కథని విస్తరించిన శిల్పి

‘చెమ్మ’ : వారాల ఆనంద్

తెలుగుకథను ప్రాంతీయ అనుభవం నుంచి విశ్వజనీన మానవ అనుభూతి స్థాయికి తీసుకెళ్లిన కథకుడు తుమ్మేటి రఘోత్తమరెడ్డి. ఆయనకథల్లో తెలంగాణ నేలతడి, గనికార్మికుల చెమటవాసన, ప్రజాఉద్యమాల నేపథ్యం, చైతన్యం ఉంది. అంతకన్నా ముఖ్యంగా ఆయనకథల్లోనూ జీవితంలోనూ మనిషి పట్ల అపారమైన విశ్వాసం ఉంది. ప్రేమ వుంది. ఆర్ధిక రాజకీయ సామాజిక విషయాల పట్ల ఎంత స్పష్టత వుందో అంతే స్పష్టత మనుషుల ప్రవర్తనల పట్లా వుంది. రచనల్లో సూటిదనం, వాటిల్లో అంతర్లీనంగా ప్రవహించే దుఃఖం ఆయన జీవితంలోనూ వుంది. ఇష్టమయిన విషయాలని, మనుషులని ఎంతగా ప్రేమించగలడో, తనకి ఇష్టంలేని అంశాల పట్ల మనుషులపట్ల అంతే దూరంగా ఉండగలడు. కేవలం తెలంగాణ కథకుడిగా మాత్రమే కాక, ఆధునిక తెలుగుకథను విస్తరించిన సాహిత్యశిల్పిగా గుర్తించాలి. తుమ్మేటి రఘోత్తమరెడ్డి రచనలు తెలుగు సాహిత్యచరిత్రలో చిరస్థాయిగా నిలిచే సృజనాత్మక సంపద. నిజానికి ఒక కథకుడిని అర్థం చేసుకోవాలంటే అతను రాసిన కథలను చదవడం సరిపోదు. అతను నడిచిన నేలను తెలుసుకోవాలి. అతను చూసిన మనుషులను కలవాలి. అతను మౌనంగా భరించిన కాలాన్ని వినాలి. అప్పుడు మాత్రమే ఆ కథల వెనుక ఉన్న జీవితం కనిపిస్తుంది.

 

తుమ్మేటి రఘోత్తమరెడ్డి కథలను చదివినప్పుడు ఒక రచయితను చదవడం కాదు, తెలంగాణ నేల గుండెల్లో దాగి ఉన్న చరిత్రను చదువుతున్నాం అనిపిస్తుంది. రైతు పొలంలో పగిలిన నాగలి,ని బొగ్గుగనిలో నల్లబడినచేతులను తాకుతున్నాం, ఉద్యమాల మధ్య నలిగిపోయిన సాధారణమనిషి ఊపిరిని వింటున్నాం అనిపిస్తుంది. ఆయనకథల్లో ఉద్యమం ఉంది. కానీ అది నినాదంగా మోగదు, రాజకీయచైతన్యం ప్రచారంగానూ, ప్రాంతీయత సంకుచితత్వంగానూ వుండదు. ఇవన్నీ మనిషి జీవితంతో జీవనగమనంలో కలిసిపోయి ఉంటాయి. తుమ్మేటి కథల బలం ఆయనకున్న అనుభవం. ఆ అనుభవాలతో నేర్చుకున్న స్పష్టత. ఆయన జీవితంలో గనికార్మిక ప్రపంచం ముఖ్య అధ్యాయం. బొగ్గుగనుల్లో పనిచేసిన అనుభవం వల్ల అక్కడి మనుషుల బాధలు, ఆశలు, భయాలు, సంఘర్షణలు ప్రత్యక్షంగా తెలుసు. అందుకే కథల్లో కార్మికుడు ఒక‘పాత్ర’ కాదు, సజీవమయిన రూపం. కార్మికుడి అంతరంగాన్ని, అతని కుటుంబ జీవితాన్ని, అతని కలలను, అతని ఓటములను అంత లోతుగా చిత్రించిన కథలు రాసారు. బొగ్గుగనుల్లో దాదాపు మూడు దశాబ్దాలపాటు పనిచేసిన అనుభవం ఆయన రచనలకు జీవితపు మట్టివాసనను అందించింది. పుస్తకాలలో చదివిన ప్రపంచం కంటే ఆయనచూసిన ప్రపంచమే ఎక్కువ. అందుకే కథల్లో కృత్రిమత కనిపించదు. పాత్రలు నడుస్తాయి. మాట్లాడతాయి. నవ్వుతాయి. ఏడుస్తాయి. పాఠకుడితో కలిసి జీవిస్తాయి.

తెలుగు కథాచరిత్రలో గనికార్మికుల జీవితం గురించి అంత లోతుగా రాసిన రచయితలు చాలా అరుదు. బొగ్గుతవ్వే చేతులవెనుక ఉన్న కుటుంబాలను, ఆర్థిక అస్థిరతను, శ్రమకు చెల్లించని సమాజాన్ని, మనిషి విలువను ఆయన అత్యంత సహజంగా చిత్రించారు. తుమ్మేటి రఘోత్తమరెడ్డి ప్రసిద్ధ నవల ‘నల్లవజ్రం’ ఈ దృక్పథానికి ప్రతీక. ‘నల్లవజ్రం’ వంటి ఆయన రచనలు తెలుగుసాహిత్యంలో ప్రత్యేకమైన స్థానం సంపాదించాయి. బొగ్గును ‘నల్లవజ్రం’గా పిలిచే సమాజం, దానిని తవ్వే మనిషిని ఎందుకు గుర్తించదో ప్రశ్నించే రచన అది.

తుమ్మేటి రచనల గురించి మాట్లాడుకునేటప్పుడు తెలంగాణను తప్పించలేం. తెలంగాణ ఆయనకు కేవలం భౌగోళిక నేపథ్యం కాదు. అది ఆయన కథల ఆత్మ. తెలంగాణ భాషను ఆయన కేవలం అలంకారంగా ఉపయోగించలేదు. భాషను బతుకులోతుల్లోంచి వెలికి తీసాడు. ఏ పాత్ర ఎలా మాట్లాడుతుందో అలాగే  రాశాడు. అందుకే ఆయన కథల్లో సంభాషణలు చదివినప్పుడు పుస్తకం చదువుతున్న భావనకంటే మన పక్కనే ఎవరో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. తెలంగాణలో జరిగిన రైతాంగ పోరాటాలు, వామపక్ష ఉద్యమాలు, నక్సలైట్ ప్రభావం, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు  ఇవన్నీ తుమ్మేటి కథలకు నేపథ్యంలో కనిపిస్తాయి. కానీ ఆయన ప్రధాన దృష్టి ఉద్యమంపై కాదు ఉద్యమంలో ఉన్న మనిషిపైనే.

తెలుగు కథాసాహిత్యంలో తుమ్మేటి రఘోత్తమరెడ్డి ‘పనిపిల్ల’ ఒక మైలురాయి. ఒక చిన్న కుటుంబ పరిధిలో కనిపించే సంఘటనను రచయిత ఎంత విస్తృతమైన సామాజిక సందర్భానికి అనుసంధానించగలడో ఈ కథ గొప్పగా నిరూపించింది. స్త్రీ స్థానం, వర్గ సంబంధాలు, కుటుంబ వ్యవస్థ, ఉద్యమ రాజకీయాలు ఇవన్నీ కథలో సహజంగా మిళితమై ఉంటాయి. పనిపిల్ల కథ సమాజానికి అద్దం పట్టడమే కాదు, మన ముఖంతో సహా  మనం చూడడానికి ఇష్టపడని అనేక ముఖాలను కూడా చూపిస్తుంది. తుమ్మేటి రఘోత్తమరెడ్డి రాసిన కథలను ప్రత్యేకంగా నిలబెట్టేది ఆయన కథనశైలి. ఆయన కథల్లో ఆర్భాటం ఉండదు. అనవసరమైన వర్ణనలు ఉండవు. పాఠకుడిని బలవంతంగా కదిలించే ప్రయత్నం ఉండదు. ఒక చిన్న సంఘటనతో పెద్ద జీవితాన్ని చూపిస్తాడు. ఒక సంభాషణతో ఒక కాలాన్ని ఆవిష్కరిస్తాడు. మౌనంతో మనిషి అంతరంగాన్ని విప్పి చూపిస్తాడు. ఈ శిల్పమే ఆయన కథలను చిరస్థాయిగా నిలబెడుతోంది. తుమ్మేటి రఘోత్తమరెడ్డి చాసోలా జీవితాన్ని గమనిస్తాడు. కారామాస్టారిలా సమాజాన్ని అర్థం చేసుకుంటాడు. అల్లం రాజయ్యలా పోరాటాల స్పందనను అందిపుచ్చుకుంటాడు. అయితే ఏ ఒరవడికి అలవాటు పడకుండా ఆయన తనదైన స్వరాన్ని నిర్మించుకున్నాడు. దశాబ్దాలపాటు రచనారంగంలో వున్న తుమ్మేటి రఘోత్తమరెడ్డి ఇప్పుడు చెట్లను ప్రేమిస్తూ, ప్రకృతి ఆవరణలో నివసిస్తున్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ఆడియో వీడియో మాధ్యమాలతో తనకృషిని కొనసాగిస్తున్నారు. అనేకమంది కొత్తవాళ్ళతో, పాతవాళ్ళతో రచనలు చేయిస్తూ తన ఫేస్ బుక్ పేజీని సాహిత్య పత్రిక స్థాయిలో నిర్వహిస్తున్నారు.

ఆయన రచనల్లో ప్రధానమయినవి  తుమ్మేటి రఘోత్తమరెడ్డి కథలు, నల్ల వజ్రం (నవల), జీవించు – నేర్చుకో – అందించు (అనేక సంపుటాలు) , ఒక కథకుడు – నూరుగురు విమర్శకులు, పర్వతాలు చెప్పిన ఆధునిక జానపద కథలు, గుడ్ మార్నింగ్ (మూడు భాగాలు), రిమినిసెన్సెస్ (మూడు సంపుటాలు), ఇంటి పంట,  మిద్దెతోట, పెరటి తోట, వండని వంటలు, మాస్టారు మాట, యాత్రా కథనాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *