్తివంతమైన కార్మికులు, అవుట్‌పుట్ ఆధారిత ఆవిష్కరణలతో ఇవి ఏవీ ఊహాజనిత విషయాలు కావు. ఇవే తెలంగాణ అసలు బలం అన్నారు.
అందుకే మళ్లీ చెబుతున్నాను, ఇది స్థిర పత్రం కాదు. ఇది అభివృద్ధి చెందుతుంది. కొత్త డేటా, కొత్త భాగస్వామ్యాలు, కొత్త జ్ఞానం ఇవన్నీ వస్తే మారుతుంది. ఫీడ్‌బ్యాక్‌ను మనం భయపడము స్వాగతిస్తాము అన్నారు. ఈ సదస్సుకు హాజరైన ప్రతి తెలంగాణ యువకుడూ భవిష్యత్తుకు మార్గం వేయగలిగిన విలువైనదేదో నిర్మించాలి, రాబోయే తరాలు మీ మార్గంలో అక్షరాలా నడవాలి అని ఆకాంక్షించారు.




