వ్యవసాయ సంక్షోభం పై చర్యలేవీ?

 రైతన్నలపై మోదీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి
సమస్యల వలయంలో అన్నదాతలు,
ఆత్మహత్యల బాట పడుతున్న వ్యవసాయ కార్మికులు

దేశంలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఇటీవల సమర్పించిన మధ్యంతర నివేదిక  కళ్ళకు కట్టినట్టు చూపింది. సమస్యల వలయంలో చిక్కుకున్న అన్నదాతలు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యల బాట పడుతున్న తీరును ఈ నివేదిక సోదాహరణంగా వివరించింది. అన్నదాతలే గోసతీస్తుంటే వారి విూద ఆధారపడ్డ వ్యవసాయ కార్మికుల కుటుంబాల పరిస్థితి ఎలా బావుంటుందని ప్రశ్నించింది. దేశ వ్యాప్తంగా రైతులు, వ్యవసాయ కార్మి కుల బలవన్మరణాలు పెరిగిపోతుండటానికి ఇదొక ముఖ్య కారణమని ఆ నివేదిక కుండ బద్దలు కొట్టింది. ఈ పరిస్థితిని తక్షణమే మార్చాలని పేర్కొనడంతో పాటు, దానికి అవసరమైన కనీస చర్యలనూ సూచించింది. కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించడంతో పాటు, దేశ వ్యాప్తంగా తక్షణమే రైతులకు రుణమాఫీ అమలు చేయడం ఈ కమిటీ చేసిన సూచనల్లో అత్యంత కీలకమైనవి. వ్యవసాయ మార్కెటింగ్‌ వ్యవస్థను మెరుగుపరచడం, సేంద్రీయ వ్యవసాయాన్ని, పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహించడంతో పాటు వ్యవసాయ కార్మికుల పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఉపాధిహావిూ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పింది. ఇంత కీలకమైన ఈ సిఫార్సులకు విూడియాలో పెద్దగా ప్రాధాన్యత లభించకపోవడం ఆశ్చర్యకరమైన విషయం.
కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణం రైతుల సమస్యలను  పరిష్కరించడంపై దృష్టి సారించాలి. సుప్రీంకోర్టు ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సు చేసిన, రైతాంగం ఎప్పటి నుండో డిమాండ్‌ చేస్తున్న కనీస మద్దతు ధరకు చట్టబద్దత, రుణ మాఫీ వంటి చర్యలకు తక్షణం శ్రీకారం చుట్టాలి.  గత నెల రెండవ తేదీన పంజాబ్‌`హర్యానా హైకోర్టుకు చెందిన రిటైర్డ్‌ న్యాయమూర్తి నవాబ్‌సింగ్‌ అధ్యక్షతన ఈ ఉన్నత స్థాయి కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. వ్యవసాయ రంగాన్ని అధ్యయనం చేసి సాధ్యమైనంత త్వరగా నివేదికను సమర్పించాలని ఈ కమిటీని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకు పక్షం రోజుల్లోనే ప్రాథమిక పరిశీలనను పూర్తిచేసిన ఈ కమిటీ నవంబర్‌ 21వ తేదీన మధ్యంతర నివేదికను సమర్పించింది. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన మూడు దశాబ్దాల దేశ వ్యాప్త నివేదికలు, గణాంకాలను ఈ కమిటీ పరిశీలించింది. పంజాబ్‌`హర్యానా రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి రూపొందించిన ఈ నివేదికలో అనేక షాకింగ్‌ విషయాలను పేర్కొంది. ముప్పయి సంవత్సరాలలో దేశ వ్యాప్తంగా నాలుగు లక్షల మంది రైతులు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఈ కమిటీ తేల్చింది. నేషనల్‌ క్రైమ్  రికార్డు బ్యూరో డేటా ఆధారంగా ఈ నిర్దారణకు కమిటీ వచ్చింది.
ఇవి అధికారిక లెక్కలే కావడంతో వాస్తవంలో ఈ బలవన్మరణాలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వ్యవసాయం విూదనే ఆధారపడిన రైతులు రోజుకు 27 రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నట్లు కమిటీ తేల్చింది. జాతీయ సర్వేతో పాటు నాబార్డు నివేదికలు, గ్రావిూణ భారతంలోని వ్యవసాయ కమతాలు, పశుసంపదకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ రికార్డులను పరిశీలించి రైతుల ఆదాయంపై ఈ నిర్దారణకు వచ్చిన కమిటీ ‘ఇంత తక్కువ ఆదాయంతో జీవనాన్ని కొనసాగించడం అసాధ్యం. ఇదే వారిని ఆత్మహత్యల వైపు నడిపిస్తోంది’ అని పేర్కొంది.

దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం కార్మికుల్లో 46 శాతం మంది ఇప్పటికీ వ్యవసాయం విూదనే ఆధారపడి ఉన్నారని, ఆదాయంలో వారి వాటా కేవలం 15 శాతమేనని తెలిపింది. వ్యవసాయ కార్మిక కుటుంబాల్లో నిరుద్యోగులుగా ఉన్న వారు, జీతం లేకుండానే కుటుంబం తరపున రెక్కలు ముక్కలు చేసుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉందని కమిటీ పేర్కొనడం గమనార్హం. ఇది ఏదో రూపంలో కొనసాగుతున్న  వెట్టిచాకిరీకి నిదర్శనం.మ సమస్యల పరిష్కారం కోసం సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో రైతాంగం దేశ వ్యాప్త ఆందోళనకు తిరిగి సిద్ధమౌతున్న నేపథ్యంలో ఈ నివేదిక వెలువడటం ప్రాధాన్యత నంతరించుకుంది. కొన్ని సంవత్సరాలుగా రైతాంగం ఏదైతే చెబుతుందో దాదాపుగా అవే అంశాలు అంతే తీవ్రతతో ఈ నివేదికలోనూ కనిపించడం క్షేత్రస్థాయిలో నెలకొన్న దుస్థితికి దర్పణం పడుతోంది.

రేగటి నాగరాజు 

(సీనియర్ జర్నలిస్ట్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page