స్కిల్‌ వర్సిటీ అభివృద్ధికి సహకరించండి

కేంద్ర మంత్రి జయంత్‌ చౌదరికి విజ్ఞప్తి
నైపుణ్యాభివృద్ధికి కేంద్రంతో కలిసి పని చేసేందుకు సిద్ధం
మెగా జాబ్‌/స్కిల్‌ లోన్‌ మేళా ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 16:  తెలంగాణను ‘స్కిల్‌ కేపిటల్‌ ఆఫ్‌ ది గ్లోబల్‌’గా మార్చాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్‌ చౌదరిని ఐటీ శాఖ మంత్రి మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. మినిస్ట్రీ ఆఫ్‌ స్కిల్‌ డెవలప్మెంట్‌ అండ్‌ ఎంటర్ప్రెన్యూర్‌షిప్‌(గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా), డిపార్టుమెంట్‌ ఆఫ్‌ ఎంప్లాయిమెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌(తెలంగాణ) సంయుక్త ఆధ్వర్యంలో బషీర్‌బాగ్‌లోని పీజీ లా కళాశాలలో ఏర్పాటు చేసిన మెగా జాబ్‌/స్కిల్‌ అండ్‌ లోన్‌ మేళాను కేంద్రమంత్రి జయంత్‌ చౌదరితో కలిసి ఆయన సోమవారం లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ యువత ప్రతిభే మా రాష్ట్రానికి ఉన్న అతి పెద్ద ఆస్తి. కానీ.. చాలామందిలో పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలు ఉంటడం లేదు.. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య నెలకొన్న అంతరాన్ని రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం గుర్తించింది అని శ్రీధర్‌బాబు వివరించారు. అందరినీ కలుపుకొనిపోయే ప్రభుత్వం తమది.. నైపుణ్యాభివృద్ధిలోనూ పరిశ్రమలు, నిపుణులను భాగస్వామ్యం చేస్తున్నాం.. వారి సహకారంతోనే స్కిల్‌ యూనివర్సిటీలో కోర్సులకు రూపకల్పన చేస్తున్నాం. ఇక్కడ శిక్షణ తీసుకున్న యువతలో 80 శాతం మందికి ఉద్యోగాలు లభించాయి అని వివరించారు. మీలో ఎంతో ప్రతిభ ఉంది.. మారుతున్న పరిస్థితులకనుగుణంగా మీరు మారాలి.. టెక్నాలజీ సాయంతో కొత్త నైపుణ్యాలను నేర్చుకునేందుకు ప్రయత్నించండి.. ఓటమికి నిరుత్సాహం చెందకుండా ప్రయత్నం చేస్తూనే ఉండండి.. తప్పకుండా లక్ష్యాన్ని చేరుకుంటారు అని యువతకు ఆయన సూచించారు. యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీని సందర్శించాలని కేంద్ర మంత్రి జయంత్‌ చౌదరిని ఆహ్వానించారు. నైపుణ్యాభివృద్ధికి కేంద్రంతో కలిసి పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీ ఆర్‌.కృష్ణయ్య, ఎమ్మెల్సీ అంజి రెడ్డి, తెలంగాణ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ అనిల్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page