తెలంగాణ బడ్జెట్ పై తలో మాట

  • ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టే బడ్జెట్‌ : కాంగ్రెస్‌
  • గ్యారెంటీలను విస్మరించారు.. : బిఆర్‌ఎస్‌
  • అంకెల గారడీ అంటున్న విద్యాధికులు

    మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి

రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బడ్జెట్‌ రాష్ట్ర ప్రగతికి సోపానమని కాంగ్రెస్‌ నాయకులు మెచ్చుకుంటుండగా, ఈ బడ్జెట్‌లో ప్రజలకిచ్చిన వాగ్ధానాలతోపాటు, పలు రంగాల ఊసే లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు సంబంధించిన హామీల విషయాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా  విస్మరించిందని బిఆర్‌ఎస్‌, బిజెపి  నేతలు విరుచుకుపడుతున్నారు. ప్రజల ప్రాథమిక అవసరాలైన విద్య, వైద్య రంగంలో కేటాయింపులు దారుణంగా      ఉన్నాయంటూ వారు తీవ్ర ధ్వజమెత్తారు. అలాగే మహిళా పక్షపాతిగా చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం మహిళలకు ఇస్తానన్న తులం బంగారం ప్రస్తావించక పోవడాన్ని  వారు ప్రశ్నిస్తున్నారు. అలాగే మహిళకు నెలకు రూ.2500 సాయం కూడా ఈ ప్రభుత్వం విస్మరించిందంటున్నారు.  ఈ బడ్జెట్‌లో వాటి కేటాయింపులు లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు.
అలాగే మహిళలకు వడ్డీ మాఫీ రుణాల విషయంలో చెబుతున్న లెక్కలన్నీ అబద్దమేనని వాదిస్తున్నారు. మహిళా సంఘాలతో కుట్టిస్తున్న పిల్లల స్కూల్‌ యూనిఫాంలకు చెల్లిస్తున్నది 50 రూపాయలైతే రూ.75 చెప్పడంపట్ల వారు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తంచేస్తున్నారు. ఇక రైతుల రుణమాఫీ విషయానికొస్తే  రాష్ట్ర వ్యాప్తంగా ఏగ్రామంలోనూ పూర్తి స్థాయిలో  రైతులకు రుణమాఫీ జరుగలేదని ఆందోళనలు కొనసాగుతున్నా బడ్జెట్‌లో దాని ప్రస్తావన లేకపోవడం చూస్తుంటే రుణమాఫీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలికినట్లు కనిపిస్తున్నదన్నారు. గతంలో యూత్‌ డిక్లరేషన్‌లో నిరుద్యోగ భృతి  అన్నారు. ఈ బడ్జెట్‌లో దానికోసం నిధులను కేటాయించనేలేదు. విద్యారంగానికి గతంలో 15 శాతం పెంచుతామని చెప్పినా, ఈసారి కేవలం 7.57 శాతానికే పరిమితం చేశారు. పెన్షన్‌లను 4 వేలకు పెంచుతామని పేర్కొన్న ప్రభుత్వం ఉన్న పెన్షన్‌లకే కోతపెట్టిందని బిఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ బడ్జెట్‌ ఒక అసమర్థ ప్రభుత్వ బడ్జెట్‌గా వారు అభివర్ణిస్తున్నారు.
కాగా గత ప్రభుత్వకాలంలో ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే విధంగా తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన  బడ్జెట్‌గా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి కూడా అయిన మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రతీ చర్యను విమర్శించడమే పనిగా కొందరు వ్యవహరిస్తున్నారన్నారన్న ఆవేదనను వ్యక్తం చేసిన భట్టి, రాజ్యాంగ నిర్మాత సూచించిన  విధంగా తమ ప్రభుత్వం నైతిక పాలనను కొనసాగిస్తున్నదన్నారు. తాము అధికార పీఠాన్ని హోదాగా భావించడంలేదని, ప్రతీ విషయంలో జవాబుదారీగా వ్యవహరిస్తున్నామన్నారు. ముఖ్యంగా అభివృద్ధి, సంక్షేమం, స్వపరిపాలన అనే అంశాల ప్రాతిపధికన తాము ప్రభుత్వాన్ని కొసాగిస్తున్నట్లు భట్టి తన బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పుకొచ్చారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌ కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లలో రెండవది. అయితే ఈ మధ్యకాలంలో కేవలం తొమ్మిది నెలల కాలంకోసం భట్టి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం జరిగింది. దానితో కలిపి ఆయన మొత్తంగా మూడవసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టినట్లు అయింది. ఈ బడ్జెట్‌ ప్రసంగంలో ఆయన పలుమార్లు గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాలపై విమర్శల పరంపరను కొనసాగించినప్పుడల్లా అధికార సభ్యులు బిఆర్‌ఎస్‌ సభ్యులనుద్దేశించి షేమ్‌ షేమ్‌ అన్న నినాదాలు చేశారు. అలాగే రైతు రుణమాఫీ, భూమి, రేషన్‌కార్డు విషయాల ప్రస్తావన వొచ్చినప్పుడు విపక్షం నుంచి కూడా అరుపులు వినిపించాయి. అయినప్పటికీ రాష్ట్ర ప్రగతికోసం తాము తీసుకున్న నిర్ణయాలన్నిటినీ ఈ సందర్భంగా భట్టి ఏకరువు పెట్టారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి  రాష్ట్ర ప్రభుత్వం 3,04,965 కోట్లతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో ఈసారి ఎస్సీ సంక్షేమానికి పెద్ద పీట వేసింది. ఆ రంగానికి 40వేల 323 కోట్లరూపాయలను కేటాయించగా, తర్వాత స్థానం పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు లభించింది. ఆ శాఖకు 31,605 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, 24వేల 439 కోట్లతో వ్యవసాయరంగాన్ని మూడవ స్థానంలో నిలిపింది.
గతంతో పోలిస్తే ఈ రంగానికి సుమారు వెయ్యికోట్లను అదనంగా కేటాయించిదనే చెప్పాలి. దానితోపాటు విద్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖలకు తగిన ప్రాధాన్యాన్నిచ్చింది. మిగతారంగాలకు ఎప్పటిమాదిరిగానే నిధులను కేటాయించిన ప్రభుత్వం మరికొన్ని ప్రత్యేక కార్యక్రమాలను తీసుకుంది.  రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు మెగా మాస్టర్‌ప్లాన్‌ 2050ని రూపొందించిన విషయాన్ని వివరించింది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పదేళ్లలో ట్రిలియన్‌ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా కార్యాచరణను చేపడుతున్నామని పేర్కొంది. చైనా ప్లస్‌ వన్‌ వ్యూహంతో రాష్ట్రాన్ని గ్లోబల్‌ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే దేశానికి తలమానికంగా ఉండేలా ఫ్యూచర్‌ సిటీని రూపొందిస్తున్నామని, 56 గ్రామాలు, 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది ఏర్పాటు కానున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఇందిరా గిరిజన వికాసంపేరుతో గిరిజన రైతులకోసం కొత్త పథకాన్ని రూపొందించినట్లు తెలిపింది. హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ను అభివృద్ది చేస్తామని, దీన్ని ఐటి హబ్‌గా, విద్యాకేంద్రంగా నెలకొల్పే ప్రయత్నం చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే  ఎయిర్‌పోర్టు మంజూరు, వ్యాగన్‌ ఫ్యాక్టరీకి ప్రయత్నాలు జరిగాయని, కాజీపేటరైల్వే డివిజన్‌ ఏర్పాటుకు కృషి జరుగుతోందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page