బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలు  

ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ బిజెపి నాయకులు చిక్కుల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ఆ పార్టీ నాయకుడు రమేష్‌ బిధూరి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌, బిజెపిలమధ్య మాటల యుద్ధంతోపాటు, పరస్పర దాడులకు దారితీసింది. దిల్లీ  అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నవేళ బిజెపికి ఈ పరిణామాలు పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి. మరికొద్ది రోజుల్లో దిల్లీ  రాష్ట్ర ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో బిజెపి, ఆమ్‌ ఆద్మీపార్టీ(ఆప్‌) పార్టీలు నువ్వానేనా అన్నట్లు తల పడడానికి సిద్ధమవుతున్నాయి. అరవింద కేజ్రీవాల్‌ నాయకత్వంలో ఆప్‌ పార్టీ ఇప్పటికి రెండు సార్లు అధికారంలోకి వొచ్చింది. ఇప్పుడు హ్యాట్రిక్‌కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. కాగా పక్కలో బల్లెంలా దిల్లీ  మరో పార్టీ పాలనలో ఉండడాన్ని బిజెపి తట్టుకోలేకపోతున్నది. దిల్లీ  అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టిపరిస్థితిలో కాషాయ జంఢాను ఎగురవేయాలన్న దృఢ సంకల్పంతో బిజెపి దూసుకుపోతున్నది. ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి, అక్కడి ప్రజలకు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఆ దశలో బిజెపి నాయకులు వివాదాల్లో చిక్కుకోవడం ఆ పార్టీ విజయం పై  ప్రభావం పడనుంది. మాజీ ఎంపి రమేష్‌ బిధూరి ఇటీవల కాలంలో ఇద్దరు మహిళలపై నోరుజారారు. ఒకరు దిల్లీ  ముఖ్యమంత్రి అతిశీ, మరొకరు కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకగాంధీ వాద్రా కావడంతో విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.

రెండుసార్లు ఎంపీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా  ఎన్నికైన సీనియర్‌ నాయకుడు రమేష్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ప్రజలు, ముఖ్యంగా మహిళావర్గం తీవ్రంగా ఆక్షేపిస్తున్నది. మహిళల పట్ల బిజెపికి చిన్నచూపు ఉందా అన్న అనుమానాలకు దీనివల్ల తావేర్పడుతుందంటున్నారు విమర్శకులు. ఆయన వ్యాఖ్యలు ఒక విధంగా దేశ వ్యాప్తంగా చిచ్చు పెట్టేవిగా మారాయి. దేశవ్యాప్తంగా బిజెపిపైన తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఆయన చేసిన కామెంట్‌ మహిళా నాయకులపైన కావడంతో మహిళనుండి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అది తీవ్రస్థాయికి చేరుకుని బిజెపి, కాంగ్రెస్‌ కార్యాలయాలపైన దాడులకు, ఇరువర్గాల కార్యకర్తలు కర్రలతో కొట్టుకునే వరకు దారితీసింది. ఇది తెలంగాణరాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోఉద్రిక్త వాతావరణానికి కారణ ంగా మారింది. కాంగ్రెస్‌ కార్యకర్తలు బిజెపి రాష్ట్ర కార్యాలయంపై దాడిచేయడానికి ప్రయత్నించారు.పోలీసులు అడ్డుకోవడంతో రాళ్ళు రువ్వడంతో పలువురికి గాయాల్కెనాయి.

దీంతో రెచ్చిపోయిన బిజెపి కార్యకర్తలు కాంగ్రెస్‌ కార్యకర్తలపై కర్రలతోదాడికి సిద్దమైనారు. అలాగే కాంగ్రెస్‌ భవన్‌ ముట్టడికి బయలుదేరారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను లాఠీలతో అదుపు చేసి, ఇరు పార్టీలకు చెందిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు. దీనికంతటికీ రమేష్‌ బిధూరి చేసిన వ్యాఖ్యలే కారణం. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ నియోజకవర్గం నుంచి రమేష్‌ బిధూరి పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రియాంక గాంధీ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. తాను గెలిస్తే కల్కాజీ నియోజకవర్గం రోడ్లను ప్రియాంక గాంధీ వాద్రా బుగ్గల్లా మారుస్తాననడం ఈ వివాదానికి నాందిపల్కింది. ఆ మాటలకు కాంగ్రెస్‌ తీవ్రంగా మండిపడుతున్నది. ఆ పార్టీ పక్షాన దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగాయి. తెలంగాణలో వారి ఆందోళన అదుపు తప్పిందనడానికి మంగళవారం నాటి సంఘటనే సాక్ష్యం. ఇదిలా ఉంటే కల్కాజీ నియోజకవర్గం నుంచి దిల్లీ  ముఖ్యమంత్రి అతిశీ పోటీపడుతున్నారు. అయితే రమేష్‌ తన ప్రచారంలో భాగంగా ఆమెపైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆప్‌ కార్యకర్తలు బిజెపిపైన తీవ్రంగా విరుచుకు పడుతున్నారు.

దిల్లీ  సిఎం అతిశీ ఇంటిపేరు గతంలో ఒకటి ఉండగా, ప్రస్తుతం మరో ఇంటి పేరుతో కొనసాగుతున్నారన్న విషయాన్ని చెప్పే క్రమంలో ఆమె తండ్రిని మార్చేశారంటూ రమేష్‌ చేసిన ఆరోపణపై ఆమె తీవ్రంగా స్పందించారు. అంతటితో ఆగకుండా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డ ఆఫ్జల్‌ గురుకు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ అతిశీ తల్లిదండ్రులు పిటీషన్‌ దాఖలు చేశారంటూ మరో ఆరోపణ చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండిరచారు. వోట్ల కోసం తమ కుటుంబంపైన నిరాధారమైన ఆరోపణలు చేయడాన్ని ప్రతిఘటించే క్రమంలో ఆమె మీడియా ముందు కంటతడిపెట్టిన దృశ్యం పలువురిని కదిలించింది.మహిళలపట్ల కనీస మర్యాద లేకుండా మాట్లాడిన రమేష్‌తోపాటు ఆ పార్టీకి దిల్లీ  ప్రజలు ఈ ఎన్నికల్లో తప్పకుండా బుద్ది చెబుతారని ఆ పార్టీ అధినేత మాజీ సిఎం అరవింద కేజ్రీవాల్‌ విరుచుకుపడుతున్నారు. ఇదిలాఉంటే ఇటీవల కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌షా అంబేడ్కర్‌ పైన చేసిన వ్యాఖ్యలు కూడా వివాదగ్రస్త మైన విషయం తెలిసిందే. గతంలో ఆ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి ఒకరు ఇందిరాగాంధీ, సంజయ్‌గాంధీలపై చేసిన వ్యాఖ్యలు కూడా వివాదంగా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page