సన్న వడ్ల బోనస్‌ కూడా బోగస్సే

మాజీ మంత్రి హరీష్‌రావు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 20: యాసంగిలో సన్నాల కొనుగోలు పూర్తయినా రూ.1,161 కోట్ల బోనస్‌ ఇంకా విడుదల చేయకపోవడం దుర్మార్గమని బీఆర్‌ఎస్‌ నాయకుడు హరీష్‌రావు విమర్శించారు. 4.01 లక్షల మంది రైతుల నుంచి 23.22 లక్షల టన్నుల సన్నాలు సేకరించిన ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా బోనస్‌ చెల్లించలేదన్నారు.
శుక్రవారం ఇక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ పొద్దు తిరుగుడు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉన్నదని, ఈ పంట కొనుగోలు పూర్తయి 75 రోజులు దాటినా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడం రైతుల పట్ల రేవంత్‌ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోందని విమర్శించారు. ఒక్క సిద్దిపేట జిల్లాలోనే 50 శాతం రైతులకు డబ్బులు ఇవ్వలేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆ పంట పండిరచిన రైతుల పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతోందని అన్నారు. పంట కొనుకారని, రెండు నెలలు దాటినా ఇప్పటికీ రైతుల ఖాతాలో డబ్బులు జమ కాకపోవడం శోచనీయమని అన్నారు. వెంటనే రాష్ట్రంలో పెండిరగ్‌లో ఉన్న రూ.1,116 కోట్ల సన్నాల బోనస్‌ డబ్బులతోపాటు పొద్దు తిరుగుడు రైతులకు పంట కొనుగోలు డబ్బులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ప్రతీచోట రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడిరదన్నారు. అబద్ధపు హామీలు, గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన మీరు పాలన కూడా అదే అబద్ధాలతో నడిపిస్తున్నారంటూ అడుగడుగునా ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యం బయటపడుతోందని ఎద్దేవా చేశారు. రుణమాఫీ 50 శాతం రైతులకి కూడా అందలేదు. పోయిన వానకాలం రైతు భరోసా ఎగ్గొట్టారు. యాసంగిలో రైతు భరోసా సగంమందికి కూడా ఇవ్వలేదు. ఎన్నికల ముందు రూ.15 వేల రైతు భరోసా అని చెప్పి మాట తప్పి రూ.12 వేలకు పరిమితం చేశారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా అని చెప్పి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. రైతు కూలీల పరిస్థితి అయితే అధోగతే. ఎన్నికల హామీల్లో అన్ని పంటలకు బోనస్‌ అని చెప్పి రైతులను మభ్యపెట్టి ఇప్పుడేమో సన్నాలకి పరిమితం చేసి ఆ సన్నాలకు కూడా ఎగనామం పెట్టారు. ఎంతో కష్టపడి పంట పండిస్తే అది ప్రభుత్వ కొనుగోళ్లు లేక దళారులపాలవుతోంది.. ఇక కొనుగోలు చేసిన పంటలకు డబ్బులివ్వకపోవడంతో ప్రభుత్వం రైతులను మరింత దయనీయ స్థితికి నెడుతున్నది. యాసంగిలో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రశ్నిస్తే తప్ప కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాని దుస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే రాష్ట్రంలో కొనుగోలు చేసిన పొద్దు తిరుగుడు పంటకు డబ్బులు విడుదల చేయాలని, అలాగే సన్నాలకు బోనస్‌ డబ్బులు కూడా విడుదల చేయాలని బీఆర్‌ఎస్‌ పక్షాన హరీష్‌రావు డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page