– అత్యంత భయంకరమైన ప్రమాదంగా గుర్తించాలి
– ఐపీఎస్ ప్రొబేషనర్లతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
న్యూదిల్లీ, అక్టోబర్ 27: ప్రజలను చైతన్యవంతుల్ని చేయడంతోనే డిజిటల్ అరెస్టు ముప్పును ఛేదించవచ్చని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇందుకు పోలీస్ శాఖ చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రపతి భవన్‌లో ప్రొబేషనరీ ఐపీఎస్‌లను ఉద్దేశించి ప్రసంగించిన ముర్ము ఈ వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు ప్రజలను బెదిరింపులకు గురిచేస్తూ భారీ మొత్తంలో డబ్బును కాజేస్తుండడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ అరెస్టును ప్రజలకు ఉన్న అత్యంత భయంకరమైన ప్రమాదాల్లో ఒకటిగా పేర్కొన్నారు. ఇటువంటి వాటిని ఎదుర్కోవాలంటే సైబర్ నేరాలపై ప్రజలకు పోలీసులు సరైన అవగాహన కల్పించాలన్నారు. పోలీసుల పట్ల ప్రజలకు భయం ఉండకూడదని, వారు తమకు రక్షణగా నిలుస్తారనే గౌరవం ఉండాలని పేర్కొన్నారు.సైబర్ నేరగాళ్లు వీడియో కాల్స్ చేసి తాము పోలీసులమని బెదిరిస్తారని, తాము చెప్పినట్లు చేయకపోతే డిజిటల్ అరెస్టు చేస్తామని భయపెడతారని ద్రౌపదీ ముర్ము అన్నారు. ఇటువంటి సమయాల్లో ప్రజలు చాకచక్యంగా వ్యవహరించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ డిజిటల్ అరెస్టు ప్రభావం పోలీసు వ్యవస్థపైనా అధికంగా ఉంటుందన్నారు. సైబర్ నేరగాళ్లు పోలీసుల మాదిరి నమ్మించి మోసం చేయడంతో అసలైన పోలీసులు ఎవరనే విషయాన్ని కూడా ప్రజలు గ్రహించలేకపోతారన్నారు. దీనిని నివారించాలంటే సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు పోలీసులు నూతన సాంకేతికతపైనా పట్టు సాధించాలని రాష్ట్రపతి సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





