పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలు నెరవేర్చాలి
రాష్ట్రానికి రావల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలి
సిఎం రేవంత్‌తో కలిసి ప్రధాని మోదీతో భేటీ వివరాలను మీడియాకు వెల్లడిరచిన డిప్యూటీ సిఎం భట్టి
రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధానిని కలిసామని వెల్లడి
న్యూ దిల్లీ, ప్రజాతంత్ర,డిసెంబర్ 26 : పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల్లోనూ ఒక్కో ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని తెలిపారని, అందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించినందున తెలంగాణలోనూ అదే మాదిరి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని వారు కోరారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తొలిసారిగా దిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో మంగళవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను వారు ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రధాని మోదీతో భేటీ అనంతరం సిఎం రేవంత్ రెడ్డితో కలిసి డిప్యూటీ సిఎం భట్టి మీడియాకు వివరాలు వెల్లడిరచారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ…రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామాకాల కోసమని, కానీ గత పది సంవత్సరాలలో గత ప్రభుత్వం కేంద్రం నుంచి రావలసిన, విభజన చట్టంలో పొందు పరిచిన రాష్ట్రానికి చెందిన పలు హక్కులను, ప్రయోజనాలను పట్టించుకోలేదని, సాధ్యమైనంత త్వరగా వాటిని రాష్ట్రానికి అందించాల్సిందిగా ప్రధానిని కోరామని తెలిపారు. అందులో భాగంగా ప్రధానంగా బయ్యారంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం, ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న యుపిఏ ప్రభుత్వం మంజూరు చేసిన ఐటిఐఆర్‌లను ప్రధాని దృష్టికి తెస్తూ వాటిని వెంటనే నెలకొల్పాలని కోరామని భట్టి తెలిపారు. అదే విధంగా హైదరాబాద్‌కు ఐఐఎం మంజూరు చేయాల్సిందిగా కోరామన్నారు. ఇక రాష్ట్రంలో 14 రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రతిపాదనలు పంపించామని, అందులో కేవలం రెండిరటికే ఆమోదం తెలిపారని మిగతా 12 రహదారుల అప్‌గ్రేడ్ కోసం కూడా ఆమోదం తెలపాలని కోరినట్లు తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం 2015 నుంచి 2021 వరకు ప్రతి ఏటా రూ.450 కోట్లు చొప్పున రూ.2250 కోట్లను కేంద్రం విడుదల చేసిందని, 2019-20, 21-22, 22-23, 23-24 సంవత్సరాలకు సంబంధించి పెండిరగ్ గ్రాంట్లు రూ.1800 కోట్లు విడుదల చేయాలని ప్రధానమంత్రిని కోరినట్లు భట్టి తెలపారు.
అదే విధంగా పెండిరగ్‌లో ఉంచిన 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.2233.54 కోట్లు (2022-23కు సంబంధించి రూ.129.69 కోట్లు, 2023-24కు సంబంధించి రూ.1608.85 కోట్లు) వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఇంకా ములుగులోని గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిందని, 2023-24 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు అనుమతి ఇవ్వాలని, పీఎం మిత్ర కింద గుర్తించిన ఏడు మెగా జౌళి పార్కుల్లో వరంగల్‌లోని కాకతీయ మెగా జౌళి పార్కును బ్రౌన్ ఫీల్డ్ పార్కుగా ప్రకటించడంతో దానికి రావల్సినన్ని నిధులు రానందున వెంటనే దానిని గ్రీన్‌ఫీల్డ్‌లోకి మార్చాలని, భారతీయ సైన్యానికి సంబంధించిన ప్రధాన కార్యాలయాలు అన్ని ప్రాంతాల్లో ఉన్నా దక్షిణాదిలో లేనందున పుణెలో ఉన్న ప్రధాన కార్యాలయాన్ని సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు తరలించాలని, రాష్ట్ర పునర్విభజన చట్టం తొమ్మిదో షెడ్యూల్‌లోని ప్రభుత్వ సంస్థల విభజన, పదో షెడ్యూల్‌లోని సంస్థల అంశాలను పరిష్కరించాలని, దిల్లీలోని ఉమ్మడి భవన్ విభజనకు సహకరించాలని ప్రధానికి సమర్పించిన వినతి పత్రంలో కోరారు.





