ప్రమాదంపై చురుకుగా కొనసాగుతున్న దర్యాప్తు
న్యూదిల్లీ : అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరో మృతదేహాన్ని సహాయక చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది శనివారం గుర్తించారు. అటు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తుండగా ఇటు శిథిలాలను సహాయక చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది తొలగిస్తుండగా శనివారం ఉదయం తోక భాగంలో ఓ మృతదేహాన్ని గుర్తించారు. అది విమానంలో విధులు నిర్వర్తించిన ఎయిర్ హోస్టెస్‌లలో ఒకరి మృతదేహమని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై విమానయాన శాఖ మంతి రామ్మోహన్ నాయుడు శనివారం దిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు అత్యున్నత స్థాయి కమిటీని కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనలో మ`తుల సంఖ్య 274కు చేరింది. ఇదిలావుండగా ప్రమాదానికి ముందు పైలట్ చివరి మాటలకు సంబంధించిన ఓ ఆడియో వెలుగులోకి వచ్చింది. కేవలం ఐదు సెకన్ల ఆ మెసేజ్‌లో సీనియర్ పైలట్ సుమిత్ సభ్రావల్.. ’మేడే.. మేడే.. మేడే.. నో పవర్.. నో థ్రస్ట్.. గోయింగ్ డౌన్‘ అని ఉంది. ఆ వెంటనే విమానం కూలిపోయింది.