– తడిసిపోయిన పత్తి, వరి
– హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం
హైదరాబాద్/వరంగల్, ప్రజాతంత్ర, నవంబర్ 4: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో వర్షాలు దంచికొట్టాయి. మంగళవారం ఉదయం నుంచి కుండపోత వాన కురిసింది. వరంగల్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు అరగంట పాటు కురిసిన కుండపోత వర్షానికి నగర రహదారులు చెరువులను తలపించాయి. దీంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షానికి ఎనుమాముల మార్కెట్‌లో పత్తి, మొక్కజొన్న తడిసిపోయింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఏర్పడ్డ మొంథా తుపాను ముంపు నుంచి ఇంకా వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాలు పూర్తిగా తేరుకోలేదు. మరోసారి వర్షాలు కురవడంతో లోతట్టుప్రాంత ప్రజల్లో ముంపు భయం నెలకొంది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల్, మేడ్చల్ – మల్కాజిగిరి, యాదాద్రి – భోంగీర్ వంటి పశ్చిమ, మధ్య, దక్షిణ తెలంగాణలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, జనగాం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మేయర్ గుండు సుధారాణి, స్థానిక కార్పొరేటర్, సంబంధిత అధికారులతో కలిసి జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 11వ డివిజన్ పోతన నగర్‌లో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. నాలాల భౌతిక స్థితి పరిశీలించి, వరద నీరు నిల్వ ఉండకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాల సూచించారు. ఇదిలావుంటే హైదరాబాద్‌లో మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలుచోట్ల జల్లులు కురిసాయి. రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కుస్తాయనివాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లిడించింది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్, నల్లగొండతోపాటు పలు జిల్లాల్లో భారీ వాన కురుస్తున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉదయం భారీ వర్షం పడింది. సుమారు అరగంటపాటు ఈదురు గాలులతో కూడిన వాన కుండపోతగా కురిసింది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. ఇక నల్లగొండ జిల్లాలో భారీ వర్షం కురుస్తున్నది. అరేబియా సముద్రం నుంచి తెలంగాణ వైపు తేమ గాలులు వీస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం నుంచి పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని తెలిపింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





