– కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ
వరంగల్, ప్రజాతంత్ర, మే 22: భారతీయ రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది అని కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమల శాఖ మాత్యులు భూపతి రాజు శ్రీనివాస వర్మ అన్నారు. దేశవ్యాప్తంగా ఆధునికీకరించిన 103 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం రాజస్థాన్ లోని బికినీర్ నుండి వర్చువల్ గా ప్రారంభించారు. అందులో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమల శాఖామాత్యులు భూపతి రాజు శ్రీనివాస వర్మ,రాష్ట్ర రెవిన్యూ హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భూపతి వర్మ శ్రీనివాస్ రాజు మాట్లాడుతూ పార్టీలకతీతంగా అభివృద్ధి లక్ష్యంగా పని చేయాలన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అమృత్ భారత్ పథకంలో వరంగల్ స్టేషన్ అభివృద్ధి చేశారన్నారు.రాబోయే రోజుల్లో బుల్లెట్ రైలు కూడా తీసుకురావడానికి భారత్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతం రూ.5300 కోట్లు కేటాయించి రైల్వేలను ఆధునికీకరించామన్నారు. భారతదేశంలోని 1300 రైల్వే స్టేషన్ లను లక్ష కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లు ఉన్నాయని ప్రస్తుతం మూడు రైల్వేస్టేషన్లు ప్రారంభిస్తున్నామని, ఇతర రైల్వే స్టేషన్లను కేంద్రం త్వరలో అభివృద్ధి చేస్తుందన్నారు. రూ. పాతిక కోట్లతో కాజీపేట రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశామని, వరంగల్లో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటైందన్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని మూడు రైల్వే స్టేషన్లను ఆధునికీకరించారన్నారు. ఇందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రధాని మోదీకి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచంలోనే హైదరాబాద్ ఎలా అయితే అభివృద్ది చెందిందో ఆ విధంగానే వరంగల్ నగరం కూడా అభివృద్ధి సాధించాలని అన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశలో కొంత భాగాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, రెండవ దశలో 76 కిలోమీటర్ల విస్తరణకు సంబంధించి రూ. 24500 కోట్లతో ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో వున్నాయన్నారు. ఈ ప్రతిపాదనలు త్వరగా ఆమోదించాలని కోరారు.మహానగారానికి రీజినల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసుకుంటున్నామని దానికి సమాంతరంగా రైల్వే లైన్ ను కూడా ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు.వికారాబాద్- కృష్ణా రైల్వే లైన్, కల్వకుర్తి మాచర్ల , డోర్నకల్ గద్వాల్ కొత్త రైల్వే రైల్వే లైన్లతోపాటు హైదరాబాద్ మహానగరానికి మెట్రో రైలు, ఆర్ ఆర్ ఆర్ కు సమాంతరంగా రైల్వే లైన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్నదన్నారు.
శాసనమండలి ఉపసభాపతి బండ ప్రకాష్ మాట్లాడుతూ భారత్ స్టేషన్ పథకం కింద రూ.25.41 కోట్ల రూపాయల వ్యయంతో తక్కువ కాలంలో కాకతీయ కళావైభవం ఉట్టిపడేలా తీర్చిదిద్దిన వరంగల్ రైల్వే స్టేషన్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా పర్చువల్ విధానంలో ప్రారంభించుకోవడం సంతోషదాయకమన్నారు. పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల్లో సమాన అభివృద్ధి జరుగుతున్నదన్నారు. 425 కోట్ల వ్యయంతో చర్లపల్లి టెర్మినల్‌ను అత్యాధునికంగా నిర్మించారన్నారు. పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ కాకతీయుల కళలు ప్రతిబింబించేలా వరంగల్ రైల్వే స్టేషన్ నిర్మాణం చేయడం అభినందనీయమన్నారు. పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ మాట్లాడుతూ అమృత్ భారత్ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా పునరుద్ధరించిన 103 రైల్వే స్టేషన్లలో సకల సౌకర్యాలు కల్పించి ప్రధానమంత్రి వర్చువల్‌గా ప్రారంభించి దేశానికి అంకితం చేశారన్నారు. శాసనమండలి సభ్యులు బసవరాజు సారయ్య మాట్లాడుతూ రైల్వే స్టేషన్లో విమానాశ్రయం తరహాలో ప్రయాణికులకు అత్యాధునిక వసతులు కల్పించారని, కాకతీయ కళలు, గ్రామీణ ప్రాంతాలకు అద్దం పట్టేలా నిర్మించారన్నారు. వీరితోపాటునగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి,ఎమ్మెల్యే లు కే ఆర్ నాగరాజు, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, యశస్విని రెడ్డి, కుడా ఛైర్మెన్ ఇనుగాల వెంకట్రాం రెడ్డి, జిల్లా కలెక్టర్ డా.సత్య శారద బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే రైల్వే అధికారులు పాల్గొన్నారు.