బ్యాంకర్ల సమావేశంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 23: ప్రజలకు బ్యాంకింగ్ సేవలపై అవగాహన పెంపొందించేందుకు నిరంతరం కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ రాష్ట్రంలో బ్యాంకింగ్ సేవల విస్తరణ వేగంగా కొనసాగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున తెలంగాణలో అమలు చేస్తున్న అనేక కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై బ్యాంకర్ల సమావేశం సోమవారం ఇక్కడ జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బ్యాంకుల శాఖల సంఖ్య ఆరు వేలు ఉండగా దాదాపు 600 కొత్త శాఖలు పెరిగాయని తెలిపారు. ఈరోజు ముఖ్యంగా బ్యాంకింగ్ కరస్పాండెంట్ వ్యవస్థ రాష్ట్రంలో మరింత బలపడిరదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 80,931 మంది బ్యాంక్ కరస్పాండెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువచేసేందుకు పనిచేస్తున్నారని కిషన్‌రెడ్డి వివరించారు. అంతేకాక రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ లీడ్ బ్యాంకులుగా పనిచేస్తున్నాని పేర్కొన్నారు. ఈ బ్యాంకులు జిల్లా స్థాయిలో కేంద్ర పథకాల అమలు, రుణాల పంపిణీ వంటి ముఖ్య భాద్యతలు నిర్వహిస్తున్నాయన్నారు. బ్యాంకుల ద్వారా అందే సేవలు, వాటిని పొందే విధానంపై స్పష్టమైన సమాచారం ప్రజలకు చేరాలన్న దిశగా మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. విద్యార్థులకు విద్యా రుణాలు, హౌసింగ్ లోన్లు, రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు, స్వయం సహాయక బృందాల ఆరుణాలు ఆలస్యం జరిగితే ఎలా ఫిర్యాదు చేయాలి అనే అంశాలపై స్పష్టమైన అవగాహన కార్యక్రమాలు తీసుకురావాలని సమావేశంలో సూచనలొచ్చాయి. ఈ నేపథ్యంలో రుణ అవగాహన కార్యక్రమాలను రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా చేపట్టాలని సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈ రంగంలో ఉన్న చిన్న వ్యాపారవేత్తలకు బ్యాంకులందించే రుణ సదుపాయాలపై అవగాహన పెంచే కార్యక్రమాలు కూడా చేపట్టాలని నిర్ణయించారు. భారత ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు క్రాప్ లోన్లు, టర్మ్ లోన్లు, వ్యవసాయ రుణాలు, డెయిరీ, పాల్ట్రీ రంగాలకు సంబంధించిన లోన్లు.. వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని, విశ్వకర్మ యోజన, ముద్రా యోజన, స్ట్రీట్ వెండర్ రుణ సౌకర్యాల వంటి పథకాలను ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లాలని మంత్రి సూచించారు. 2013-14లో రాష్ట్రంలో వ్యవసాయ రుణాల మొత్తం రూ.27,676 కోట్లు కాగా, నరేంద్ర మోదీ నాయకత్వంలో అది 2024-25 నాటికి రూ.1,37,346 కోట్లకు పెరిగిందని కిషన్‌రెడ్డి తెలిపారు. కేంద్రం తెలంగాణ రైతులకు ఎలా వెన్నుదన్నుగా నిలుస్తున్నదో ఈ సమాచారం స్పష్టం చేస్తోందన్నారు. దురదృష్టవశాత్తూ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటించిన రూ. 2 లక్షల చొప్పున రైతు రుణమాఫీ ఇప్పటికీ పూర్తిగా అమలవలేదని విమర్శించారు. ఉదాహరణకు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో సుమారు 15,000 మంది అర్హులైన రైతులు ఉన్నప్పటికీ, వారి ఖాతాల్లో నిధులు జమచేయలేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని వెల్లడి చేస్తోందని తెలిపారు. ఈ విషయంలో రాష్ట్రం తక్షణమే స్పందించి ఆయా బ్యాంకుల నుండి స్పష్టమైన సమాచారం సేకరించి అర్హులైన రైతులందరికీ రుణమాఫీని పూర్తిచేయాలని మంత్రి జి.కిషన్‌రెడ్డి సూచించారు. ఈ అంశంపై రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుంటూ రుణ మాఫీ అమలు అంశాన్ని వేగవంతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు.