హైకోర్టు వద్ద బీసీ సంఘాల నేతల ఆందోళన

– సీఎం రేవంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు
– తీర్పు కాపీ చూసిన త‌ర్వాత ముందుకెళ‌తాం:  మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి
– బీజేపీని నిల‌దీయాలి:  జూప‌ల్లి
– రిజ‌ర్వేష‌న్ల‌ను అడ్డుకోవ‌డం అన్యాయం:  విహెచ్‌, ఆది శ్రీ‌నివాస్‌

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌9 : బ‌సీ రిజర్వేషన్ల జీ.ఓ.పై హైకోర్టు స్టే విధించడంతో గురువారం హైకోర్టు ఎదుట బీసీ సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. గేట్‌ ‌నెం.4 దగ్గర నినాదాలు చేస్తూ.. రోడ్డుపై బైఠాయించారు.  సీఎం డౌన్‌ ‌డౌన్‌ అం‌టూ కోర్టు వద్ద బీసీ సంఘాలు నేతలు నినాదాలు చేశారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు.రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటు చర్యల వల్లే బీసీలకు అన్యాయం జరిగింద‌ని బీసీ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. బీసీలకు పదవులు వస్తుంటే అగ్రకులస్తులు ఓర్వలేకపోతున్నార‌ని వారు మండిపడ్డారు. బీసీల నోటి కాడ ముద్దను లాక్కున్నార‌ని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రి పదవులు మొత్తం అగ్రవర్ణాలకే.  కనీసం ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్‌ ‌పదవులైనా బీసీలకు దక్కొద్దా..? అని ప్రభుత్వాన్ని బీసీ నేతలు నిలదీశారు.

రిజర్వేషన్లు అమలు చేస్తాం : మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీ.ఓ నెంబర్‌9 అమలుపై హైకోర్టు స్టే విధించిన క్రమంలో తదుపరి కార్యాచరణ చేపడతామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఉన్నత న్యాయస్థానం నిర్ణయంతో బీసీల నోటి వద్ద ముద్ద లాగేసినట్లయిందని మంత్రి వాకిటి శ్రీహరి వ్యాఖ్యానించారు. బీసీలు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరతామన్నారు. కోర్టు తీర్పు కాపీ చూసిన తర్వాత ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తామని చెప్పారు. హైకోర్టు తీర్పు కాపీ వచ్చాక సీఎం రేవంత్‌రెడ్డితో చర్చిస్తాం. సుప్రీం కోర్టుకు వెళ్లడంపై నిర్ణయం తీసుకుంటాం. కోర్టులో కేసులు వేయించింది భారత రాష్ట్ర సమితే. బీజేపీతో కుమ్మక్కై బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంది. హైకోర్టు స్టే ఇవ్వకుండా ఉండేందుకు ఎంతో ప్రయత్నించాం అని వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. స్థానిక ఎన్నికలకు హైకోర్టు స్టే విధించడంపై మంత్రి వాకిటి శ్రీహరి స్పందించారు. బీసీలకు 42 శాతంపై అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన కూడా స్టే విధించడం విచారకరమని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్‌ ‌కొలిక్కి వచ్చిందనుకున్నాం. కానీ కోర్టు తీర్పు ఊహించలేదని చెప్పారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా కులగణన పూర్తి చేసి బీసీ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని వివరించారు. బీసీల నోటి కాడ కూడు లాగేయడం శోచనీయమని పేర్కొన్నారు. నోటి కాడ ముద్ద ఎవరు లాగేసారో కోర్ట్ ‌తీర్పు కాపీ వొచ్చాక చెబుతామని హెచ్చరించారు. 42 శాతం బీసీల రిజర్వేషన్‌ ‌కు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. బీసీ బిడ్డలు అధైర్య పడాల్సిన అవసరం లేదని కాంగ్రెస్‌ ‌పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్‌ ‌బిల్లును రెండు సభల్లో పాస్‌ ‌చేసి గవర్నర్‌ ‌కు పంపించామని గవర్నర్‌ ‌బిల్లు పాస్‌ ‌చేయకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్ ఎస్‌, బీజేపీల ద్రోహం:  జూప‌ల్లి

రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీ.ఓ నెంబర్‌ 9‌తో పాటు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించించడంపై కాంగ్రెస్‌ ‌నేతలు స్పందించారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం గతంలో ఎవరు చేయలేని సాహసం చేసిందని వ్యవసాయ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బీసీ బిల్లును అడ్డుకున్నదే బిజెపి అన్నారు. బిజెపిని నిలదీయమాల్సిన అసవరం ఉందన్నారు.   ఇంటింటికి తిరిగి కులగణనం చేసి 42 శాతం బీసీ రిజర్వేషన్ల రూపొందించామని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్‌ – ‌బీజేపీ ఒక్కటై బీసీలకు న్యాయం జరగకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం 42 శాతం బీసీల రిజర్వేషన్‌ ‌కు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. బీసీలకు న్యాయం జరగాలనిఅభిప్రాయపడ్డారు. బిఆర్‌ఎస్‌, ‌బీజేపీ పార్టీలు ఒక్కటై బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ ‌చిత్తశుద్దితో చట్టం చేసిందన్నారు. అడ్డుకున్నదే బిజెపి అన్నారు.

న్యాయవ్యవస్థలో బీసీలు రావాలి:  వి.హెచ్‌, ఆది శ్రీ‌నివాస్‌

బీసీ రిజర్వేషన్ల అంశంపై మాజీ ఎంపీ వీ. హనుమంత రావు మాట్లాడుతూ…కోర్టు తీర్పు చాలా బాధ కలిగించిందన్నారు.  తారిఖ్‌ ‌పే తారిఖ్‌ అని కోర్టు మరో తారిఖ్‌ ఇచ్చిందని పేర్కొన్నారు. రిజర్వేషన్లపై ప్రభుత్వం తరపున చేయాల్సింది చేశామని చెప్పారు. అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చే సమయంలో తాము అడ్డుకోలేదని.. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే అడ్డుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థలో బీసీలు వచ్చే వరకు తమకు అన్యాయం జరుగుతూనే ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడం దురదృష్టకరమని కాంగ్రెస్‌ ‌నేత, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ‌తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ’హైకోర్టు తీర్పుతో చాలా నిరాశ చెందాం. బీసీ రిజర్వేషన్ల కోసం ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి, కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసింది. కేంద్రం సహకరించకపోయినా, గవర్నర్‌ ‌పట్టించుకోకపోయినా, ప్రతిపక్షాలు కలిసి రాకపోయినా సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఒంటరి పోరాటం చేశారు. కులగణనతో పాటు డెడికేటెడ్‌ ‌కమిషన్‌ ‌వేసి బీసీల లెక్క తేల్చాం. బీసీల నోటికాడి బువ్వ అందకుండా పోయింది.. అయినా మేం నిరాశ చెందం.. పోరాటం కొనసాగుతుంది. తప్పకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించి పెడుతాం. బీసీలు ఎవరూ అధైర్యపడొద్దు.. సీఎం రేవంత్‌ ‌నాయకత్వంలో తప్పనిసరిగా రిజర్వేషన్లు సాధించుకుందాం’ అని అన్నారు. హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌గౌడ్‌  ‌సీఎంతో సమావేశం కానున్నారు. స్థానిక ఎన్నికలపై హైకోర్టు స్టే నేపథ్యంలో భవిష్యత్‌ ‌కార్యాచరణపై చర్చించనున్నారు.న్యాయనిపుణులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ నిర్వహించనున్నారు. నోటిఫికేషన్‌ ‌స్టేపై సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.  హైకోర్ట్ ‌వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీసీ సంఘాల నేతలు, కార్యకర్తలు రోడ్డు పై బైఠాయించి నిరసన తెలిపారు. ‘వుయ్‌ ‌వాంట్‌ ‌జస్టిస్‌’, ‘‌బీసీ వ్యతిరేకుల్లారా ఖబడ్దార్‌’ అం‌టూ నినాదాలు చేశారు. మరోవైపు బీసీ రిజర్వేషన్ల అంశంపై హై కోర్టు స్టే విధించిన నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేయనున్న కాంగ్రెస్‌ అభ్యర్దులు అయోమయంలో ఉన్నారు. పీసీసీ ఆదేశాలతో పలువురు స్థానిక నేతలు నామినేషన్‌ ‌దాఖలు చేశారు. హైకోర్టు స్టే ఇవ్వడంతో ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్న ఆందోళనలో ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page