ప్రేమ‌, క‌రుణ సందేశాల‌నిచ్చే క్రిస్మ‌స్‌

– భిన్న‌త్వంలో ఏక‌త్వం సంప్ర‌దాయాన్ని బ‌ల‌ప‌రుస్తాం
– అన్ని మ‌తాల పండుగ‌ల‌కు స‌మాన ప్రాధాన్యం
– మైనారిటీ సంక్షేమశాఖ‌ మంత్రి అజ‌రుద్దీన్‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 15: క్రిస్మస్ అనేది ఆనందం, సంతోషం, ఐక్యతతో పాటు ప్రేమ, శాంతి, కరుణ సందేశాలను సమాజానికి చాటి చెప్పే పవిత్ర పండుగ అని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మ‌హ‌మ్మ‌ద్ అజరుద్దీన్ అన్నారు. డా. బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో నిర్వహించిన సచివాలయ క్రైస్తవ ఉద్యోగుల క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తాను క్రైస్తవ విద్యాసంస్థలో చదువుకున్నానని, అక్కడ ప్రతి సంవత్సరం క్రిస్మస్‌ను ఎంతో ఆత్మీయంగా, ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకునే అవకాశం లభించిందని గుర్తు చేశారు. స్నేహితులు, ఉపాధ్యాయులతో కలిసి ఐక్యత, స్నేహభావం నిండిన వాతావరణంలో క్రిస్మస్ వేడుకలను జరుపుకున్న రోజులను ఆయన స్మరించుకున్నారు. బాక్సింగ్ డే సందర్భంగా క్రికెట్ మ్యాచ్‌లు ఆడటం తమ విద్యార్థి దశలో ఒక మధురమైన సంప్రదాయమని పేర్కొంటూ, అవి క్రమశిక్షణ, జట్టు సమన్వయం, క్రీడాస్ఫూర్తి, పరస్పర గౌరవం వంటి విలువలను నేర్పాయని తెలిపారు.క్రిస్మస్ పండుగ పేదల పట్ల సహానుభూతి, పంచుకునే స్వభావం, సమాజంలో పరస్పర సంబంధాలను బలపరచుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తుందని మంత్రి అజారుద్దీన్ అన్నారు. ఇటువంటి పండుగలు సామాజిక సామరస్యతను పెంపొందిస్తూ, భారతదేశపు “భిన్న‌త్వంలో ఏకత్వం” అనే మహత్తర సంప్రదాయాన్ని మరింత బలపరుస్తాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల పండుగలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ, శాంతియుతంగా, సమగ్రంగా, ఆనందోత్సాహాలతో జరుపుకునేలా కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. క్రైస్తవ సోదరసమాజానికి హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పండుగ ప్రతి ఇంటికి శాంతి, సమృద్ధి, ఆనందాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రైస్తవ సమాజానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రేవ్. డా. జాన్ వెస్లీ ప్రేరణాత్మక క్రైస్తవ సందేశాన్ని అందిస్తూ, ప్రేమ, శాంతి, కరుణ, సేవాభావం వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని, సమాజంలో సౌహార్దం సద్భావాన్ని విస్తరించాలంటూ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ బెన్‌హర్ మహేశ్ దత్ ఎక్కా, క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ సబిత, సచివాలయ క్రైస్తవ ఉద్యోగుల సంఘ సభ్యులు లాల్ బహదూర్ శాస్త్రి, చిట్టి బాబు, శశిభూషణ్, మనోహరమ్మ, జాకబ్ రాస్ తదితరులు పాల్గొన్నారు. సెక్రటరియేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గిరి శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి ప్రేమ్, సెక్రటరీ అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలు రామ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page