- సుస్థిర పాలనతో ప్రజల్లో చెరగని ముద్ర
- నీతివంతమైన ప్రభుత్వాన్ని అందించేది బిజేపినే..
- శతజయంతి ఉత్సవాల్లో మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 24 : దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి తన స్థితప్రజ్ఞతతో దేశానికి సుస్థిర పాలన అందించారని బిజెపి సీనియర్ నేత, మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు. దివంగత మాజీ ప్రధాని వాజ్ పేయి శత జయంతి వేడుకల్లో భాగంగా ఏబీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తాజ్ డెక్కన్ లో జరిగిన ఈ ఉత్సవాల్లో సీహెచ్ విద్యాసాగర్ రావు మాట్లాడారు. పార్లమెంటుపై దాడి జరిగిన సందర్భంలో.. తాను కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఉన్నానని, ప్రమోద్ మహాజన్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి చొరవ తీసుకుని పరిస్థితిని ఎలా చక్కబెట్టారని తెలిపారు. వాజ్‌పేయి ఆయన ఛాంబర్ లో చాలా ప్రశాంతంగా.. ఎవరికి ఇవ్వాల్సిన ఆదేశాలను వారికిస్తూ.. మరుసటి రోజు పార్లమెంట్ జరగాలని, మన ప్రజాస్వామ్యం ఓడిపోదనే విషయాన్ని స్పష్టం చేశారని కొన్ని గంటల్లోనే పార్లమెంటు మొత్తం సెట్ రైట్ చేసి.. తర్వాతి రోజు పార్లమెంటును యథావిధిగా జరిగేలా చేశారని కొని యాడారు. ఇది వాజ్‌పేయి స్థితప్రజ్ఞతకు నిదర్శనమన్నారు.
దేశంలో ఎమర్జెన్సీ వొస్తుందని వాజ్ పేయి ముందే గుర్తించారని ఇది ఆయన దూరదృష్టికి నిదర్శనం అని అన్నారు. అటల్ జీకి.. వ్యక్తిత్వంతోనే ఆయనకు గౌరవం దక్కిందన్నారు. 1968లో పెద్ద నాయకుడిగా వారు ఎదుగుతున్న సందర్భంలో.. దీన్‌దయాళ్ హత్య తర్వాత.. భారతీయ జనసంఫ్‌ు పరిస్థితి ఏంటనే పరిస్థితుల్లో అటల్ జీ బాధ్యతలు తీసుకుని, దేశమంతా తిరిగి ప్రజల్లో.. ఆత్మస్థైర్యాన్ని నింపారని తెలిపారు. ప్రజలు ఆయన్ను దేశానికి ఒక కాంతిరేఖగా గుండెల్లో దాచుకున్నారని తెలిపారు. వాజ్‌పేయి ఆధ్వర్యంలో పనిచేసే గొప్ప అవకాశం తనకు దక్కిందని విద్యాసాగర్ రావు తెలిపారు. స్వర్ణ చతుర్భుజి మార్క్ బిల్లు పెట్టినపుడు మేం ఓడిపోయినా.. వెనక్కు తగ్గకుండా దీన్ని అమలుచేసి ఇవాళ మౌలిక వసతుల మార్పునకు బీజం వేశారని గుర్తుచేశారు. పదాలకు సుగంధాన్ని పూసినట్లుగా ఆయన చెప్పే మాటలు.. మనుషులను కట్టిపడేసేవని అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న అటల్ జీని.. నాటి ప్రధాని పీవీ వాజ్‌పేయిని ఐక్యరాజ్యసమితికి పంపారు. దీనికోసం పీవీ పార్టీలోనూ వ్యతిరేకత ఎదుర్కొన్నా దేశం కోసం అటల్ జీయే సరైన వ్యక్తి అని గుర్తించడం గొప్పవిషయమని అన్నారు. వాజ్‌పేయి మనకు ఇచ్చిన విలువలను, ఆయన జీవన విధానాన్ని ఆధారంగా చేసుకుని ఇప్పుడున్న సమాజాన్ని ఎలా సంఘటిత పరచాలో ఆలోచించి ముందుకెళ్లాలన్నారు.
రానున్న రోజుల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు మనమంతా కలిసి ముందుకెళ్దామని పిలుపునిచ్చారు. 1948లో ఇజ్రాయిల్ ఏర్పాటైన తర్వాత ఎడారి ప్రాంతాన్ని కూడా యూదులందరూ కలిసి అభివృద్ధి చేసుకుంటున్నారు. వీరంతా ఇజ్రాయిల్ కు వెళ్లిన తర్వాత.. ఇండియన్ ఇజ్రాయిలీస్ ఓ పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఇందులో.. 104 దేశాల్లో యూదులపై అత్యాచారాలు జరిగాయి. కానీ భారతదేశంలో మాత్రం తమకెంతో గౌరవం దక్కిందని పేర్కొన్నారు. 10వ తరగతిలో అటల్ జీ తన పుస్తకంలో ఈ విషయాలన్నీ రాసుకున్నారు. వారి భావన, వ్యక్తిత్వం, పరిస్థితులను చక్కదిద్దే ఆలోచన చాలా గొప్పది. ఆయన ప్రసంగాలు, అనుభవాల స్ఫూర్తితో మనం ముందుకెళ్దాం అని విద్యాసాగర్ రావు కోరారు. బీజేపీ ఒక్కటే నీతివంతమైన ప్రభుత్వాన్ని అందిస్తుందని ప్రజల్లోకి తీసుకెళ్లాలని,మారుమూల ప్రాంతాల్లోకి చొచ్చుకెల్లి.. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలని చెప్పారు.