
ప్రజారోగ్యం అనేది కేవలం వ్యాధులకు చికిత్స అందించే వ్యవస్థ కాదు. సమాజం సమిష్టి కృషి ద్వారా వ్యాధులను నివారించడం, ఆయుష్షును పెంచడం, ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం అనే శాస్త్రం, కళ. ఈ లక్ష్యాలను సాధించేందుకు ప్రజారోగ్య చట్టం రాష్ట్రం, స్థానిక సంస్థలు, సమాజం కలిసి పనిచేసే విధానాన్ని, అధికారాలను, బాధ్యతలను నిర్దేశిస్తుంది. అదే సమయంలో వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత, ఆస్తి హక్కులు వంటి మౌలిక హక్కులను రక్షిస్తూ ప్రభుత్వ అధికారాలకు తగిన పరిమితులను కూడా విధిస్తుంది.
ఆరోగ్య వ్యవస్థకు కనిపించని వెన్నెముక
అమెరికన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి సంస్థలు ప్రజారోగ్యానికి అవసరమైన మౌలిక సేవలను నిర్వచించాయి. వ్యాధుల పర్యవేక్షణ, పారిశుద్ధ్యం, ఆహార భద్రత, సురక్షిత తాగునీరు, ఆరోగ్య అవగాహన, వ్యాధి నివారణ వంటి సేవలు సమాజ ఆరోగ్యానికి పునాదిగా నిలుస్తాయి. ఇవి ప్రజలకు ప్రత్యక్షంగా కనిపించకపోయినా ఆరోగ్య వ్యవస్థకు వెన్నెముక వంటివి. ఈ వ్యవస్థలు బలహీనపడితే నివారించగలిగే వ్యాధులు, మరణాలు పెరిగే ప్రమాదం ఉంది. ప్రజారోగ్య ఫలితాలు వైద్యరంగంపైనే ఆధారపడవు. పరిశుభ్రత, తాగునీరు, పర్యావరణం, విద్య, పోషకాహారం, పట్టణ ప్రణాళిక వంటి అనేక రంగాల సమన్వయం అవసరం. అందుకే సమర్థవంతమైన ప్రజారోగ్య పరిపాలనకు చట్టపరమైన బలం అత్యంత కీలకం.ప్రజారోగ్య చట్టాలు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. మౌలిక సదుపాయాల చట్టాలు ప్రజారోగ్య సంస్థల ఏర్పాటు, డేటా సేకరణ, తనిఖీలు, లైసెన్సులు, నియంత్రణ చర్యలకు అధికారాన్ని కల్పిస్తాయి. జోక్య చట్టాలు మైనర్లకు పొగాకు విక్రయాల నిషేధం, ఆహార భద్రత ప్రమాణాలు, అంటువ్యాధుల సమయంలో క్వారంటైన్ వంటి ప్రత్యేక చర్యలకు చట్టబద్ధత కల్పిస్తాయి. భారతదేశంలో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితుల నిర్వహణ ఇప్పటికీ పాత చట్టాలు, శిక్షణ పొందిన ప్రజారోగ్య సిబ్బంది కొరత, అమలు లోపాల కారణంగా ఆశించిన స్థాయిలో లేదు.
రాజ్యాంగం కల్పించిన పునాదులు
భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ ప్రకారం ప్రజారోగ్యానికి సంబంధించిన చట్ట నిర్మాణ అధికారాలు కేంద్రం, రాష్ట్రాల మధ్య విభజించబడ్డాయి. ఆసుపత్రులు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా వంటి అంశాలు ప్రధానంగా రాష్ట్రాల పరిధిలో ఉండగా, జనాభా నియంత్రణ, మానసిక ఆరోగ్యం, ఆహార భద్రత, సంక్రమణ వ్యాధుల నియంత్రణ, కార్మిక సంక్షేమం వంటి అంశాలపై కేంద్రం, రాష్ట్రాలు రెండూ చట్టాలు చేయగలవు. రెండు చట్టాల మధ్య విభేదం ఏర్పడితే కేంద్ర చట్టానికే ప్రాధాన్యం ఉంటుంది. రాజ్యాంగంలోని 14, 15, 21 అధికరణాలను సుప్రీంకోర్టు జీవన హక్కులో ఆరోగ్య హక్కును అంతర్భాగంగా విశదీకరించింది. రాష్ట్ర పాలనా దిశానిర్దేశక సూత్రాలు కూడా పోషకాహారం, జీవన ప్రమాణాలు, పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్య అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని స్పష్టం చేస్తున్నాయి.
విభిన్న చట్టాలు – కొత్త సవాళ్లు
స్వాతంత్ర్యం తర్వాత ప్రజారోగ్య చట్టాల రూపకల్పన ప్రధానంగా రాష్ట్రాల బాధ్యతగా కొనసాగింది. కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ప్రత్యేక ప్రజారోగ్య చట్టాలు అమల్లో ఉన్నాయి. వాటిలో చాలా దశాబ్దాల క్రితం రూపొందించబడినవే. 1939లో అమల్లోకి వచ్చిన తమిళనాడు ప్రజారోగ్య చట్టం అనేక సవరణలకు లోనైంది. దేశవ్యాప్తంగా ఏకరీతి కోసం కేంద్ర ప్రభుత్వం 1987 మోడల్ పబ్లిక్ హెల్త్ బిల్, 2002 నేషనల్ పబ్లిక్ హెల్త్ బిల్, 2009 నేషనల్ హెల్త్ బిల్ వంటి నమూనా చట్టాలను ప్రతిపాదించింది.ఈ చట్టాలు పారిశుద్ధ్యం, నీటి సరఫరా, మార్కెట్లు, ఆహార భద్రత, సంక్రమణ వ్యాధుల నియంత్రణ వంటి అంశాలను ప్రస్తావించినప్పటికీ, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, కొత్త అంటువ్యాధులు, వాతావరణ మార్పుల ప్రభావం, పర్యావరణ కాలుష్యం, వేగవంతమైన పట్టణీకరణ వంటి ఆధునిక సవాళ్లను ఎదుర్కొనేంత సమగ్రత వాటిలో లేదు.
బలవంతపు విధానం – హక్కుల ఆధారిత విధానం
సాంప్రదాయ ప్రజారోగ్య చట్టాలు ప్రధానంగా బలవంతపు నియంత్రణ విధానాన్ని అనుసరించాయి. సమాజ సంక్షేమం కోసం ప్రభుత్వం వ్యక్తులపై కొన్ని పరిమితులు విధించవచ్చనే భావన దీనికి ఆధారం. కాలుష్యం, కలుషిత ఆహారం, అంటువ్యాధులు వంటి సామూహిక ప్రమాదాలను నియంత్రించడానికి ఇది అవసరమవుతుంది. అయితే ఆధునిక ప్రజారోగ్య దృక్పథం హక్కుల ఆధారిత విధానాన్ని ప్రోత్సహిస్తోంది. ప్రజారోగ్య చర్యలు చట్టబద్ధంగా, శాస్త్రీయ ఆధారాలతో, అవసరమైనంత మేరకే పరిమితమై ఉండాలి. వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత, మానవ గౌరవాన్ని గౌరవించే విధంగా ప్రభుత్వ జోక్యం ఉండాలనే సిద్ధాంతాన్ని ఇది ప్రతిపాదిస్తుంది.
సమగ్ర ప్రజారోగ్య చట్టమే కాలానుగుణ పరిష్కారం
భారతదేశం ప్రస్తుతం జనాభా మార్పులు, పట్టణీకరణ, పర్యావరణ సంక్షోభం, కొత్త వ్యాధుల ముప్పు వంటి సంక్లిష్ట సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో పాత చట్టాలకు చిన్నచిన్న సవరణలు చేయడం సరిపోదు. ప్రజారోగ్య మౌలిక సదుపాయాలు, అత్యవసర సిద్ధత, డిజిటల్ పర్యవేక్షణ, విభాగాల సమన్వయం, పారదర్శక పరిపాలన, పౌరుల హక్కుల రక్షణను సమగ్రంగా కలిపిన ఆధునిక ప్రజారోగ్య చట్టం అవసరం. సమాజ సంక్షేమం, వ్యక్తిగత స్వేచ్ఛల మధ్య సమతుల్యతను కాపాడటం సవాలే అయినప్పటికీ, శాస్త్రీయ దృక్పథం, రాజ్యాంగ విలువలు, మానవ హక్కులను సమన్వయం చేసే సమగ్ర ప్రజారోగ్య చట్టం మాత్రమే ఆరోగ్యవంతమైన, సురక్షితమైన, స్థిరమైన భారత నిర్మాణానికి బలమైన పునాది వేయగలదు.





