భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు..
విద్యుత్ , వైద్య సేవల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ప్రతీక్ జైన్
డంగల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పోలేపల్లి ఎల్లమ్మ జాతరను శుక్రవారం సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఏర్పాట్లను పరిశీలించారు. గురువారం కొడంగల్ నియోజకవర్గం దుద్యాల్ మండలం పోలెపల్లి గ్రామంలో ఈనెల 20 నుంచి ప్రారంభమయే పోలెపల్లి ఎల్లమ్మ దేవస్థానం జాతరకు ముఖ్యమంత్రి వొస్తున్న సందర్బంగా విస్తృత ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సందర్బంగా హెలిప్యాడ్, తాగునీరు, స్నానాల గదులు, తాత్కాలిక మరుగుదొడ్లు, కంట్రోల్ రూమ్, నాలుగు ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు, వైద్య సౌకర్యాలను పరిశీలించారు.. జాతరకు వొచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. పోలీసు శాఖ బందోబస్తు ఏర్పాటుచేసి నిరంతరం పర్యవేక్షణ చేపడుతుందన్నారు.
జిల్లా ఎస్‌పి నారాయణ రెడ్డి, సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, అదనపు కలెక్టర్‌లు లింగ్యా నాయక్, సుధీర్‌లతో కలిసి సంబంధిత అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామన్నారు. వారం రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నందున జాతరకు సుమారు లక్షకు పైగా వొచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లుతెలిపారు.. నిరంతర విద్యుత్ సరఫరా కోసం నాలుగు అదనపు ట్రాన్సఫార్మర్లు, లైట్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. అత్యవసరమయ్యే మందులు అందుబాటులో ఉంటాయి , డాక్టర్లు, వైద్య సిబ్బంది భక్తులకు నిరంతరం సేవలందిస్తూ 24 గంటలు అందుబాటులో ఉంటారన్నారు.
శానిటేషన్ విస్తృతంగా చేపట్టి బ్లీచింగ్ చేయించామని అన్నారు.జాతరకు సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు త్రాగునీరు, మొబైల్ టై లెట్స్ ఏర్పాటు చేశామన్నారు. ముందు జాగ్రత్త గా ఫైర్ ఇంజన్ ను అందుబాటులో ఉంచామని, జాతర నిర్వహిస్తున్న వారం రోజులు ఆలయం విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా కనిపించేందుకు , ఆలయ ప్రాంగణమంతా లైట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. హెలిప్యాడ్, పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ తో పాటు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, అదనపు కలెక్టర్ లు లింగ్యా నాయక్, సుధీర్, ట్రైని కలెక్టర్ ఉమహారతి, కడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, దేవాలయం ఈవో రాజేందర్ రెడ్డి, చైర్మన్ జయరాములు, డిపివో జయసుధ ఎలక్ట్రిసిటీ ఎస్‌ఈ లీలావతి ,ఆర్‌అండ్‌బి అధికారులు పాల్గొన్నారు.