“కల చెదిరింది, కథమారింది, కన్నీరే ఇక మిగిలింది..”.ఈ పాట చాలా మందికి గుర్తుండే ఉంటుంది. సూపర్ స్టార్ కృష్ణ నటించిన దేవదాసు చిత్రంలోనిది. ఎప్పుడైనా తామనుకున్నది జరగనప్పడు, అనుకోనిది జరిగినప్పుడు తెలుగువారు సహజంగా ఈ పాటను గుర్తుకు తెచ్చుకొని మనసులో పాడుకునే పాట ఇది! ఎంతో జీవిత పరమార్థాన్ని తెలిపే గీతం ఇది. అయితే ఎక్కువగా దీన్ని ప్రేమ లేదా స్నేహాన్ని కోల్పోయిన సందర్భల్లోనే ఈ పాటను ఎక్కువగా స్ఫురణకు తెచ్చుకోవడం అలవాటుగా మారింది. ఇక అసలు విషయానికి వస్తే, రాష్ట్ర బి.జె.పి.కి నూతన అధ్యక్షుడిగా ఒకప్పటి ఆర్.ఎస్.ఎస్. కార్యకర్త, బీజేపీకి అత్యంత విశ్వసనీయ నేత రామచంద్రరావు ఎన్నికయ్యారు. నిజంగానే ఇది పార్టీలో తమను తాము గట్టి నాయకులుగా, తిరుగులేనివారిగా, పార్టీ అధ్యక్షపదవికి తామే సరైనవారుగా పోల్చుకున్న చాలామంది సీనియర్ నాయకులకు కొరుకుడుపడని అంశమే. ఈ నియామకం వారిలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించినప్పటికీ ప్రస్తుతానికి ఏమీ చేయలేని స్థితి! ఇదెందుకు, ఎట్లా జరిగిందో తెలుసుకోలేక అయోమయంలో కొట్టుమిట్టాడుతూ, ఈ మింగుడు పడని స్థితినుంచి బయటపడటానికి వారికి కొంత సమయం పట్టవచ్చు. ప్రస్తుతం ఇటువంటి వారు ఇప్పుడు మౌనంగా కలచెదిరింది…కథమారింది అని పాడుకుంటుండవచ్చు. రామచంద్రరావును ఎన్నిక చేయడం ద్వారా బీజేపీ అధినాయకత్వం తామే ఈ పదవికి అర్హులమని భావించే నాయకుల ఆశలపై నీళ్లు కుమ్మరించింది. ఫలితంగా ఇప్పటివరకు గుంభనంగా ఉన్న అసంతృప్తి ఇకముందు బహిర్గతమవొచ్చనే అభిప్రాయంలో తప్పులేదు.
పార్టీ అధ్యక్షపదవికి పోటీపడినవారిలో ఎవరూ ఎన్.రామచంద్రరావు వంటి నాయకుల నుంచి తమకు ఇబ్బంది ఎదురవుతుందని ఎప్పుడూ భావించి ఉండరు . రామచంద్రరావును ఎంపిక చేయడంలో అధిష్టానం వ్యూహాత్మకంగా వ్యవహరించిందని, ముఖ్యంగా ప్రస్తుతం ఎటువంటి ప్రధాన ఎన్నికలు లేకపోవడంతో, మరో మూడేళ్లకాలం ప్రాథమిక స్థాయినుంచి బలోపేతం చేయడానికి ఈ ఎన్నిక ఉపయోగ పడుతుందని పార్టీలోని కొందరి అభిప్రాయం. ఇక బండి సంజయ్ వంటి దూకుడు నాయకుల అవసరం ఎన్నికల సమయంలో చాలా అవసరం. ప్రస్తుతానికి అటువంటి నాయకుల అవసరం లేదని పార్టీ అధిష్టానం భావించడం కూడా ఇందుకు కారణమన్నది ఒక వాదన. అంతేకాదు అమిత్ షాకు అత్యంత సన్నిహితంగా మెలిగే బండిసంజయ్, రామచంద్రరావు పేరును ప్రతిపాదించడం ఇక్కడ గమనార్హం. అదీకాకుండా బండి సంజయ్, ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి వర్గాల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి. అరవింద్ కుమార్ అంటే పార్టీలో చాలామందికి పడదు. అయితే వీరందరికీ రామచంద్రరావు ఆమోదయోగ్యుడు కావడం అధిష్టానం నిర్ణయానికి ప్రధాన కారణం. బండి సంజయ్ మాటకు బీజేపీ అధినాయత్వం ఇప్పటికీ మంచి విలువనిస్తుంది.
అన్నీ సజావుగా జరుగుతూ, పార్టీ బీఆర్ ఎస్‌కు ప్రత్యామ్నాయంగా రూపుదిద్దిన బండి సంజయ్‌ను, ప్రతికూల వర్గాల చెప్పుడు మాటలతో, అధిష్టానం పదవినుంచి తప్పించింది. అందుకు పార్టీ చాలా మూల్యమే చెల్లించింది. నరేంద్ర మోదీ, అమిత్ షాలు ఈ విషయాన్ని గుర్తించి బండి సంజయ్‌కు కేంద్రంలో మంత్రిపదవి ఇచ్చినా, ఆయన మాటకు వారిద్దరూ చాలా విలువనిస్తారన్నది అక్షరసత్యం. వచ్చే మూడేళ్లపాటు రామచంద్రరావు నిశ్శబ్దంగా పనిచేసుకుపోవడం వల్ల పార్టీ క్షేత్రస్థాయిలో బలపడిన తర్వాత, ఎన్నికల ముందు బండి సంజయ్‌కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశాలే ఎక్కువ! రామచంద్ర రావు నాయకత్వం వల్ల పార్టీలో అసమ్మతి పెచ్చరిల్లదు. ఒకవేళ పెరిగినా ఒంటి చేత్తో చప్పట్లు కొట్టిన మాదిరిగానే ఉంటుంది . అంతేకాదు ఆధిపత్యం రెడ్డి వర్గం నుంచి బ్రాహ్మణ వర్గానికి మారడం కొండనాల్కకు మందేస్తే ఉన్న నాలుక పోయిన చందమని కొందరి అభిప్రాయం. కానీ ఈ ఎన్నిక వెనుక వ్యూహాన్ని అర్థం చేసుకున్నవారికి, అపర చాణక్యత ఏంటో అవగతమవుతుంది.
రామచంద్రరావు పికెట్ కేంద్రీయ విద్యాలయంలో విద్యాభ్యాసం దగ్గరినుంచి ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఎ. పొలిటికల్ సైన్స్ మరియు లా కోర్సులను పూర్తిచేసేవరకు ఆయన విద్యార్థి రాజకీయలను పరిశీలిస్తే ఆయన ఎప్పుడూ ఏ ఎన్నికలో ఓటమి చవిచూసింది లేదు. ఆర్.ఎస్.ఎస్.కు బీజేపికి అత్యంత విశ్వాసపాత్రుడిగా మెలిగారు. ఆర్.ఎస్.ఎస్.తో ఆయనకున్న అనుబంధం కూడా నేడు ఆయనకు ఈ పదవి రావడానికి ఒక కారణం. ఇప్పుడు పార్టీని నిశ్శబ్దంగా చాపకింద నీరులా ప్రచారార్భా టం లేకుండా క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే నాయకుడు కావాలి. అందరికీ ఆమోదయోగ్యుడు అయితేనే ఇది సాధ్యం. రాజకీయంగా వచ్చే మూడేళ్లకాలం శాంతి కాలం కాబట్టి ఈలోగా పార్టీని బలోపేతం చేయడం ప్రధానం. అధిష్టానం రామచంద్రరావును ఎన్నిక చేయడానికి ప్రధాన కారణం ఇది. రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేసినా ఆయన అనుసరించే మితిమీరిన హిందూత్వ విధానాలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయి. అదీకాకుండా ఆయన పలుకుబడి పాతబస్తీకి మాత్రమే పరిమితం. ఇక ఈటల రాజేందర్‌పై పార్టీకి ఇప్పటికీ విశ్వాసం కలగడంలేదు. ఆయనకు బీఆర్ ఎస్ నాయకులతో ఇంకా సన్నిహిత సంబంధాలున్నాయన్న సంగతి కేంద్ర నాయకత్వానికి బాగా అర్థమైంది. ఆయన పేరును ఒకవేళ అదిష్టానం ముందుకు తెస్తే బండి సంజయ్, కిషన్ రెడ్డి వర్గాలు అడ్డంగా నిలబడతాయి. ఇక బండి సంజయ్ పేరు చెబితే కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్‌లు అగ్గిమీద గుగ్గిలమవుతారు. పార్టీ అసంతృప్తులెవరూ తెలంగాణ రా ష్ట్రవ్యాప్తంగా పలుకుబడి కలిగినవారు కాదు. ఒక్క బండిసంజయ్ తప్ప! అందువలనే ఆయనను తురుపు ముక్కగా వచ్చే ఎన్నికల నాటికి రంగంలోకి దించాలన్నది పార్టీ వ్యూహం.
జూన్ 30న రామచంద్రరావు నియామకాన్ని ప్రకటించినప్పుడు పార్టీ సీనియర్లలో చాలామంది బీజేపీ కార్యాలయానికి రాకపోవడం వారిలోని అసంతృప్తికి నిదర్శనం. కానీ వారెవరూ పార్టీకి నష్టం చేకూర్చే స్థాయిలో లేరన్న సంగతి ఇక్కడ గమనార్హం. ఈ ఎన్నిక ప్రక్రియలో తమకు అన్యాయం జరిగిందని వారు భావించినా, బాధపడటం వరకే తప్ప, ఎదిరించే స్థాయి మాత్రం వారికి లేదు! అయితే ఇప్పుడు కొత్త అధ్యక్షుడిగా రామచంద్రరావు ఈ విభిన్న గ్రూపులను ఒక్క తాటిమీదకు తీసుకొని రావడానికి కృషి చేయాలి. ఇక్కడే ఆయన నాయకత్వ పటిమ నిరూపితమవుతుంది. ప్రచారార్భాటం లేకుండా నిశ్శబ్దంగా పనిచేసే నాయకుడిగా, విషయ పరిజ్ఞానం కలిగిన ఒక లాయర్‌గా తన అనుభవాలను పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగించవచ్చు. రాజాసింగ్ అసమ్మతిని పార్టీ నాయకత్వం పెద్దగా ఖాతరు చేయదు. ఆయన ప్రభావం గోషామహల్‌కే పరిమితం.
ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ వంటి బీసీ నాయకులను పక్కనబెట్టి ఒక బ్రాహ్మణుడికి పార్టీ నాయకత్వం అప్పగించడం వల్ల, కాంగ్రెస్, బీఆర్ ఎస్‌లు దీన్ని తమకు అనుకూలంగా ప్రచారం చేసుకోవచ్చని విశ్లేషించేవారు లేకపోలేదు. కానీ బీజేపీలో బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్‌లు బీసీ వర్గాలకు చెందినవారైనా, గ్రూపు తగాదాలున్నాయి. ఒకరిని ఎంపిక చేస్తే మరొకరికి ఆగ్రహం రావడం ఖాయం. వెంటనే అసమ్మతి కార్యలాపాలు మొదలవుతాయి. ఏ వర్గమూ, గ్రూపు లేని రామచంద్రరావుపట్ల వీరెవరికీ వైషమ్యాలు లేవు. సౌమ్యుడిగా పేరుంది. ఒకప్పటి కాంగ్రెస్‌లో ఏ గ్రూపునకు చెందని పి.వి. నరసింహారావు ప్రధానిగా దేశాన్ని ఐదేళ్లపాటు పాలించలేదా! ఇప్పుడు రామచంద్రరావు పరిస్థితీ అదే! ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తామన్న హామీని బీజేపీ విస్మరించిందని వాదించేవారు ఒక్కటి గుర్తుంచుకోవాలి. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఒక్కరే వుండరు! అదీకాకుండా బీజేపీ ఎప్పుడు మొదట్నుంచీ పార్టీని నమ్ముకున్న వారికే ప్రాధాన్యతనిస్తుంది కానీ, బయటనుంచి వచ్చినవారికి కాదు!
అన్నీ సజావుగా జరుగుతూ, పార్టీ బీఆర్ ఎస్‌కు ప్రత్యామ్నాయంగా రూపుదిద్దిన బండి సంజయ్‌ను, ప్రతికూల వర్గాల చెప్పుడు మాటలతో, అధిష్టానం పదవినుంచి తప్పించింది. అందుకు పార్టీ చాలా మూల్యమే చెల్లించింది. నరేంద్ర మోదీ, అమిత్ షాలు ఈ విషయాన్ని గుర్తించి బండి సంజయ్‌కు కేంద్రంలో మంత్రిపదవి ఇచ్చినా, ఆయన మాటకు వారిద్దరూ చాలా విలువనిస్తారన్నది అక్షరసత్యం. వచ్చే మూడేళ్లపాటు రామచంద్రరావు నిశ్శబ్దంగా పనిచేసుకుపోవడం వల్ల పార్టీ క్షేత్రస్థాయిలో బలపడిన తర్వాత, ఎన్నికల ముందు బండి సంజయ్‌కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశాలే ఎక్కువ! రామచంద్ర రావు నాయకత్వం వల్ల పార్టీలో అసమ్మతి పెచ్చరిల్లదు. ఒకవేళ పెరిగినా ఒంటి చేత్తో చప్పట్లు కొట్టిన మాదిరిగానే ఉంటుంది . అంతేకాదు ఆధిపత్యం రెడ్డి వర్గం నుంచి బ్రాహ్మణ వర్గానికి మారడం కొండనాల్కకు మందేస్తే ఉన్న నాలుక పోయిన చందమని కొందరి అభిప్రాయం. కానీ ఈ ఎన్నిక వెనుక వ్యూహాన్ని అర్థం చేసుకున్నవారికి, అపర చాణక్యత ఏంటో అవగతమవుతుంది.
-శామ్ సుందర్