దుష్ట సంప్రదాయానికి తెర తీసింది కేసీఆరే..

– పీజేఆర్‌ చనిపోతే అప్పుడు పోటీ పెట్టింది ఈయనే
– ఇపుడు సెంటిమెంట్‌తో ఓట్లు పొందాలని నాటకాలు
– బీఆర్‌ఎస్‌, బీజేపీలది ఫెవికాల్‌ బంధం
– గులాబీ పార్టీ వాళ్లొస్తే కర్రు కాల్చి వాత పెట్టండి
– నగర అభివృద్ధికి అడ్డం పడుతున్న కిషన్‌రెడ్డి
– వెంగళరావు నగర్‌ కార్నర్‌ మీటింగ్‌లో సీఎం ప్రచారం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31: అవకాశం వచ్చినప్పుడు మన బిడ్డను గెలిపించుకోకపోతే చారిత్రక తప్పిదం అవుతుంది అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వెంగళరావు నగర్‌లో శుక్రవారం రాత్రి జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు. సెంటిమెంట్‌పై బీఆర్‌ఎస్‌ మాట్లాడుతోందని, కేసీఆర్‌ను ఓ మాట అడగదలచుకున్నానంటూ 2007లో పేదల దేవుడు పీజేఆర్‌ అకాల మరణం చెందితే వైరి పక్షాలు బీజేపీ, టీడీపీ ఆయనపై గౌరవంతో పీజేఆర్‌ కుటుంబాన్ని ఏకగ్రీవం చేయాలంటే టీఅసస్‌ నుంచి బరిలో పెట్టింది కేసీఆర్‌ కాదా..ఈ దుష్ట సంప్రదాయానికి తెర తీసింది ఆయన కాదా అని ప్రశ్నించారు. అలాంటి వాళ్లు ఇవాళ సానుభూతితో ఓట్లు పొందాలని చూస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ఆనాడు పీజేఆర్‌పై పోటీ పెట్టిన మీకు ఇవాళ సానుభూతి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. కంటోన్మెంట్‌లోనూ సానుభూతితో గెలవాలని మొసలి కన్నీరు కార్చారు.. కానీ ప్రజలు అభివృద్ధికే ఓటు వేసి శ్రీగణేశ్‌ను గెలిపించారు అని చెప్పారు. ఇవాళ రూ.4 వేల కోట్లతో కంటోన్మెంట్‌ అభివృద్ధి జరుగుతోందని, పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు, ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నాయన, మున్సిపల్‌ మంత్రిగా ఉన్నాయన జూబ్లీహిల్స్‌కు వచ్చారా.. ఇక్కడి ప్రజల ముఖం చూశారా.. మీ సమస్యల గురించి పట్టించుకున్నారా? అని నిలదీశారు. తాము ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలనుకుంటుంటే నంగనాచి కిషన్‌ రెడ్డి మెట్రో రైలుకు అడ్డం పడుతుండు.. మూసీకి అడ్డుపడుతుండు.. రేవంత్‌ రెడ్డికి, కాంగ్రెస్‌కు పేరొస్తుందనే బీఆర్‌ఎస్‌తో కుమ్మక్కయిండు అని సీఎం ఆరోపించారు.

బీజేపీ, బీఆరెస్‌ది ఫెవికాల్‌ బంధం

పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎనిమిది పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ అవయవదానం చేసి బీజేపీని గెలిపించిందన్నారు. బీజేపీకి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి ఏమైనా నిధులు తెచ్చారా? సిగ్గులేకుండా జూబ్లీహిల్స్‌లో కార్పెట్‌ బాంబింగ్‌ చేస్తామని చెబుతున్నారు.. ఏం తెచ్చారని, మోదీ ఏం ఇచ్చారని బీజేపీ ఎంపీలు ఇక్కడ తిరుగుతున్నారు అని నిలదీశారు. మేం ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే ఆటోవాళ్లను రెచ్చగొట్టి ఫ్రీ బస్సు బంజేయాలని బయలుదేరారు.. బిల్లా రంగాలు ఆటోలలో తిరుగుతూ ఫోటోలు దిగుతున్నారు.
బీఆరెఎస్‌్‌ వాళ్లు వస్తే మా అక్కలు కర్రు కాల్చి వాత పెట్టాలి అని పిలుపునిచ్చారు.యువకుడు నవీన్‌ యాదవ్‌ను గెలిపించండి.. అసెంబ్లీలో మీ గొంతుకై మీ సమస్యలను ప్రస్తావిస్తాడు అని ఓటరక్లకు విజ్ఞప్తి చేశారు.

సెంటిమెంట్‌ కాదు- అభివృద్ధి కావాలి
ఎమ్మెల్యేగా నవీన్‌ యాదవ్‌, మంత్రిగా అజారుద్దీన్‌ మీకు అండగా ఉంటారు..జూబ్లీహిల్స్‌లో గెలిపించండి.. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా.. గంజాయి, డ్రగ్స్‌ను పెంచి పోషించిన వాళ్లు రౌడీలా.. పేదోళ్లకు అండగా ఉండే నవీన్‌ యాదవ్‌ రౌడీనా మీరే ఆలోచించండి అన్నారు. పదేళ్లు దోచుకున్న దోపిడీ దొంగలు ముసుగు వేసుకుని జూబ్లీహిల్స్‌ వస్తున్నారు. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తే బీజేపీకి ఎందుకంత కడుపుమంట అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్‌ నుంచి నాకొక కుడి భుజాన్ని ఇవ్వండి.. మీ సమస్యల పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page