– బిల్లా రంగాలు ఆటో ఎక్కారు
– బోరబండలో సీఎం రేవంత్ కార్నర్ మీటింగ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 1: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో రెండో రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా అభివృద్ధి తదితర అంశాలతోపాటు బీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించారు. బోరబండలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పార్టీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అజారుద్దీన్ ను మంత్రిని చేసి మాట నిలబెట్టుకున్నానని అన్నారు. కారు షెడ్డుకు పోయింది.. బిల్లా రంగాలు ఆటోల్లో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. పీజేఆర్ చనిపోతే ఏకగ్రీవానికి బీజేపీ, బీఆర్‌ఎస్ ఎందుకు సహకరించలేదని ప్రశ్నించారు. ఈ దుష్ట సంస్కృతికి తెర లేపిందే బీఆర్‌ఎస్ కాదా అని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ ఈ ఎన్నికలో సెంటిమెంట్ రాజేయాలని చూస్తోందని అన్నారు. పదేళ్లు బీఆర్‌ఎస్ వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదో ఆలోచించండని సీఎం రేవంత్ అన్నారు. తాడు బొంగరం లేని బీజేపీ ఇక్కడ అభివృద్ధి చేస్తామని అంటోందని ఎద్దేవా చేశారు. బోరబండలో అడిగినోళ్లందరికి రేషన్ కార్డులు ఇచ్చామని, ఆడబిడ్డలకు ఫ్రీ బస్సు ఇస్తే బీఆర్‌ఎస్ కు కడుపు మండుతోందని, వారు పైసా లేకున్నా బస్సుల్లో ప్రయాణిస్తున్నారని అన్నారు. 2014లో బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చినపుడు ఐదేళ్లు మహిళా మంత్రి లేరని, తాము అధికారంలోకి రాగానే ఇద్దరు మహిళలను మంత్రులను చేశామని అన్నారు. మాగంటి గోపినాథ్ ఎప్పుడైనా అసెంబ్లీలో ప్రజాసమస్యలు ప్రస్తావించారా అని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారం కావాలంటే నవీన్ యాదవ్‌ను గెలిపించాలని సీఎం రేవంత్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సీఎం వెంట ప్రచారంలో నవీన్ యాదవ్, మంత్రి అజారుద్దీన్ ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





