- విచారణ జనవరి 7కు వాయిదా
- హైకోర్టులో కెసిఆర్, హరీష్ రావులకు ఊరట
హైదరాబాద్, డిసెంబర్24 (ఆర్‌ఎన్‌ఎ): బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు జారీ చేసిన నోటీసులను సస్పెండ్ చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. విచారణ సందర్భంగా భూపాలపల్లి కోర్టు జారీ చేసిన ఉత్తర్వులు సరైనవి కావని హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఫిర్యాదుదారుడు నాగవెల్లి లింగమూర్తికి నోటీసులు జారీ చేశారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కూలిన ఘటనపై భూపాలపల్లి జిల్లా కోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్‌పై విచారణ జరుగుతుండగా.. తాజాగా ఆ నోటీసులను సస్పెండ్ చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసు తదుపరి విచారణను ధర్మాసనం జనవరి 7వ తేదీకి వాయిదా వేసింది. కాగా, మేడిగడ్డ బ్యారేజీ కూలిపోవడానికి ప్రధాన కారణం కేసీఆర్, హరీష్ రావు, తదితరులని పేర్కొంటూ నాగవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి భూపాలపల్లి మెజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు.
అయితే ఈ అంశం తమ పరిధిలోకి రాదని మేజిస్ట్రేట్ కోర్టు పిటి షన్‌ను కొట్టివేసింది. దీంతో రాజలింగమూర్తి జిల్లా కోర్టును ఆశ్రయించి రివిజన్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన భూపాలపల్లి జిల్లా కోర్టు కేసీఆర్, హరీశ్ రావు, తదితరులకు నోటీసులు జారీ చేసింది. కాగా.. రివిజన్ పిటిషన్‌ను స్వీకరించే అధికారం భూపాలపల్లి జిల్లా కోర్టుకు లేదని వారు హైకోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం భూపాలపల్లి జిల్లా కోర్టు జారీ చేసిన నోటీసులను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. పిటిషన్‌ను విచారించిన భూపాల్లి కోర్టు.. కేసీఆర్‌తో పాటు అప్పటి నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు, అలాగే బీఆర్‌ఎస్ హయాంలో పనిచేసిన నీటిపారుదల శాఖ అధికారులకు జూలై 10న నోటీసులు జారీ చేసింది.
సెప్టెంబర్ 5న కోర్టుకు హాజరుకావాలంటూ కేసీఆర్, హరీష్ రావులను భూపాలపల్లి కోర్టు ఆదేశించింది. అయితే భూపాలపల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాలపై కేసీఆర్, హరీష్‌రావులు హైకోర్టును ఆశ్రయించారు. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ భూపాలపల్లి కోర్టు ఇచ్చిన నోటీసులను కొట్టివేయాలంటూ హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు. ఈ మేరకు హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ను దాఖలు చేశారు. కేసీఆర్, హరీష్‌రావు వేసిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులను సస్పెండ్ చేయడంతో పాటు ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీ చేశారు. అనంతరం తదుపరి విచారణను వాయిదా వేసింది.