– తుఫాన్ సమయంలో ఇలాగేనా వ్యవహరించేది?
– గతంలో ఇస్తామన్న సాయం ఎందుకు ఇవ్వలేదో
– అజారుద్దీన్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు నిజం కాదా..
– బీజేఎల్‌పీ నేత ఏలేటి విమర్శలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్31: రాష్ట్రమంతా మొంథా తుఫాన్‌తో అల్లకల్లోలం అవుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి ఏం చర్యలు తీసుకున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. మొంథా తుఫాన్ చర్యలపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని చూసి రేవంత్‌రెడ్డి నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏప్రిల్, మేలో కూడా అకాల వర్షాలు కురిశాయని, ఆ సమయంలో పంట నష్టం జరిగితే సీఎం రేవంత్‌రెడ్డి రూ. 0 వేలు పరిహారం ఇస్తామని చెప్పినా ఇంకా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. కేవలం పేపర్ స్టేట్‌మెంట్ మాత్రమే ఇస్తున్నారని, ఆచరణలోకి ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తుఫాను, వర్షం తదితర విపత్కర పరిస్థితులపై అధికారులతో లెక్కలు తెప్పించుకోవడం, తర్వాత గాలికి వదిలేయడం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని విమర్శించారు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక.ఎన్ని ఎకరాలకు పరిహారం ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలని, రైతులని ఆదుకోవాలనే ఆలోచన రేవంత్‌రెడ్డికి లేదని ఫైర్ అయ్యారు. తడిసిన ధాన్యంతో కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మైనార్టీ వోట్ల కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఆడుతున్న ఆటని ప్రజలు గమనిస్తున్నారన్నారు. అజారుద్దీన్ క్రికెటర్‌గా మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయని, ఆయనతో మంత్రిగా ఎలా ప్రమాణ స్వీకారం చేయించారని ప్రశ్నించారు. గో సంరక్షకులను తుపాకీతో కాలిస్తే ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. సీఎం వెనుక మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఉన్నారని ఆరోపించారు. అసదుద్దీన్ డి ఫాక్టో సీఎంగా వ్యవహరిస్తున్నారని ఏలేటి విమర్శించారు. మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు రాజ్యాంగాన్ని ఇద్దరే చదివినట్లున్నారని విమర్శించారు. ఒక వర్గం మెప్పు కోసం కాంగ్రెస్ చేసే ప్రయత్నం చట్ట వ్యతిరేకమని ఆక్షేపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్‌కు మజ్లిస్ మద్దతిచ్చిందని గుర్తుచేశారు. అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కాకముందే మంత్రి పదవిని అసదుద్దీన్ ఇప్పించుకున్నారని విమర్శించారు. హిందువులను విస్మరించిన సీఎం రేవంత్‌రెడ్డికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో హిందువులే దిమ్మ తిరిగే తీర్పు ఇవ్వబోతున్నారని మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.





