బీఆర్‌ఎస్‌ హయాంలోనే ఆటోవాలాలకు అన్యాయం

– బోరబండలో మంత్రి సీతక్క ఆటో ప్రయాణం
– చేయి గుర్తుకు ఓటెయ్యాలని ఆటో డ్రైవర్‌కు విజ్ఞప్తి
– కాంగ్రెస్‌ను గెలిపిస్తామని చెప్పిన ఆటో డ్రైవర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లకు ఎలాంటి ఇబ్బంది లేదు అని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. గల్లీలకు ఆర్టీసీ బస్సులు రావు కాబట్టి తక్కువ దూరాలకు ప్రజలు ఆటోలనే ఆశ్రయిస్తారన్నారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మహిళా కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ బండ్రు శోభారాణితో కలిసి ఆమె బోరబండలో ఆటోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా మంత్రి ఆటో డ్రైవర్‌తో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ హయాంలో ఆటో డ్రైవర్లను ఎన్నో ఇబ్బందులు పెట్టారని, ప్రగతి భవన్‌లోనే స్వయంగా కేసీఆర్‌ ఓలా, ఉబర్‌ బైక్‌ సర్వీసులను ప్రారంభించి ఆటో డ్రైవర్ల ఉపాధి దెబ్బతీశారని, నో పార్కింగ్‌, ఫిట్‌మెంట్‌ చార్జీల పేరుతో ఆటో డ్రైవర్ల జేబులకు చిల్లులు పెట్టారని, తమ బాధలు చెప్పుకుందామంటే ఆటో డ్రైవర్లను అరెస్టు చేశారని ఆరోపించారు. కేసీఆర్‌ నివాసం ప్రగతి భవనం ముందే ఆటో డ్రైవర్‌ తన ఆటో తగలబెట్టుకున్నాడని గుర్తు చేశారు. పదేండ్ల కాలంలో హైదరాబాద్‌ నగరంలో ఒక్క కొత్త ఆటోకు కెేసీఆర్‌ అనుమతులు ఇవ్వలేదంటూ ఇప్పుడు జూబ్లీహిల్స్‌ ఎన్నిక కోసం ఆటో డ్రైవర్ల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. తమ తల్లికి, చెల్లికి ఉచిత బస్సు ప్రయాణం లభిస్తున్నదని ఆటోడ్రైవర్లు చెబుతున్నారన్నారు. పేదలకు ఉచిత కరెంటు, సన్న బియ్యం ఇస్తున్నామని, ఆటో డ్రైవర్ల మహిళా కుటుంబ సభ్యులకు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఎన్నో సంక్షేమాలను అందిస్తున్నామని, వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని వివరించారు. తమ బాధలను ప్రపంచ బాధలుగా చెప్పడం కేసీఆర్‌ కుటుంబానికి అలవాటు అని ఎద్దేవా చేశారు. అధికారం పోయేసరికి అన్ని వర్గాల మీద ప్రేమ కురిపిస్తున్నారు కానీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరిని కూడా పట్టించుకోలేదని విమర్శించారు. జూబ్లీహిల్స్‌ ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ గెలవడం ఖాయం అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తామని ఆటో డ్రైవర్‌ తేల్చి చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page