ఆత్మలోకంలోకి ఆరోహణ

ఈ నవల చదవడం ఒక గొప్ప అనుభవం.  
యాత్రానుభవం.
‘ఘాంద్రుక్‌’ నేపాల్‌లోని అన్నపూర్ణ యాత్రామార్గంలోని ఒక చిన్న ఊరు. కానీ, పర్యాటకులకు, ఆరోహకులకు ప్రమాద, సౌందర్య భరితమైన తమ సాహస వలయం ముగింపునకు వచ్చే ముందు చేరుకునే మజిలీ. ప్రయాణాన్ని సమీక్షించుకునే చోటు, కొత్త స్థైర్యంతో అడుగు ముందుకు వేసే మెట్టు. కథానాయకుడు సిద్ధార్థ హోస్మనె విరక్తి, అనురక్తి నడుమ కొట్టుమిట్టాడుతూ, బయటి-లోపలి ఆరోహణ అవరోహణలను సాగిస్తూ, నిర్ణయం అనివార్యమైన పతాకసన్నివేశంలో ఘాంద్రుక్‌ను చేరతాడు. హైకింగ్‌ ఇక ముగుస్తుంది. మథనం ముగిసిందా, లేదా మనసు విప్పారి సంబుద్ధుడయ్యాడా అన్నప్రశ్న సిద్ధార్థకు మాత్రమే సంబంధించింది కాదు. పాఠకులు కూడా ఆకొండకొమ్ము మీద నిలిచి, ధవళగిరి కాంతుల నుంచి ఏ స్పష్టతను  అందుకుంటారన్నది ఒక శేషప్రశ్న.
టీహౌస్‌లలో వసతికుటీరాలలో ఆగినప్పుడల్లా, ఒక విశ్రాంతి, ఒక అశాంతి. వేడివేడి తేనీటితోనో, డిన్నర్‌ టేబుల్‌ముందో, ఎగుడుబాటలోనో మనుషులు కొత్తగా స్నేహితులవుతారు. దగ్గరవుతారు. ఒకరి కథలు ఒకరు చెప్పుకుంటూ లోకంలోని చీకటి వెలుగులను పరిచయం చేస్తారు. మానవసంబంధాలలో పరస్పరం వదలవలసిన స్థలాలను, కోరుకోవలసిన బంధాలను చర్చిస్తారు. పాఠకులు కూడా తమ జీవితాలలోని సంశయాలను, కోరుకోవడాలను, వదులుకోవడాలను గుర్తు చేసుకుంటారు. పొందగలిగింది వాగ్దానంగా నిలుస్తుండగా, వదిలేయడం కూడా ఒక తీవ్ర కాంక్షగా, బలమైన ఆప్షన్‌గా ఈ నవల ఒప్పిస్తుంది.
మనిషి తాను పుట్టిపెరిగిన నేపథ్యంతో ఉద్వేగం, బాధ్యతలతో కూడిన బంధాలలో ఉంటాడు. కుటుంబం, స్నేహితులు, ప్రేమికులు, సామాజిక చట్రంలో నిర్దేశించిన విధులు, వీటిలో స్వేచ్ఛను కట్టడి చేసేవి ఎన్నో ఉంటాయి, అదే సమయంలో ఆనందాన్ని ఇచ్చేవీ ఉంటాయి. కోల్పోయినట్టుగా బాధపెట్టేవీ ఉంటాయి, తప్పుచేసినట్టు కుంగదీసేవీ ఉంటాయి. ఈ నవలలో కథాంశం కంటె సంవిధానమే చెప్పుకోవలసిన విశేషం. ప్రయాణ క్లేశాలకు, జీవిత కష్టాలకు నవల ఆసాంతం వాచ్యంగా, సూచ్యంగా పోలికలు కనిపిస్తూనే ఉంటాయి. ప్రతిరోజూ సాయంత్రం ఎక్కడో ఒక చోట మజిలీ చేయవలసిందే, అక్కడ ఒక సంభాషణకో, ఒక సమీక్షకో ఆస్కారం ఉంటుంది.
image.png
అందువల్ల, ఎక్కడా హైకింగ్‌ వర్ణన విసుగనిపించదు. స్వగతాలు, సంభాషణలు జమిలిగా నడుస్తూ మధ్యమధ్యలో ప్రాకృతిక వర్ణనలతో నవల అలవోకగా సాగిపోతుంటుంది. అల్లసాని పెద్దన ‘అటజని కాంచె..’ పద్యంలో హిమాలయాల నిమ్నోన్నతాలను పదాల నడకలోనే స్ఫురింపించినట్టు, ఈ నవల నడక అంతా శిఖరాలూ లోయల అంచుల్లో, జ్ఞాపకాలూ ఆలోచనల కొండలూలోయల మధ్య సాగుతుంది.
కాల్పనిక యాత్రారచనలు తెలుగులో ఉన్నాయో లేదో తెలియదు. ఉన్నా అరుదుగా ఉండి ఉంటాయి.  ఆసాంతం ప్రయాణంలో కథను గుదిగుచ్చే ప్రయత్నాలు సినిమాలలో చాలా జరిగాయి. ఇందులో యాత్ర వాస్తవం, దాని దారిపటం, మజిలీలు అన్నీఅన్నపూర్ణ సర్క్యూట్‌లో ఉన్నవే. కానీ, ఆహైకింగు చుట్టూ అల్లిన కథ, జీవిత యాత్రలతో దాని మేళవింపు మాత్రం రచయిత సృజనాత్మక ప్రతిభను, శిల్ప నైపుణ్యాన్ని చెబుతాయి. సతీశ్‌చప్పరికె పాత్రికేయులుగా కూడా ప్రసిద్ధులు. కానీ, ఆయన శైలి ఫిక్షన్‌ రచయిత శైలియే. నవల ఆసాంతం నడిచే ఆరోహణల కథనంలో మాత్రం ఆయన పాత్రికేయ నిశితత్వాన్ని ప్రదర్శించారు.  బహుశా, ఈ సర్క్యూట్‌ లో రచయిత ప్రయాణించి ఉండాలి. తామే యాత్ర చేస్తున్న భావనను, నిజంగా చేయగలిగితే బాగుండుననే కోరికను పాఠకులలో కలిగేట్టుగా రాశారంటే, రచయిత ఆ అనుభవంతో తలమునకలై ఉండి ఉండాలి.
హిమాలయాలకు ఉండే సాంప్రదాయిక ఆధ్యాత్మిక పరిమళాన్ని రచయిత నవలలో బాగా ఉపయోగించుకున్నారు. జైన నేపథ్యం నుంచి వచ్చిన సిద్ధార్థ, విశ్వాసాల రీత్యా నాస్తికుడు. ఈ ఆరోహణల్లో అనేక చోట్ల దైవస్థలాలను చూస్తాడు. దేవుడి భావనకు నిమిత్తం లేని ఒక ప్రాదేశిక మాంత్రికత, కొండల మీది స్థానికగాథలను సందర్శించినప్పుడు సిద్ధార్థకు అనుభవంలోకి వస్తుంది.  కొండల మధ్య, లోయల్లోనూ ఉండే చిన్నచిన్న పల్లెలు, పర్యాటకులను, ఆరోహకులను ఆదరించే పద్ధతి, వారికి పర్వతాల మీద, కొలనులు, ప్రవాహాల మీద ఉండే నమ్మకాలు అన్నీ సిద్ధార్థకు, పాఠకులకు రచయిత పరిచయం చేస్తూనే ఉంటారు.
రెండేళ్ల కిందట కన్నడలో ఈ నవల (ఇదే పేరుతో) వచ్చినప్పుడు, విమర్శకులు దీని కొత్తదనాన్ని ప్రశంసించడంతో పాటు, ‘పోస్ట్‌మోడర్న్‌ (నవ్యోత్తర)  నవల’ అని బిరుదు కూడా ఇచ్చారు. ఇందులో అస్తిత్వ వేదన, సాంస్కృతిక నేపథ్యానికి చెందిన తపన, దేవుడినుంచి దైవాన్ని వేరుగా చూడగలిగే విచక్షణ, పరమ స్థానిక అంశాల నుంచి అంతర్జాతీయ సంఘర్షణల దాకా విస్తరించిన కథాంశస్పర్శ ఉన్నందువల్ల ఆ రకమైన కోవలోకి ఈరచనను చేర్చి ఉండవచ్చు. ముఖ్యపాత్రలు సిద్ధార్థ, సోఫియా రెండూ, తమ తమ జీవితంలో అశాంతిని తగ్గించుకోవడానికి ప్రేమ, కామ సంబంధాలనే ఆశ్రయిస్తాయి. సోఫియా విషయంలో అయితే, స్వలింగ సంబంధాలు కూడా చూడవచ్చు. ఉద్వేగాలతో కూడిన మానవసంబంధాల విషయంలో ఇద్దరికీ అప్రమత్తత ఎక్కువ, నిర్ణయాలు తీసుకోలేని అశక్తత కూడా ఎక్కువ. సంశయం, ఎంపిక ఈ రెండూ మనిషికి చైతన్యభారాలు.
వాటికి సొంత నివృత్తి కొంత ‘నమోబుద్ధ’లో ఉండవచ్చునేమో కానీ, పూర్తి విముక్తి మాత్రం మనిషికి వెలుపలే ఉంటుంది. ఆ గ్రహింపు సోఫియా ప్రదర్శిస్తుంది కూడా. డ్రగ్స్‌, జాతీయవాదం, మతజాతీయ హింస వీటన్నిటిని ప్రత్యక్షంగా చూసిన సోఫియా, ఈ దుర్మార్గాల నిరోధం వ్యక్తుల చేతుల్లో లేదని చెబుతుంది. ఆమె చెప్పిన సంక్షోభ లక్షణాలను చదివినప్పుడు, భారతదేశం కూడా స్ఫురణకు వస్తుంది. నేపాల్లో హిమాలయాల ఎవరెస్టు దిగువ పర్వతశ్రేణులలోనే ఆమె శాంతిని చూస్తుంది. బుద్ధుడిని ఎంతో ఇష్టపడే సోఫియా, బౌద్ధ దేశాల ప్రభుత్వాల క్రూరత్వాన్నికూడా బాధగా ప్రస్తావిస్తుంది. అయితే,  లోకంలో చీకటి అభేద్యమైనదే అయినా, ఎంతో కొంత దుఃఖాన్ని తగ్గించడానికి మానవప్రయత్నం చేయవలసిందేనని పోఫియా లాంటి వారు నమ్ముతారు. సిద్ధార్థ నమ్ముతాడా, నమ్మినా అందుకు కావలసిన త్యాగం చేస్తాడా అన్న అనుమానం కలుగుతుంది. కానీ, సామాజిక, రాజకీయ చింతన లేనట్టు కనిపించినా, సిద్ధార్థ కూడా తనచుట్టూ ఉండే మనుషుల మీద, సమాజం మీద  మానవీయ సంవేదన కలిగిన  మనిషే అని రచయిత సూచిస్తూనే ఉంటారు.
దక్షిణ కర్ణాటక స్థలాలు, పేర్లు తెలుగువారికి పరిచితంగానే ధ్వనిస్తాయి. కానీ, పోఖరా నుంచి ఘాంద్రూక్‌ మీదుగా తిరిగి పోఖరా దాకా ఉండే సర్క్యూట్‌లో పేర్లు, హైకింగ్‌దారిలోని టీషాపులు, వసతుల స్థలాల పేర్లు కొంచెం ఇబ్బందే పెడతాయి. కన్నడ పరిమళం తగుపాళ్లలో మిగుల్చుతూ నాగిణి అప్పసాని తెలుగు అనువాదం సాగుతుంది.   కథలో ఉన్న ప్రయాణవేగానికి తగిన శైలి మూలరచయిత సతీశ్‌ది అయితే, తెలుగులో అందుకు ఏ మాత్రం లోటు చేయని అనువాదం నాగిణిది.  కన్నడ సాహిత్యం, ముఖ్యంగా నవలాసాహిత్యం కొత్తపుంతలు తొక్కుతోంది. సంకోచాలను దాటుతూ కొత్త ప్రాతిపాదికల మీద వస్తున్న రచనలు, చరిత్ర ఆధారిత కాల్పనిక నవలలు తెలుగుపాఠకులను కన్నడ సాహిత్యాభిమానులుగా చేస్తున్నాయి. ఇప్పుడు ‘ఘాంద్రూక్‌’ కూడా ఆ జాబితాలో చేరుతుంది.  (సతీష్‌ చప్పరికె కన్నడంలో రాసిన ‘ఘాంద్రుక్‌’ నవలను ఇదే పేరుతో నాగిణి అప్పసాని తెలుగులోకి అనువాదం చేశారు. ఈ పుస్తకానికి ‘తోవ ఎక్కడ సోఫియా..?’ శీర్షికతో కె. శ్రీనివాస్‌ రాసిన ముందుమాట నుంచి కొన్ని భాగాలు)
-కె శ్రీనివాస్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page