ఈయేడు కుంభ వృష్టి వర్షాలు తప్పవు

– ప్రాణనష్టం కూడా ఎక్కువే
– రంగం భవిష్య వాణిలో మాతంగి వెల్లడి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్టు 3 :‌ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర చివరి ఘట్టానికి చేరుకుంది. అమ్మవారి ఆలయంలో మాతంగి స్వర్ణలత సోమ‌వారం భవిష్యవాణి(రంగం) వినిపించారు. మీరెవరూ నేను చెప్పింది ఏదీ ఆచరించడం లేదంటూ మాతంగి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడకు నేను సంతోషంగా రాలేదు.. క్రోధంతో వచ్చానని అన్నారు. ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పాలని నిలదీశారు. నా విగ్రహం ప్రతిష్ఠ‌ చేస్తానని మాట ఇచ్చి జరిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఆపద వచ్చినా, ప్రమాదం వచ్చినా కాపాడుతున్నానని మాతంగి స్వర్ణలత తెలిపారు. కానీ మీరు చేసే చర్యలే నాకు ఆగ్రహం తెప్పిస్తున్నాయ‌ని అన్నారు. వావివరసలు లేకుండా ఘోరాలు జరుగుతున్నాయని, అలాంటి వారిని వదిలిపెట్టనని అన్నారు. వారిని పాదాల కింద నలిపేస్తానని అన్నారు. ఈ ఏడాది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కుంభ వర్షాలు ఉన్నాయని మాతంగి భవిష్య వాణిలో చెప్పారు. అగ్నిప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయని చెప్పారు. ఈ ఏడాది ప్రాణనష్టం భారీగా జరుగుతుందన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొంతమంది కళ్లు నెత్తికెక్కి ప్రవర్తిస్తున్నారని మాతంగి స్వర్ణలత ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ప్రవర్తన తనకు సంతోషం కలిగించడం లేదన్నారు. భవిష్యవాణితో ఈ బోనాల జాతర ముగియనుంది. ఈ నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. రంగం అనంతరం అమ్మవారిని అంబారీపై ఊరేగించారు.

మహంకాళి ఆలయం వద్ద జోగినిలకు అవమానం
-జోగినిలను అడ్డుకోవడంపై ఆలయం ముందు ఆందోళన 

మహంకాళి ఆలయంలో అధికారుల నిర్లక్ష్యంపై జోగిని శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరం వచ్చినప్పుడే జోగినిలను ప్రభుత్వం గుర్తు చేసుకుంటుందని ధ్వజమెత్తారు. బోనాల సందర్భంగా జోగినిలకు కనీస ఏర్పాట్లు కూడా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఆలయ సిబ్బంది జోగినిల ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల అత్యుత్సాహం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆమె ఆగ్రహించారు. ఉదయం నుంచే గేట్ల వద్ద పోలీసులు జోగినిలను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా జోగినిలను అవమానిం చారని దుయ్యబట్టారు. ఆలయ కమిటీ జోగినిలకు సమాధానం చెప్పాలని శ్యామల డిమాండ్‌ ‌చేశారు. పోలీసులు కనీసం జోగినిలని కూడా చూడకుండా బయటకు ఎందుకు నెట్టేశారని ప్రశ్నించారు. జోగినిలకు గౌరవం, ప్రత్యేక ఏర్పాట్లు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్రమంలో ఆలయం ముందు జోగినిలు సోమవారం ధర్నా చేపట్టారు. ఆదివారం బోనాల వేడుకల్లో జోగినిలను అవమానపరిచారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జోగిని శ్యామలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు జోగినిల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బ్యారికేడ్లు తొలగించుకుని జోగినిలు ఆలయంలోకి  ప్రవేశించారు. జోగినిల ఆందోళనతో రంగం కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభమైంది. ఆందోళనతో ఆలయం ముందు గందరగోళ వాతావరణం నెలకొంది. మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎం‌డోమెంట్‌ ఉన్నతాధికారులు జోగినిలతో మాట్లాడి ఆందోళనను విరమించాలని మంత్రి పొన్నం కోరారు.

జోగినిలకు ప్రత్యేక గుర్తింపు కార్డులు : మంత్రి పొన్నం  

లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌కీలక ప్రకటనలు చేశారు. జోగినిలకు ప్రత్యేక గుర్తింపు, గుర్తింపు కార్డుల జారీతోపాటు భవిష్యత్తులో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ రోజు ప్రజలందరికీ శుభదినమని అన్నారు. అమ్మవారి ఆశీర్వాదంతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల జాతర కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. ఈసారి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో కొంత ఒత్తిడి ఏర్పడినా దర్శనాలు సజావుగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేశారని చెప్పారు. జోగినిలకు ప్రత్యేక గుర్తింపు కల్పించాలని వారు కోరిన విషయాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని మంత్రి వెల్లడించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో వారిని కో-ఆప్షన్‌ ‌సభ్యులుగా తీసుకునే దిశగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. అమ్మవారికి సేవ చేసే వారికి మూడు శాఖల సమన్వయంతో లాల్‌దర్వాజా బోనాల సందర్భంగా మరింత మెరుగైన ఏర్పాట్లు చేస్తామని, జోగినిలకు గుర్తింపు కల్పించే అంశంపై సంబంధిత మంత్రితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *