నిరుపేద  విద్యార్థికి సీఎం బాసట

కండరాల వ్యాధితో నడవలేని దీన స్థితి
చలించిపోయిన ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి
తక్షణమే వైద్య సాయం అందించాలని ఆదేశం
ఎలక్ట్రిక్‌ ‌వాహనాన్ని అందించాలని సూచన

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 :  కండరాల వ్యాధితో బాధపడుతూ వైద్యం చేయించుకోలేకపోతున్న నిరుపేద విద్యార్థి రాకేష్‌ ‌గురించి తెలుసుకుని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి చలించిపోయారు. తక్షణమే రాకేష్‌ ‌కు కావాల్సిన వైద్య సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఉచితంగా వైద్యం అందించడంతో పాటు రాకేష్‌ ‌కోసం ఎలక్ట్రిక్‌  ‌వాహనాన్ని కూడా అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు రాకేష్‌ ‌కుటుంబీకులతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా ఆదుకుంటామని సీఎం తరఫున హామీ ఇచ్చారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రంగయ్య పల్లి గ్రామానికి చెందిన గూళ్ల రాకేష్‌ ‌చాలా కాలం సూడో మస్కులర్‌ ‌డిస్ట్రోఫీ అనే కండరాల వ్యాధితో బాధపడుతున్నాడు.

ఇటీవల వ్యాధి తీవ్రత పెరగడంతో నడవలేని పరిస్థితికి వొచ్చాడు. అయితే రాకేష్‌ ‌కు ఆరోగ్యం మెరుగు కావాలంటే ఖరీదైన ఇంజెక్షన్లను క్రమం తప్పకుండా ఇవ్వాలని వైద్యులు సూచించారు. పేదరికంలో ఉన్న రాకేష్‌ ‌కుటుంబం ఖరీదైన వైద్యం చేయించలేకపోతుందని, పత్రికలో వొచ్చిన కథనంపై సీఎం రేవంత్‌ ‌రెడ్డి తక్షణమే స్పందించారు. ములకనూరు లోని ఓ ప్రైవేటు కాలేజీలో రాకేష్‌ ఇం‌టర్‌ ‌ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. స్వగ్రామం నుంచి ములకనూరు వెళ్లి రావడానికి చార్జింగ్‌ ‌వెహికల్‌ ‌ను కూడా ప్రభుత్వం అందించనున్నది. తమ బిడ్డను ఆదుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డికి రాకేష్‌ ‌తల్లిదండ్రులు గూళ్ల సమ్మయ్య, లక్ష్మి ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page