పుష్పా`2 ఘటన పై ఫైర్ ..!

  • అసెంబ్లీలో భావోద్వేగానికి గురైన సీ ఎమ్ రేవంత్ రెడ్డి
  • కనీసం మానవత్వం చూపని సినీ ప్రముఖులు
  • సమాజం ఎటువైపు పోతుంది..
  • హీరోలంటే.. తెరపైన కాదు.. నిజజీవితంలో చూపాలి
  • హీరోలను అరెస్టు చేయకుండా ఏమైనా చట్టాలు ఉన్నాయా..?
  • ఉంటే చెప్పండి.. అలా నడుచుకుంటాం
  • తల్లి చనిపోయి.. కుమారుడు హాస్పిటల్‌లో ఉంటే కనీసం ఒక్కరూ చూడలేదు

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 21 : కొన్నికొన్ని సంఘటనలు చూస్తే మనసు చలించిపోతుందని, అసలు సమాజం ఎటువైపు పోతుందని బాధేస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి శనివారం జరిగిన అసెంబ్లీలో సమావేశంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అసెంబ్లీ సమావేశంలో భాగంగా పుష్పా`2 సినిమా బెన్‌ఫిట్‌ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన ప్రస్తావన సందర్భంగా సీఎం మాట్లాడారు. పుష్పా`2కు సంబంధించి టిక్కెట ధరలు విషయంలో, బెన్‌ఫిట్‌ షోకు సంబంధించి ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని సీఎం గుర్తు చేశారు. కానీ బెన్‌ఫిట్‌ షోకు వొస్తే జనం కిక్కిరిసి ఉంటారని, కనీసం జ్ఞానం లేకుండా , పోలీసులకు సరైన సమాచారం ఇవ్వకుండా థియేటర్‌కు రావడంతో ఒక మహిళ చనిపోవడంతోపాటు ఆమె కుమారుడు అపస్మార స్థితిలో ఉన్నాడని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరిగినా కనీసం చలనం కూడా లేకుండా అక్కడ ఉండి సినిమా చూస్తా అనడం దేనికి సంకేతమని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఇంకా అక్కడే ఉంటే మరింత ప్రమాదం జరుగుతుందని సినీహీరో అల్లు అర్జున్‌కు చెప్పిన పోలీసులు ఇప్పటికే ఒకరు చనిపోయారు, ఒకరి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని చెప్పినా కూడా వెళ్లకుండా ఉండటంతో మీరు ఇక్కడే ఉంటే అరెస్టు చేయాల్సి వొస్తుందని అనడంతో అప్పుడు వెళ్లిపోయారన్నారు.

 

అది కూడా వెళ్లే సమయంలో ఓపెన్‌టాప్‌ జీపులో చేతులు బయటకు ఊపుతూ కనీసం ఎవరూ చనిపోయారు, ఎవరూ గాయాలు పాలయ్యారు అని చూడకుండా ఉండటం ఎంత వరకు సబబు అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికీ ప్రమాదంలో గాయపడిన బాబు పరిస్థితి ఆందోళన కరంగా ఉందనీ .. కనీసం సినీ పెద్దలు కానీ, రాజకీయ ప్రముఖలు కానీ వెళ్ల లేదని ఇదా అధ్యక్ష మానవత్వం అంటే అని రేవంత్‌రెడ్డి అన్నారు. ఒక్కరోజు జైలులో ఉన్నందుకు అల్లుఅర్జున్‌కు పదుల సంఖ్యలో పరామర్శలు, ప్రభుత్వంపైన విమర్శలు చేస్తున్నారని, అల్లుఅర్జున్‌ ఏమైనా గాయపడ్డారా..? ఏమైనా జరిగిందా..? అని నిలదీశారు. ఒక్క రోజు జైలులో ఉంటేనే మీకు అలా ఉంటే అక్కడ ఒకరి ప్రాణం పోవటంతో, ఏమీన తెలియని చిన్నారి కోమాలోకి వెళ్లిపోతే బాధ కలగదా అని అన్నారు.

 

అల్లుఅర్జున్‌ను కావాలనే ప్రభుత్వం అరెస్టు చేసిందని పదేళ్లు పాలించిన ఒక నాయకుడు ట్విటర్‌లో ఇష్టం వొచ్చినట్లు కామెంట్లు పెడుతున్నారని, సమాజం ఎటువైపు పోతుందని ఆయనకు కనీస మానవత్వం కూడా లేదా అని ప్రశ్నించారు. అదే మన ఇంట్లో ఇలాంటి ఘటన జరిగితే మనం ఊరుకుంటామా అని అన్నారు. మరీ అలాంటప్పుడు సినీ హీరోలను అరెస్టు చేయవొద్దని ఏమైనా చట్టాలు ఉన్నాయా.. లేకపోతే చేయండి అధ్యక్షా.. అలానే చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఒకింత అసహనానికి లోనయ్యారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చేసిన చట్టం ప్రకారం పోలీసులు నడుచుకుంటారని వారు రాజకీయ నాయకులా.. సినీ హీరోలా అని చూడరని అన్నారు. నిజంగా హీరోలంటే తెరపైన కాదు.. నిజజీవితంలో ఎలా ఉండాలో చూపిస్తే వారిని ప్రేమిస్తే అభిమానులకు మేలు జరుగుతుందని ఆయన హితవు పలికారు. ఇప్పటికైనా అర్థంపర్థంలేని కామెంట్లు చేయకుండా కనీస మానవత్వాన్ని చాటుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.

ఇలాంటి ఘటనలు ఎవరూ హర్షించరు : అక్బరుద్దీన్‌
సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనను మానవత్వం ఉన్న ఎవరూ హర్షించరని, దానికి బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ అన్నారు. మనకు పిల్లలు ఉన్నారని, ఇలాంటి ఘటనను తీవ్రంగా వ్యతిరేకించాల్సిందేనని అన్నారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని కోరుకున్నట్లు చెప్పారు. సినీ ప్రముఖులు కూడా ఆ బాలుడిని పరామర్శించకపోవడం సరైన పద్ధతి కాదన్నారు. ఇంకా ఘటనకు బాధ్యులైన వారికే సానుభూతి పలకడం ఎంత వరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో ఎటువంటి సందేహాలు అవసరం లేదని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page