మాది ప్రజా ప్రభుత్వం..

  • ప్రజల సమస్యలను ప‌రిష్క‌రించేందుకే ముఖాముఖి
  • కులగణ‌న చారిత్రాత్మక నిర్ణయం
  • అడ్డుకునేందుకు దోపిడీదారులు తప్పుడు ప్రచారం
  • గత ప్రభుత్వాలది గడీల పాలన..
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 21: ‘మాది ప్రజా ప్రభుత్వం.. ప్రజలతో మమేకమ‌వుతూ.. ప్రజల సమస్యల పరిష్కారించేందుకు నిరంత‌రం కృషి చేస్తున్నాం’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. గురువారం డిప్యూటీ సీఎం గాంధీభవన్ లో ప్రజలు, కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమం సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ భావజాలాన్ని నమ్మి వోట్లు వేసిన ప్రజల ఆలోచనలు, పార్టీ కార్యకర్తల ద్వారా వారి అభిప్రాయాలను తెలుసుకొని పరిష్కరించేందుకు ప్రజా ప్రభుత్వంలో మంత్రులు, డిప్యూటీ సీఎం గా తాను గాంధీభవన్ కార్యక్రమానికి హాజరవుతున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వం గడీల మధ్యన పాలించగా నేడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి యావత్ క్యాబినెట్ ప్రజల మధ్య పాలన చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో విద్య, వైద్యంపై ప్రజా ప్రభుత్వం దృష్టి నిలిపిందని తెలిపారు. ప్రపంచ స్థాయి విద్యను పేద విద్యార్థులకు అందించేందుకు సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. నేటి బాలలే రేపటి భవిష్యత్‌ అని యావత్ క్యాబినెట్ ఆలోచన చేసి హాస్టల్ విద్యార్థుల చార్జీలను 40% పెంచాలని వివరించారు. గత పాలకులు 10ఏళ్లపాటు ఈ అంశాన్ని పక్కన పడేశారని అన్నారు. 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ సరఫరా, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, ఐదు లక్షలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఇవన్నీ ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం విజయాలని వివ‌రించారు. అధికారంలోకి రాగానే ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తామని చెప్పామని, ఏడాదిలోపే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశామ‌న్నారు.. గత పదేళ్ల‌పాటు గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించలేకపోయారని, తాము అధికారంలోకి రాగానే పేపర్ లీకేజీలు, ఎలాంటి అడ్డంకులు లేకుండా విజయవంతంగా గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించామని చెప్పారు. జనాభాలో సగభాగం ఉన్న మహిళలను దృష్టిలో పెట్టుకొని ఏడాదికి 25 నుంచి 25 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు.. ఐదు సంవత్సరాల కాలంలో మహిళలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఒప్పించి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుంద‌ని అన్నారు. పరిశ్రమలు, ఉత్పత్తి అంటే అదాని, అంబానీ మాత్రమే అనుకునేవారు.. కానీ తాము వారిని కిందికి దించి స్వయం సహాయక సంఘాల సభ్యులతో 10 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని వివరించారు. ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేసి వాటిని మహిళా సంఘాలకు అప్పగించి.. వారు ఆర్టీసీకి బస్సులు లీజుకు ఇచ్చి ఆదాయం పొందేలా చూస్తామని అన్నారు. ప్రపంచస్థాయి స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని, మూలనపడిన 65 ఐటీఐలను అడ్వాన్స్ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్నామ‌ని తెలిపారు. కుల గణన చారిత్రాత్మక నిర్ణయం.. దీనిని అడ్డుకోవాలని దోపిడీదారులు సర్వేపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని. మండిప‌డ్డారు. సర్వే పూర్తయితే ఇన్నాళ్లు దోచుకున్న వారి ఆటలు సాగవని విమ‌ర్శించారు. ఫ్యూడల్ వ్యవస్థ నుంచి బయటికి తెచ్చి సమ సమాజ నిర్మాణానికి ప్రజా ప్రభుత్వం పునాదులు వేస్తుందని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page