– నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చ
– ఈ అంశంపై ఉద్యమ కార్యాచరణకు బీఆర్‌ఎస్ సిద్ధం
– మీడియాకు వివరించనున్న కేసీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర,డిసెంబర్ 20: బీఆర్‌ఎస్ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గం తెలంగాణ భవన్‌లో ఆదివారం భేటీ కానున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో సమావేశం జరగనుంది. ఇందులో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొననున్నారు. నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టుల అంశంపై పోరుకు బీఆర్‌ఎస్ సిద్ధమవుతోంది. ఈ సమావేశంలో వీటిపై ఉద్యమ కార్యాచరణను కేసీఆర్ ప్రకటించనున్నట్లు సమాచారం. ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమి తర్వాత గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితమయ్యారు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సమావేశాలు, పార్టీ నేతలతో సమావేశాలను కూడా అక్కడి నుంచే నిర్వహిస్తూ వచ్చారు. అయితే రాష్ట్ర సాగునీటి హక్కుల రక్షణ కోసం కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్‌ఎస్‌ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరుగనుంది. నదీ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై సమరశంఖం పూరించనున్నారు. సాగునీటి హక్కుల రక్షణ కోసం మరో ప్రజా ఉద్యమంపై దిశానిర్దేశర చేయనున్నారు. బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్‌లో 45 టీఎంసీలకే కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకుందనేది బీఆర్‌ఎస్ వాదన. నదుల అనుసంధానం పేరుతో ఏపీ జల దోపిడీకి కేంద్రం సహకరిస్తోందని ఆ పార్టీ ఆరోపిస్తోంది. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా నోరు మెదపటం లేదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలను తెలంగాణ సమాజం ముందు దోషిగా నిలబెడతామని బీఆర్‌ఎస్ చెబుతోంది. మరోవైపు పార్టీ ప్రక్షాళనపైనా కేసీఆర్ దృష్టి సారించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.