గత పదేళ్లలో చేసిన తప్పిదాలకు ఆధారాల సేకరణ..
అగ్రనేతలకు ఉచ్చులు బిగించే దిశగా కాంగ్రెస్
మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలోని బిఆర్‌ఎస్ నేతలు ఒక్కొక్కరిని ఊచలు లెక్కపెట్టించే పనిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందేమోననిపిస్తోంది .తాజాగా బిఆర్‌ఎస్ నేత, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్‌ను జైలుకు పంపే యత్నాన్ని చూస్తే ఆ అనుమానానికి బలాన్ని చేకూరుస్తోంది .అయితే ఆయనకు ముందస్తు బెయిల్ రావడంతో జైలు బాధ తప్పింది. బిఆర్‌ఎస్ లీగల్‌సెల్ చేసిన ప్రయత్నానికి నాంపల్లి కోర్టు కొన్ని నిబంధనలతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన నేతలు ఒకరి తర్వాత ఒకరిని జైలు కూడు తినిపించే యత్నంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఉన్నట్లు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే కొందరు జైలు జీవితం అనుభవించగా.. మరికొందరి మెడకు ఉచ్చు బిగించే దిశగా యత్నాలు జరుగుతున్నాయి. గతంలో టిడిపి నేతగా ఉన్న రేవంత్‌రెడ్డిని వోటుకు నోటు కేసులో నాటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం జైలు పాలు చేసిన విషయం తెలియంది కాదు.
ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్‌రెడ్డికి నేడు అధికారం హస్తగతమైంది. ఒక పథకం ప్రకారం తనను జైలు పాలు చేసిన ఆ పార్టీ ముఖ్యనేతలకు చిప్పకూడు తినిపించాలన్న పట్టుదల ఆయనలో ఉన్నట్లు కనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టింది. మొదలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ఏడాది కాలంలో బిఆర్‌ఎస్ నేతలు జైలుకు వెళ్లక తప్పదన్న విషయాన్ని పలు సందర్భాల్లో ఆయన పేర్కొంటూనే ఉన్నారు. అందుకు తగినట్లుగా బిఆర్‌ఎస్ పదేళ్ల కాలంలో చేసిన తప్పిదాలన్నిటినీ వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. వాటికి సంబంధించిన ఆధారాలు, సాక్షాలను సేకరించే పనిని సంబంధిత సంస్థలకు అప్పగించడం ద్వారా బిఆర్‌ఎస్ ఆగ్రనేతలు ఎట్టి పరిస్థితిలో తప్పించుకోలేని విధంగా పథక రచన చేస్తున్నారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కాళేశ్వరం మొదలు విద్యుత్ ఒప్పందాలు, ఔటర్ రింగ్‌రోడ్డు కాంట్రాక్టు, ధరణి అవకతవకలు ఇలా ఒక్కటేంటి గత ప్రభుత్వం వివిధ రంగాల్లో చేసిన అవినీతి, అక్రమాలన్నిటిపైన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వివిధ సంస్థలద్వారా దర్యాప్తులను కొనసాగిస్తున్నది. దీంతో బిఆర్‌ఎస్ పార్టీ ప్రథమశ్రేణి నాయకులకు ఉచ్చు బిగుస్తుండగా, ద్వితీయశ్రేణి నాయకులు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, పరుశపదజాలంవాడి నాయకులను, అధికారులను అవమానపర్చారనో తదితర ఆరోపణలతో కేసులు నమోదుచేసి శిక్షార్హులను చేస్తోంది ప్రభుత్వం. తాజాగా ఎర్రోళ్ళ శ్రీనివాస్‌పైన మోపిందికూడా అలాంటి కేసే. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్నది ప్రస్తుతం ఆయనమీదున్న అభియోగం. హుజురాబాద్ బిఆర్‌ఎస్ ఎంఎల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్టు సమయంలో ఆయన అరెస్టును వ్యతిరేకిస్తూ పోలీసులపట్ల దురుసుగా ప్రవర్తించాడంటూ శ్రీనివాస్‌పైన కేసు నమోదు చేశారు.
ఎలాంటి ముందస్తు నోటీసులేకుండా మారేడుపల్లిలోని శ్రీనివాస్ ఇంటికి తెల్లవారుజామున వెళ్ళి పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని బిఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. తీవ్రవాదులను, దోపిడీ దొంగలను పట్టుకుపోయినట్లు వివిధ పోలీసుస్టేషన్‌ల చుట్టూ తిప్పడమేంటని ప్రశ్నిస్తున్నారు. హాస్టళ్ళలో విద్యార్ధులు విషాహారం తిని చనిపోవడాన్ని, కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి అన్న తిరుపతిరెడ్డి 144వ సెక్షన్‌కు అతీతుడాఅని ప్రశ్నించడం, సచివాలయం ముందు రాజీవ్ విగ్రహాన్ని ఏర్పాటును వ్యతిరేకించడంలాంటి పలు అంశాల్లో ఆయన గొంతుఎత్తడాన్ని తట్టుకోలేకే ప్రభుత్వం ఆయన్ను అదుపులోకి తీసుకుందన్నది బిఆర్‌ఎస్ ఆరోపణ. గతంలో కౌశిక్‌రెడ్డి, లగచర్ల కేసులో మాజీ ఎంఎల్‌ఏ పట్నం నరేందర్‌రెడ్డిని జైలుకు పంపిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. హైదరాబాద్‌లో కెబిఆర్ పార్క్‌లో మార్నింగ్‌వాక్ చేస్తున్న నరేందర్‌రెడ్డి అరెస్టుఅయి, 37 రోజులపాటు జైల్ జీవితాన్ని అనుభవించిన విషయం తెలిసిందే. తనతోపాటు ఏ పాపం తెలియని పలువురు రైతులను జైలుపాలుచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ నేత కెటిఆర్‌ను కూడా ఈ కేసులో అక్రమంగా ఇరికించే ప్రయత్నంచేసిందని నరేందర్‌రెడ్డి ఆరోపిస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితి ఏమిటన్నది న్యాయస్థానంలోగాని తేలదు. ఇదిలాఉంటే బిఆర్‌ఎస్‌లోని నలుగురు అగ్రనేతల్లో ఇప్పటికే లిక్కర్ కేసులో ఎంఎల్సీ కవిత జైలు శిక్షను అనుభవించింది.
కాగా, రాష్ట్ర ప్రభుత్వం కెసిఆర్, కెటిఆర్ చుట్టూ ఉచ్చు సిద్దం చేస్తున్నది. ఒకవైపు కాళేశ్వరం కెసిఆర్ కంఠానికి బిగుస్తుండగా, ఔటర్ రింగ్‌రోడ్డు మరో ఉచ్చుగా బిగుస్తున్నది. శాసనసభ ఎన్నికలకు ముందు గతప్రభుత్వం ఓఆర్‌ఆర్ టోల్ కాంట్రాక్టును 30 ఏళ్లకు ఒకప్రైవేటు సంస్థకు లీజుకి ఇవ్వడంపైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో దర్యాప్తుకు నిర్ణయించింది. టెండర్ ప్రక్రియ కాకుండా బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆయాచితంగా కొందరికి లబ్ది చేకూర్చిందన్నది అభియోగం. అలాగే ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో మాజీ మంత్రి కెటిఆర్ జైలుకు వెళ్తాడన్న ప్రచారం జరుగుతున్నది. ఈ విషయంలో ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తున్నది. గవర్నర్ అనుమతి, మంత్రివర్గ తీర్మానంతో ఈ కేసును ఏసిబికి అప్పగించగా, ఇందులో ఇడి కూడా ప్రవేశించింది. తాను నిర్దోశినని, అయినా తప్పుడు ఆరోపణతో జైలుకు పంపినా వెళ్లేందుకు సిద్దమేనంటున్నారు కెటిఆర్.
ఇక బిఆర్‌ఎస్ మరో ముఖ్యనేత, ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీష్‌రావుపైన కూడా అభియోగాలున్నాయి. సిద్దిపేట కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ తన ఫోన్ ట్యాపింగ్ వెనుక హరీష్‌రావు హస్తముందని చేసిన ఫిర్యాదుతో హరీష్‌రావుపైన కేసు నమోదయింది. శాసనసభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఓటమిపాలైన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నందుకే తనను టార్గెట్ చేస్తూ కేసులు బనాయిస్తున్నారంటున్నారు హరీష్‌రావు. మొత్తం మీద కేసులు, ఆరోపణలతో రాష్ట్ర రాజకీయాలు గరంగరంగా కొనసాగుతున్నాయి. కాగా, తమను రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని న్యాయపరంగానే ఎదుర్కోవడంతో పాటు, ప్రజల పక్షాన పోరాటాన్ని ఆపేదిలేదని స్పష్టం చేస్తున్నారు బిఆర్‌ఎస్ నేతలు.