రెండేళ్ల తరువాత అయినా రేటింగ్‌ మారుతోందా?

“ప్రతిపక్షంగా బిఆర్‌ఎస్‌ పనితీరును ప్రశంసించవలసిందే. ఓటమి నుంచి మానసికంగా తేరుకోకముందే, ప్రభుత్వం మీద ఎదురుదాడి చేయడమే వ్యూహంగా ఆ పార్టీ రంగంలోకి దిగింది. కొన్ని చోట్ల ఆందోళనలను నేరుగా నడిపింది. మరికొన్నిసార్లు తెరవెనుక సాయాలు అందించింది. సామాజిక మాధ్యమాల ద్వారా తీవ్రమైన ప్రచారాన్నిసాగిస్తూ ఉంది. రేవంత్‌ మీద, ఆయన ప్రభుత్వ సహచరుల మీద అవినీతి ఆరోపణలు చేసింది. చంద్రబాబుతో అనుబంధాన్ని, ఆంధ్ర అనుకూల విధానాలను ఎత్తిచూపింది. అన్నిటికి మించి, అధికారపక్షం నుంచి ఎదురైన ఫిరాయింపుల వ్యూహాన్ని విజయవంతంగా హద్దులలోపల నిలువరించగలిగింది. అటువైపు ఒరిగిన వాళ్ల అనర్హత మీద పట్టుపట్టి, వ్యాజ్యాలు నడిపింది. తమ పాలనపై ప్రజల వ్యతిరేకతకు కారణమైన అంశాలకు క్షమాపణో, పశ్చాత్తాపమో ప్రకటించడానికి మాత్రం ససేమిరా అంటూ వచ్చింది.”

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తిరిగి అధికారంలోకి వస్తారని యుపి మాజీముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ నాయకుడు అఖిలేశ్‌ యాదవ్‌ బిఆర్‌ఎస్‌ నాయకులకు ఆశ్వాసన ఇచ్చారు. ఓడిపోయి, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి సాధారణంగా ఇచ్చే ఓదార్పు అది. అధికారపక్షాన్ని ముప్పుతిప్పలు పెట్టడానికి ప్రయత్నిస్తూ, ప్రజాక్షేత్రంలో పనిచేసే పార్టీకి తక్షణ లక్ష్యం కూడా అధికారసాధనే. పైగా, తెలంగాణ సాధనలో ముఖ్యపాత్ర వహించి, నూతన రాష్ట్రంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న పార్టీని, ప్రజలు కూడా నిత్యప్రత్యామ్నాయంగా పరిగణిస్తారు. మరి, రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల తరువాత, అధికారపక్షం జనాదరణ ఎట్లా ఉన్నది? పై చేయి కావడానికి ప్రతిపక్ష ప్రయాణం ఎట్లా జరుగుతున్నది?

రెండేళ్ల సందర్భంగానే కాదు, ఈ చర్చ, ఎన్నికలు జరిగిన ఆరునెలల నుంచే ప్రజలలో ఉంటున్నది. తెలంగాణ సమాజం వ్యక్తం చేస్తున్న రకరకాల సంకేతాల గూఢార్థాలను కనుగొనడానికి పరిశీలకులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలుకాకపోవడం, అనేక వాగ్దానాలను నెరవేర్చలేకపోవడం వంటివి తొందరలోనే ప్రభుత్వం మీద ఒక విరక్తభావాన్నికలిగించి ఉండాలి. కెసిఆర్‌ను, ఆయన ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసిన పనులనే రేవంత్‌ కూడా చేస్తూ ఉంటే, గట్టిగా నిలదీసినప్పుడు అదే తీరులో నిర్బంధకాండ అమలుచేస్తుంటే ప్రజలకు బాగా కోపం వచ్చి ఉండాలి. అసంతృప్తి కలగలేదని కాదు, కానీ, అది వ్యతిరేకతగా రూపుదిద్దుకోవడం లేదు. తాము బిఆర్‌ఎస్‌ ను ఓడించి పొరపాటు చేశామనే పశ్చాత్తాపం కూడా జనంలో తగినంతగా ఏర్పడలేదు. కొత్తప్రభుత్వానికి ఏడాది అయినతర్వాత అయినా, రెండేళ్ల తరువాత అయినా, పరిస్థితిలో తేడా లేదు. అట్లాగని, రేవంత్‌ రెడ్డి మీద సానుకూల అభిప్రాయం ఏర్పడిందా? తాము కోరుకున్న ప్రభుత్వం ఇదేనని జనం సంబరపడుతున్నారా? అంటే అదీ లేదు! తెలంగాణ మీద తనదైన ముద్ర వేయాలన్న దృష్టితో సంకల్పిస్తున్న ప్రాజెక్టులు, కొత్తనగరాలకు ప్రజలు ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నారా, అబ్బే, అదేమీ లేదు. యథాతథాన్ని సహిద్దాము, భరిద్దాము అన్న ధోరణిలోనే వ్యక్తమవుతున్న పంచాయతి ఎన్నికల ఫలితాలను కూడా చూశాక, ఏమిటి మరి ప్రస్తుత పరిస్థితి?

ప్రతిపక్షంగా బిఆర్‌ఎస్‌ పనితీరును ప్రశంసించవలసిందే. ఓటమి నుంచి మానసికంగా తేరుకోకముందే, ప్రభుత్వం మీద ఎదురుదాడి చేయడమే వ్యూహంగా ఆ పార్టీ రంగంలోకి దిగింది. కొన్ని చోట్ల ఆందోళనలను నేరుగా నడిపింది. మరికొన్నిసార్లు తెరవెనుక సాయాలు అందించింది. సామాజిక మాధ్యమాల ద్వారా తీవ్రమైన ప్రచారాన్నిసాగిస్తూ ఉంది. రేవంత్‌ మీద, ఆయన ప్రభుత్వ సహచరుల మీద అవినీతి ఆరోపణలు చేసింది. చంద్రబాబుతో అనుబంధాన్ని, ఆంధ్ర అనుకూల విధానాలను ఎత్తిచూపింది. అన్నిటికి మించి, అధికారపక్షం నుంచి ఎదురైన ఫిరాయింపుల వ్యూహాన్ని విజయవంతంగా హద్దులలోపల నిలువరించగలిగింది. అటువైపు ఒరిగిన వాళ్ల అనర్హత మీద పట్టుపట్టి, వ్యాజ్యాలు నడిపింది. తమ పాలనపై ప్రజల వ్యతిరేకతకు కారణమైన అంశాలకు క్షమాపణో, పశ్చాత్తాపమో ప్రకటించడానికి మాత్రం ససేమిరా అంటూ వచ్చింది. ఓటమి కూడా ఒకందుకు మంచిదేనని, విధానాలను, పనితీరును సమీక్షించుకోవడానికి ఒక మంచి అవకాశమనీ అఖిలేశ్‌యాదవ్‌ చెప్పిన మాటను బిఆర్‌ఎస్‌ ఇప్పడైనా సీరియస్‌గా తీసుకోవచ్చు.

“ఏ కొత్తదనమూ లేని పాత విజన్‌లనే నాలుగోనగరానికి విస్తరింపజేసే ప్లాన్‌లో నిర్వహించిన సమ్మిట్‌కు, అది జరిగినంత స్థాయిలో ప్రచారం దొరకలేదు. అయితే, ఆయన కాంతివలయం మునుపటి మినుకుల నుంచి కొంత వెలుగు పెంచుకుంది. మెస్సీతో ఫుట్‌బాల్‌ ఆట తరువాత, ఆయన ఇమేజ్‌ కు మరింత మరమ్మత్తు జరగవచ్చు. పార్టీకి నష్టమైనా, రేవంత్‌ కు జరిగిన మేలు ఏమిటంటే, తాజాగా బిహార్‌ తో సహా, ఉత్తరాది ఓటములు. అధిష్ఠానం దృష్టిలో ఆయన విలువ పెరిగింది. అసంతృప్తులు పక్కకు పోయాయి. బిజెపి నుంచి సమస్యలు రాకుండా ఈయన మేనేజ్‌ చేస్తున్నారా? వారే తగ్గి ఉంటున్నారా?మరేదైనా మతలబు ఉన్నదా? అన్నది తెలియదు కానీ, అది కూడా రేవంత్‌కు కలసివస్తున్న అంశమే.”

గెలుపొందిన తరువాత కూడా రేవంత్ రెడ్డి, బిఆర్‌ఎస్‌ ను తేలికగా తీసుకోలేదు. ప్రాంతీయపార్టీని పూర్తిగా బలహీనం చేయడంలో బిజెపికి, కాంగ్రెస్‌ కు ఉమ్మడి ప్రయోజనాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ సీట్లు సంపాదించుకున్న బిఆర్‌ఎస్‌, పార్లమెంటు ఎన్నికల్లో సున్నా అయింది. ఎనిమిది సీట్లు గెలుచుకున్నా, బిజెపి, ఇప్పటికీ బిఆర్‌ఎస్‌నే గురిపెట్టి మాట్లాడుతున్నది. బాగా దెబ్బతిన్న ప్రతిపక్షాన్ని మరింతగా కునారిల్లజేయడానికి రేవంత్‌ ప్రభుత్వం అనేక ఆరోపణల మీద విచారణలు, దర్యాప్తులు సాగిస్తూ వచ్చింది. కాళేశ్వరం విచారణ, టెలిఫోన్‌ ట్యాపింగ్‌ బిఆర్‌ఎస్‌ కు పెద్ద తలనెప్పులుగా తయారయ్యాయి. రేవంత్‌ ప్రభుత్వం భూఅవినీతి గురించి బిఆర్ఎస్‌ పెద్ద ఎత్తున ప్రచారాన్ని బాహాటంగాను, పత్రికాముఖంగానూ చేస్తుండగా, ప్రభుత్వానుకూల పత్రికల ద్వారా బిఆర్‌ఎస్‌ నేతల భూ అక్రమాల గురించి పోటీ కథనాలు రాసాగాయి. అనువైన సమయం కాదని, ఫామ్‌హౌస్‌కే అగ్రనాయకుడు పరిమితం కాగా, కెటిఆర్‌, హరీశ్‌రావు తమ తమ పద్ధతుల్లో పార్టీ కార్యక్రమాలు నడుపుతూ వస్తున్నారు. ఇద్దరి మధ్యా ఒక ప్రచ్ఛన్న స్పర్థ కనిపిస్తోందని పరిశీలకులు గుర్తిస్తుండగా, కవిత ఉదంతం, బిఆర్‌ఎస్‌ను మరింతగా ఇరకాటంలో పడవేసింది. తండ్రిని గౌరవిస్తూ, తక్కిన పార్టీ పెద్దల మీద ధ్వజం ఎత్తిన కవిత, ఇప్పుడు, బిఆర్‌ఎస్‌ నేతల అవినీతి గురించి వరుస ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. కుటుంబం ఒకటిగా లేదని, లోపలి నుంచే ముసలం పుట్టిందని జనం అనుకుంటుండగా, ఉద్యమకాలంలో కూడా వసూళ్లు చేశారని పార్టీ నేతల మీద ఆమె చేసిన ఆరోపణలు మొత్తంగా పార్టీ చరిత్రనే లక్ష్యంగా పెట్టుకున్నాయి. చురుకుగా, దూకుడుగా పనిచేస్తూ, ప్రతిపక్ష ప్రతిష్ఠను పెంచుకునే ప్రయత్నంలో బిఆర్‌ఎస్‌ ఉండగా, మరోవైపు నుంచి దాన్ని కల్వకుంట్ల కవిత మసకబార్చే పని చేస్తున్నారు. రెండేళ్ల తరువాత కూడా బిఆర్ఎస్‌ గ్రాఫ్‌ పెరగకపోవడానికి కర్ణుడి చావుకు ఉన్నన్ని కారణాలు ఉన్నాయి.

ప్రతిపక్షం ప్రభావాన్ని నియంత్రిస్తూ ఉండడమే రేవంత్‌రెడ్డి ప్రధాన విజయం అనుకోవచ్చు. బిఆర్‌ఎస్‌ మీద వ్యతిరేకత, ఉదాసీనత యథాతథంగా నిలపడం ద్వారా, రేవంత్‌ తన మీద అసంతృప్తిని వ్యతిరేకత స్థాయికి రాకుండా నిరోధించగలుగుతున్నారు. సొంతంగా తన పేరుప్రతిష్ఠలను పెంచుకోవడానికి కూడా రేవంత్‌ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆయన ఇమేజ్‌ ను పెంచడానికి పార్టీ, ప్రభుత్వ సహచరుల నుంచి అందే సహకారం తక్కువే. ప్రజలలో సానుకూల భావాలను కలిగించే విధంగా వ్యూహరచన చేయగలిగే సలహాదారులూ ఆయనకు కొరతే. పైగా, వివాదాస్పద నిర్ణయాలకు కారణమయి, ఇబ్బందులు కలిగించే సలహాలిచ్చేవారే ఎక్కువ. అందుకే, ఒక్కోసారి ఆయన నోరు మంచిది కాకుండా పోయి, రాష్ట్రం ఆయనకు మంచి కాకుండా పోతుంది. ఇప్పుడు ఏ కొత్తదనమూ లేని పాత విజన్‌లనే నాలుగోనగరానికి విస్తరింపజేసే ప్లాన్‌లో నిర్వహించిన సమ్మిట్‌కు, అది జరిగినంత స్థాయిలో ప్రచారం దొరకలేదు. అయితే, ఆయన కాంతివలయం మునుపటి మినుకుల నుంచి కొంత వెలుగు పెంచుకుంది. మెస్సీతో ఫుట్‌బాల్‌ ఆట తరువాత, ఆయన ఇమేజ్‌ కు మరింత మరమ్మత్తు జరగవచ్చు. పార్టీకి నష్టమైనా, రేవంత్‌ కు జరిగిన మేలు ఏమిటంటే, తాజాగా బిహార్‌ తో సహా, ఉత్తరాది ఓటములు. అధిష్ఠానం దృష్టిలో ఆయన విలువ పెరిగింది. అసంతృప్తులు పక్కకు పోయాయి. బిజెపి నుంచి సమస్యలు రాకుండా ఈయన మేనేజ్‌ చేస్తున్నారా? వారే తగ్గి ఉంటున్నారా?మరేదైనా మతలబు ఉన్నదా? అన్నది తెలియదు కానీ, అది కూడా రేవంత్‌కు కలసివస్తున్న అంశమే.

వారినీ వీరినీ బేరీజు వేస్తూ, ఎటూ తేల్చుకోలేకుండా ఉంటున్న ప్రజలు, ఎన్నికల సమీపించేదాకా ఆ త్రిశంకు స్థితిలోనే ఉంటారు. అంతరించని అహంకారంతో, అంతర్గత సమస్యలతో ఇబ్బంది పడుతున్న బిఆర్‌ఎస్‌ తన రేటింగ్‌ను పెంచుకోవాలంటే, కెసిఆర్‌ క్రియాశీలంగా రంగంలోకి దిగి, అన్నిటిని చక్కదిద్దడమే మార్గం. ఆఖరునిమిషంలో వచ్చి, మంత్రం వేస్తే అనుకూల వాతావరణం ఏర్పడుతుందని ఆశిస్తే అది పొరపాటు.

ఎదుటివారిని చిన్నగీతను చేసి తాను పెద్దగా కనిపించాలన్న రేవంత్‌ వ్యూహం ఎల్లకాలం కొనసాగదు. ఆయనంతట ఆయన మంచి అభివృద్ధి, సంక్షేమ విధానాలు అనుసరించి, ప్రజల నుంచి సానుకూలతను సంపాదించుకోవాలి. పరిపాలనపై ముద్ర వేయడం అంటే, సదస్సులు, ప్రాజెక్టు నమూనాలు మాత్రమే కాదు. రాష్ట్రప్రజల జీవన ప్రమాణాలలో మార్పు తీసుకురావడం, అట్టడుగు వ్యక్తి కూడా పురోగమించగలిగే సాధికార వాతావరణం కల్పించడం, ప్రాకృతిక, మానవ వనరులను సార్థకంగా వినియోగించగలగడం. అలా చేయగలిగితే, అనుకూల ఓట్లతోనే మళ్లీ గెలుపొందవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *