మాట ప్రకారం తొమ్మిది రోజుల్లోనే ‘భరోసా’ నిధుల జమ
హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న రాష్ట్ర రైతులు
రేపు రైతులనుద్దేశించి ప్రసంగించనున్న సీఎం
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 23: ఇచ్చిన మాట ప్రకారం తొమ్మిది రోజుల్లోనే రైతు భరోసా నిధుల రైతుల ఖాతాల్లో జమ చేశామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటివరకు 67.01 లక్షల మంది రైతుల ఖాతాల్లోికి రూ.8284.66 కోట్లు జమ చేశామన్నారు. ఎకరాలతో సంబంధం లేకుండా సాగులో ఉన్న మిగతా భూములకు కూడా నిధుల జమ ప్రక్రియ మంగళవారంతో పూర్తికానున్నదని తెలిపారు. సాగులో ఉన్న ప్రతి ఎకరాకు రైతు భరోసా చెల్లిస్తున్నామని, ఇంత తక్కువ రోజుల్లో పూర్తి కావడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమమని పేర్కొన్నారు. రైతుకు భరోసా రేవంతన్న అనేలా ఇచ్చిన మాట ప్రకారం తొమ్మిది రోజుల్లోనే వానాకాలం రైతుభరోసా ప్రక్రియను పూర్తి చేసి రైతులపై తమకున్న చిత్తశుద్ధిని నిరూపించుకున్నామన్నారు. ఈనెల 16న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించిన రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు రెండెకరాల వరకు రూ.2349.83 కోట్లు, రెండో రోజు మూడెకరాల వరకు రూ.3901.73 కోట్లు, మూడో రోజు నాలుగెకరాల వరకు రూ.5215.26 కోట్లు, నాలుగో రోజు అయిదు ఎకరాల వరకు రూ.6404.70 ఎకరాలు, ఐదో రోజు ఏడెకరాల వరకు రూ..7310.59 కోట్లు, ఆరో రోజు ఎనిమిదెకరాల వరకు రూ.7770.83 కోట్లు, ఏడో రోజు 15 ఎకరాల వరకు రూ.8284.66 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా రైతు సంక్షేమంలో ఎలాంటి రాజీ పడకుండా వానాకాలం రైతుభరోసా పథకాన్ని పూర్తిచేసిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకుముందు 2 నుండి 4 నెలల సమయం పట్టేదని, కానీ రేవంత్ ప్రభుత్వం కేవలం తొమ్మిది రోజులలోనే పూర్తి చేసిందని రైతులు హర్హాతిరేకం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇంతకుముందు రైతు రుణమాఫీ కూడా చెప్పినట్టుగానే ఆగస్టు 15లోగా పూర్తి చేశామని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అంతేకాక దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయనివిధంగా సన్నలకు మద్ధతు ధరపై రూ.500 బోనస్ ప్రకటించామని, తద్వారా అదనంగా రెండు వేల కోట్లకు పైగా రైతులు లబ్ధి పొందారని మంత్రి తుమ్మల తెలిపారు. ఇది ఇందిరమ్మ రాజ్యం అని, ఇందిరమ్మ రాజ్యం అంటేనే రైతుల రాజ్యమని మరోసారి మా ప్రభుత్వం రుజువు చేసిందన్నారు. ఇప్పటికే రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం రూ.లక్ష కోట్లకుపైగా ఖర్చు చేసిందని, ఇవేమీ కనబడని ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ఇప్పటికైనా విమరశలు మానుకుని రైతులకు మేలు చేసే ఆలోచనలతో ముందుకురావాలని హితవు పలికారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రైతుభరోసా నిధులను ఇచ్చిన మాట ప్రకారం తొమ్మిది రోజుల్లోనే పూర్తి చేసిన సందర్భంగా సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఏర్పాటు చేసిన రైతు పండగ కార్యక్రమంలో రైతులనుద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడతారని మంత్రి తుమ్మల తెలిపారు. ముఖ్యమంత్రికి కృతజతపూర్వకంగా ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి వారి వారి నియోజకవర్గాల్లో, మండలాల్లో, గ్రామాల్లో పెద్దఎత్తున పాల్గొని ఈ రైతుపండగ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.