– గచ్చిబౌలిలో ఓజ్రిట్ కార్యాలయాన్ని ప్రారంభించిన కేటీఆర్
– రాబోయే రోజుల్లో వెయ్యిమందికిపైగా ఉద్యోగావకాశాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రముఖ టెక్నాలజీ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కంపెనీ ఓజ్రిట్ తన నూతన కార్యాలయాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలో బుధవారం ప్రారంభించింది. రాష్ట్ర ఐటీ శాఖ మాజీ మంత్రి, బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) ముఖ్య అతిథిగా కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కంపెనీ నూతన లోగోను ఆవిష్కరించారు. సంస్థ ఫౌండర్ అండ్ సీఈవో భరత్ గుప్తా, కో-ఫౌండర్ అండ్ సీఓఓ వివేకానంద రెడ్డి తదితర నాయకత్వ బృందంతో కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమై పలు కీలక విషయాలపై చర్చించారు. తెలంగాణను భారత దేశంలోనే అగ్రగామి టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌గా మార్చడంలో కేటీఆర్ చేసిన కృషిని, ఆయన దార్శనికతను సంస్థ వ్యవస్థాపకులు ప్రత్యేకంగా కొనియాడారు. కేటీఆర్ ప్రోత్సాహం, ఆయన సాంకేతిక ఆధారిత అభివృద్ధి లక్ష్యాల స్ఫూర్తితోనే ఓజ్రిట్ స్థాపించినట్లు వారు తెలిపారు. ఆవిష్కరణలు, ఆంత్రప్రెన్యూర్‌షిప్, ఉపాధి కల్పనపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టడం వల్లే తమ వంటి సంస్థలు తెలంగాణ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించి వృద్ధి చెందడానికి ప్రేరణగా నిలిచిందన్నారు. భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు సృష్టించడం, టైర్-2 (ద్వితీయ శ్రేణి) నగరాలకు తమ కార్యకలాపాలను విస్తరించడంపై దృష్టి పెట్టామని, రాబోయే సంవత్సరాల్లో తమ ఉద్యోగుల సంఖ్యను వెయ్యిమందికి పైగా పెంచుతామని చెప్పారు. ఈ ఐటీ ఎకోసిస్టమ్‌కు తమవంతు సహకారం అందించడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఓజ్రిట్ సంస్థ ప్రధానంగా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సొల్యూషన్స్, ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్, క్లౌడ్ టెక్నాలజీస్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తోపాటు పలు రంగాల్లో వ్యాపార సంస్థలకు అత్యాధునిక సేవలు అందిస్తోంది. కేవలం దేశంలోనే కాక అంతర్జాతీయ మార్కెట్లలోనూ తమ క్లయింట్‌లకు సేవలు అందిస్తూ సాంకేతిక ఆవిష్కరణల ద్వారా సంస్థల వేగవంతమైన వృద్ధికి తోడ్పడుతోంది. హైదరాబాద్‌ను గ్లోబల్ టెక్నాలజీ డెస్టినేషన్‌గా మరింత బలోపేతం చేయడంతోపాటు, తెలంగాణ అంతటా నాణ్యమైన ఉపాధి అవకాశాలను సృష్టించడంలో కంపెనీ నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుందని యాజమాన్యం పేర్కొంది. భవిష్యత్ ఆవిష్కరణలు, రాష్ట్రంలో బలమైన టెక్నాలజీ ఎకోసిస్టమ్ నిర్మాణం తదితర అంశాలపై వారి మధ్య చర్చలు జరిగాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




