రెండు పార్టీలూ కలిసే పనిచేస్తున్నాయ్
అరాచకాలపై బీజేపీ నోరు విప్పడం లేదు
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 28 : రాజకీయ లబ్ధి కోసం కమలం, కాంగ్రెస్ నేతలు కలిసికట్టుగా పని• •స్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎన్ని అరాచకాలు జరిగినా ఒక్కరూ నోరు మెదపరని విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ చేతిలో కమలం జాగ్రత్తగా ఉందంటూ ఎద్దేవా చేశారు. చీకటి రాజకీయ ప్రయోజనాల కోసం ‘చేతి’ కలుపుతూ చోటేభాయ్ కోసం కలిసి పని చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగాలని, అంతా కలసికట్టుగా పనిచేయాలని ప్రధాని మోదీ ఆ పార్టీ ఎంపీలకు సూచించిన విషయం తెలిసిందే.
ప్రధాని వ్యాఖ్యలపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘కలిసికట్టుగానే పని చేస్తున్నారు మీ కమలం నేతలు. కాంగ్రెస్ నేతలతో కలిసిపోయి మరీ పని చేస్తున్నారు. చోటేభాయ్ కు వ్యూహకర్తగా.. కాంగ్రెస్ కట్టర్ కార్యకర్తలుగా విశ్రమించకుండా పని చేస్తున్నారు. చీకటి రాజకీయ ప్రయోజనాల కోసం ‘చేతి’ కలుపుతూ చోటే భాయ్ కోసం కలిసి పని చేస్తున్నారు. ఎన్ని అరాచకాలు జరిగినా ఒక్కరూ నోరుమెదపరు. రేవంత్ మీద ఈగ వాలకుండా కాపాడుకుంటారు. హైడ్రా మంచిదంటారు, మూసీ కావాలంటారు, ఏమన్నా అంటే నిద్ర నటిస్తారు. పిల్లలు చనిపోయినా, రైతు గుండె పగిలినా, గిరిజనులను చెరపట్టినా.. చప్పట్లు కొడతారు. తెలంగాణలో వారి చేతిలోనే కమలం ఉంది.. జాగ్రత్తగా.. భద్రంగా!’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.