*రౌడీ పంచాయితీలు చేయడమూ తెలుసు
*ప్రజలను కాపాడాల్సిందిపోయి, భయపెడతారా?
*కాంగ్రెస్ ప్రభుత్వం వొచ్చాక ప్రజలు ఏం కోల్పోయారో అర్థమైంది
*వొచ్చేది నూటికి నూరు శాతం బిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వమే..:బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె .చంద్రశేఖర్‌రావు
తిట్టడం మాకూ వొచ్చనీ…ఇవాళ మొదలు పెడితే రేపటి వరకు తిడతా అని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. శనివారం సాయంత్రం సిద్ధిపేట జిల్లాలోని ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో సినీమా ప్రొడ్యూసర్ పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి, సినీ ఆర్టిస్ట్ రవితేజ తదితరులు కేసీఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరారు. వారందరికీ కేసీఆర్ గులాబీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పాలకుర్తి నియోజకవర్గ బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ… కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రౌడీ పంచాయితీలు చేయడం మాకు కూడా తెలుసునన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 11నెలలు గడిచిందనీ, ఈ 11నెలల కాలంలోనే ప్రజలు ఏం కోల్పోయారో ప్రజలందరికీ అర్థమైందన్నారు. సేవ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీకు ప్రజలు ఇచ్చినప్పుడు ప్రజలను కాపాడాల్సింది పోయి భయపెడతారా?అని ప్రశ్నించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బాధ్యతను అప్పగించారన్నారు. ప్రజలకు ప్రభుత్వం బాధ్యాతాయుతంగా సేవ చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారాన్ని ఇచ్చింది కూల్చడానికి కాదనీ, నిర్మించడానికి అన్నారు. ప్రభుత్వం అంటే అందరినీ కాపాడుకోవాలన్నారు. కూలగొడతామని పిచ్చిగా మాట్లాడొద్దనీ, సమాజాన్ని నిలబెట్టి నిర్మాణాన్ని చేయాలన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజల చెబుతున్నారనీ మళ్లీ మన ప్రభుత్వమే అధికారంలోకి వొస్తుందన్నారు. వొచ్చే ఎన్నికల్లో 100శాతం మనమే అధికారంలోకి వొస్తామన్నారు. అందులో అనుమానమే లేదనీ, ప్రలు ఏమి కోల్పోయారో వారికి అర్థమైందన్నారు. ప్రజలు మనపై విశ్వాసంతో ఉన్నారన్నారు. అందరూ కష్టపడి పని చేయాలని, అధికారంలోకి రాగానే వాడిని లోపల వేయాలి, వీడిని లోపల వేయాలని మనం చూడం అన్నారు. ప్రభుత్వం అంటే అందరినీ కాపాడాలన్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ఎలా మాట్లాడుతున్నారో మీరే చూస్తున్నారన్నారు. గత ఎన్నికల్లో మన మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలను 10శాతమే..కానీ, 90శాతం ఎవరు అడగకున్నా పనులు చేసి చూపించామన్నారు. మళ్లీ రానున్నది బిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వమేనని చెప్పారు. అరెస్టులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.