– రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పాలన
– హౌస్ అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరు
– ప్రభుత్వంపై రామచందర్ రావు ఫైర్
– ఈసెట్ రద్దు కుట్రలను ఉపసంహరించుకోవాలి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 27 : తాను చేపట్టిన నిరాహార దీక్షా శిబిరానికి వచ్చి తమ సమస్యలు చెప్పుకున్న రామంతపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులను పరామర్శించేందుకు, వారికి మద్దతు తెలిపేందుకు బయల్దేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావును తార్నాకలోని ఆయన నివాసంలో పోలీసులు గురువారం ఉదయం హౌస్ అరెస్టు చేశారు. విద్యార్థుల కోసం వెళ్తున్న తన గృహ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమర్జెన్సీ తరహా మైండ్‌సెట్‌తో ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన సాగిస్తోందని, సమస్యలపై గళమెత్తే ప్రతిపక్షాలు, విద్యార్థులపై పోలీసు నిర్బంధాలను ప్రయోగిస్తోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విద్యార్థుల పక్షాన నిలబడాల్సిన బాధ్యతగల ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని విద్యార్థులను కలవకుండా పోలీసులను మోహరించి అడ్డుకోవడం ప్రభుత్వ పిరికితనానికి పరాకాష్ఠ అని మండిపడ్డారు. ఒకవైపు లక్షలాదిమంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు ఇవ్వకుండా ఆగం చేస్తూ మరోవైపు ఆయుష్ విద్యార్థులకు, జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్లు సక్రమంగా ఇవ్వట్లేదని విమర్శించారు. పక్క రాష్ట్రం ఏపీలో రూ.30 వేల వరకు స్టైఫండ్లు ఇస్తుంటే తెలంగాణలో మాత్రం అందులో రూ.13 వేల నుంచి రూ.15 వేలకే పరిమితం చేసి విద్యార్థుల పొట్టకొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులు ఆదేశించినా స్టైఫండ్లు పెంచకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని దుయ్యబట్టారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును జీవో 97 ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందని రామచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శక్తి స్కీమ్ పేరుతో వింత ప్రయోగాలు చేస్తూ, సాంకేతిక విద్యను నామమాత్రపు స్కిల్ డెవలప్‌మెంట్‌గా మార్చి పాలిటెక్నిక్ చదువును అవమానపరుస్తున్నారని విమర్శించారు. పాలిటెక్నిక్ పూర్తయిన విద్యార్థులకు ఇంజనీరింగ్‌లో ప్రవేశానికి ఉన్న ఈసెట్ అవకాశాలను దూరం చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ సమస్యలను పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వం కేశవరావు, కోదండరాంలతో కంటితుడుపు కమిటీలను వేసిందని, పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే జీవో 97ను బేషరతుగా తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యా శాఖను తనవద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో విద్యార్థుల గోడును పట్టించుకోకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాహుల్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తిరుగుతూ డ్రామాలు ఆడటం మానేసి తెలంగాణలో విద్యా విధ్వంసంపై నోరు విప్పాలని డిమాండ్ చేశారు. పోలీసు ఆంక్షలు తొలగిన వెంటనే పాలిటెక్నిక్ విద్యార్థులను కలిసి వారికి బీజేపీ అండగా నిలుస్తుందని, విద్యార్థుల హక్కులు సాధించేవరకు ప్రభుత్వంపై రాజీ లేని పోరాటం కొనసాగిస్తామని రామచందర్ రావు స్పష్టం చేశారు.
విద్యాసంస్థల భూములను రియల్ ఎస్టేట్ మాఫియాకు ధారాదత్తం చేసే కుట్ర
మొన్న చేపట్టిన ఫీజుల బకాయి-బీజేపీ లడాయి నిరాహార దీక్షకు వేలాదిగా తరలివచ్చిన విద్యార్థుల్లో పాలిటెక్నిక్ విద్యార్థులు కూడా ఉన్నారని గుర్తుచేశారు. జీవో 97 వల్ల తమ భవిష్యత్తు అంధకారంలో పడిపోతోందని, కాలేజీకి వచ్చి సమస్యలను పరిశీలించాలని వారు ఆహ్వానించినందునే తాను, పార్టీ యువమోర్చా బృందం రామంతపూర్ వెళ్తుంటే పోలీసులను ఇంటి చుట్టూ మోహరించి నిర్బంధించడం కాంగ్రెస్ పిరికితనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. బీజేపీ పోరాటం రెండు రోజుల దీక్షకో, ఫీజుల కోసమో కాదని, ఇది రాష్ట్రంలోని యావత్ విద్యావ్యవస్థ, 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన జీవన్మరణ సమస్య అని స్పష్టం చేశారు. గత పదేళ్లలో 13 విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు, లెక్చరర్ల రిక్రూట్‌మెంట్ చేపట్టలేదని, బ్లాక్ గ్రాంట్ల నిధులు వాడాల్సిన దుస్థితి కల్పించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉస్మానియా వర్సిటీకి రూ.1,000 కోట్లు ఇస్తామని ఏడాది క్రితం హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు పైసా విదిల్చలేదని ఎద్దేవా చేశారు. ఉపాధ్యాయుల నియామకాలు లేక, ప్రమోషన్లు, హెల్త్ కార్డులు ఇవ్వక, పెన్షన్లు సక్రమంగా రాక రిటైర్డ్ ఉపాధ్యాయ కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందన్నారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో అమల్లోకి తెచ్చిన శక్తి స్కీమ్ కాన్సెప్ట్, వివాదాస్పద జీవో 97 వెనుక ప్రభుత్వానికి దుర్మార్గమైన ఎజెండా ఉందని ఆయన సంచలన ఆరోపణ చేశారు. మసాబ్ ట్యాంక్, రామంతపూర్, మహబూబ్‌నగర్, నల్గొండ వంటి ప్రాంతాల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలకు ఉన్న వేల కోట్ల విలువైన భూములను కొల్లగొట్టి రియల్ ఎస్టేట్ మాఫియాకు కట్టబెట్టడానికే పాలిటెక్నిక్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. సెంట్రల్ వర్సిటీలో రాత్రికి రాత్రే బుల్డోజర్లు పెట్టి వందల ఎకరాలు ఆక్రమించే ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు అడ్డుకుందని గుర్తుచేశారు. జార్ఖండ్‌లో విద్యార్థులు 23 రోజులు నిరాహార దీక్ష చేస్తే పట్టించుకోని రాహుల్ గాంధీ ఎన్నికల ముందు ఇక్కడికొచ్చి ఇచ్చిన యూత్ డిక్లరేషన్ హామీలను ఎందుకు అమలు చేయట్లేదో సమాధానం చెప్పాలన్నారు. రేవంత్ సర్కార్.. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన జాతీయ విద్యా విధానంను రాష్ట్రంలో తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమపై పీడీ యాక్టులు పెట్టినా, జైళ్లకు పంపినా, హౌస్ అరెస్టులు చేసినా విద్యార్థుల హక్కుల సాధన కోసం బీజేపీ పోరాటం ఆగదని రామచందర్ రావు స్పష్టం చేశారు.
పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసనలకు బీజేపీ మద్దతు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సహా పార్టీ నేతల హౌస్ అరెస్టులను ఖండిస్తున్నామని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. వివాదాస్పద జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నడుపుతున్నది ప్రజా పాలన కాదు.. పోలీసుల నిర్బంధ పాలన అని స్పష్టమవుతోందన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే వివాదాస్పద జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్, మాసాబ్‌ట్యాంక్, రామంతపూర్ నుంచి మొదలుకొని వనపర్తి, పరకాల దాకా విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కితే వారిపై లాఠీఛార్జీలు చేయించడం, అరెస్టులు చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. చేతిలో రాజ్యాంగ పుస్తకం పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పాలిత తెలంగాణలో విద్యార్థుల హక్కులను కాలరాస్తుంటే ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. పాలిటెక్నిక్ సాంకేతిక విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ, విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలను దూరం చేసే కుట్రలను రేవంత్ సర్కార్ తక్షణమే విరమించుకోవాలన్నారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కళ్యాణ్ నాయక్, యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుందే, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవినాయక్, తదితరులు పాల్గొన్నారు.
ప్రజాపాలనా.. పోలీసుల నిర్బంధ పాలనా : సుభాష్
న్యాయమైన సమస్యల కోసం ఆందోళన చేస్తున్న రామంతపూర్ పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు వెళ్తుంటే అరెస్టులు చేయడమేమిటంటూ రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తోందా.. పోలీసుల నిర్బంధ పాలన నడుస్తోందా అని పార్టీ అధికార ప్రతినిధి ఎన్.వి.సుభాష్ మండిపడ్డారు. రామంతాపూర్, మల్కాజ్‌గిరితోపాటు నగరవ్యాప్తంగా బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తుగా హౌస్ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రామచందర్ రావుపై పోలీసు ఆంక్షలను తక్షణమే ఎత్తివేసి పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని బీజేపీ డిమాండ్ చేస్తోందన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



