పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు
అలుగు పోస్తున్న చెరువులు…వంతెనలపై వరదతో ఆగిపోయిన రాకపోకలు
లోతట్లు ప్రాంతాలు జలమయం
భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్
గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద హెచ్చరిక
భద్రాచలంలో క్షణక్షణం పెరుగుతున్న నీటి మట్టం..మూడో ప్రమాద హెచ్చరిక జారీ
సిరిసిల్ల జిల్లాలో వరదలపై మంత్రి కెటిఆర్…అవసరమైన చర్యలకు ఆదేశం
శ్రీరాంసాగర్‌కు వరదపోటు…నిజామాబాద్ జిల్లాలో వరద పరిస్థితులపై కవిత ఆరా
ఉస్మాన్ సాగర్‌కు వరదపోటు…రెండు గేట్లు ఎత్తి మూసికి విడుదల
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 11 : రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. రెండు రోజులులగా కురుస్తున్న వర్షం మూడోరోజూ కొనసాగింది. ఫలితంగా వరదలతో వాగులు, వంకలు, చెక్‌డ్యామ్‌లు పొంగిపొర్లుతున్నాయి. చెరువుల్లో పెద్దఎత్తున నీరు చేరుతుండడంతో అలుగుపోస్తున్నాయి. కొన్ని చోట్ల కట్టలు తెగి సమీప ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల వంతెనలు పొంగిపొర్లుతుండడంతో గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. కొన్నిచోట్ల పాత ఇళ్లు కూలిపోయాయి. భారీ వృక్షాలు రోడ్లకు అడ్డంగా పడ్డాయి. వరద ఉధృతికి పలుచోట్ల రోడ్లకు గండ్లు పడ్డాయి. విద్యుత్తు స్తంభాలు పడిపోయాయి. పట్టణాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో జనం అవస్థలు పడ్డారు. ఇదిలా ఉంటే వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా మరో మూడురోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్సాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఆసిఫాబాద్ కొమరం భీమ్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అత్యంత ఎక్కువగా పడే అవకాశం ఉంది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భదాద్రి కొత్తగూడెం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ అర్బన్, రూరర్, జనగామలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
పై జిల్లాలలో ఆరంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఇక హైదరాబాద్ నగరంలో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. మరోవైపు భారీవర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పరివాహకంలో ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. శ్రీరాంసాగర్ నుంచి భద్రాచలం వరకు నదిలో భారీ ప్రవాహం కొనసాగుతుంది. మహారాష్ట్ర, ఆదిలాబాద్ , కరీంనగర్ , నిజామాబాద్ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు ఉపనదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. శ్రీరాంసాగర్‌కు వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతుంది. ప్రాజెక్టుకు 99వేల 850 క్యూసెక్కుల వరద ప్రవహిస్తుండగా.. 41 వేల క్యూసెక్కులను 9 గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులుకాగా.. ప్రస్తుతం 1087 అడుగులుగా ఉంది. పూర్తి నీటినిల్వ సామర్థ్యం 90.3 టీఎంసీలు కాగా..ప్రస్తుతం 75.78 టీఎంసీలుగా ఉంది. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. గోదావరిలో 13 లక్షల 6వేల 618 క్యూసెక్కుల వరద ప్రవహిస్తుండగా.. నీటిమట్టం 50.9 అడుగులకు చేరింది. భద్రాచలంలో స్నానఘట్టాల ప్రాంతం నీట మునిగింది. గోదావరి దిగువన ఉన్న ముంపు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక జారీచేసిన అధికారులు.. నీటిమట్టం 53 అడుగులకు పెరిగితే.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. లోతట్టు ప్రాంత ప్రజల్ని పునరావస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఎడతెరిపిలేని వర్షాలతో పాల్వంచలోని కిన్నెరసాని జలాశయానికి వరద భారీగా ప్రవహిస్తోంది. 20 వేల క్యూసెక్కుల మేర వరద ప్రవహిస్తుండగా.. 39 వేల క్యూసెక్కుల… 7 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 407 అడుగులుకాగా… ప్రస్తుతం 403.10 అడుగుల మేర నీరు ఉంది. మరోవైపు కిన్నెరసాని పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వొస్తున్న వరద అంతకంతకూ పెరుగుతుంది. ఆదివారం సాయంత్రం వరకు 27 గేట్లను రెండు వి•టర్ల మేర ఎత్తి.. 3,44,239 క్యూసెక్కుల నీటిని.. దిగువన ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు పార్వతి బ్యారేజీకి వదిలారు. సరస్వతి బ్యారేజీకి 3లక్షల 55 వేల క్యూసెక్కులు వస్తుండగా.. 50 గేట్లు తెరిచి అంతేస్థాయిలో వదులుతున్నారు. లక్ష్మీబ్యారేజీకి 9లక్షల 96 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 75 గేట్లను ఎత్తి దిగువకు అంతే మొత్తం వదులుతున్నారు. మరో వైపు కృష్ణా పరీవాహకంలోనూ వరద పెరుగుతుంది. ఆలమట్టి జలాశయానికి ఎగువన ఉన్న డ్యాంలన్నీ నిండటానికి చేరువయ్యాయి. ఒకటి రెండు రోజుల్లో ఆలమట్టి నుంచి దిగువకు భారీ ప్రవాహం వొచ్చే అవకాశం ఉంది.
ఆదివారం మధ్యాహ్నానికి ఈ జలాశయానికి 75,149 క్యూసెక్కుల ప్రవాహం వొస్తుంది. తుంగభద్ర జలాశయానికి కూడా 88,287 క్యూసెక్కులు వస్తోంది. 12 గంటల వ్యవధిలో 3.81 టీఎంసీల నీల్వ చేరుతోంది. ఆలమట్టి, తుంగభద్ర జలాశయాల నుంచి ఐదు రోజుల వ్యవధిలో దిగువకు ప్రవాహం విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లోని హిమాయత్ సాగర్ నిండుకుండలా మారుతోంది. ఆదివారం ఉదయం నీటిమట్టం 1760.25 అడుగుల్లో ఉండగా.. సాయంత్రానికి 1760.50 అడుగులకు చేరింది. ఆదివారం సాయంత్రం జలమండలి అధికారులు రెండు క్రస్ట్‌గేట్లను అడుగు మేర ఎత్తి వరదను దిగువకు వదిలారు. గండిపేట జలాశయానికి సంబంధించి మూసీ వాగులో మోస్తరు వరద ప్రవాహం పారుతోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని మధ్య, చిన్న తరహా ప్రాజెక్ట్‌లు నిండుకుండల్లా మారాయి.
సిరిసిల్ల జిల్లాలో వరదలపై మంత్రి కెటిఆర్…అవసరమైన చర్యలకు ఆదేశం
జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో పరిస్తితులపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఆరా తీసారు. అధికారులు అప్రమత్తంగా ఉండి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డేతో సోమవారం ఉదయం మంత్రి ఫోన్లో మాట్లాడారు. జిల్లాలో వర్షాలు, వరద పరిస్థితులను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. మిడ్ మానేరు, అప్పర్ మానేరు, అనంతగిరి ప్రాజెక్టుతో పాటు మానేరు నది వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కాలువలు, చెరువులు, కుంటలు, చెక్ డ్యామ్స్ వద్ద కూడా రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లు, భవనాల శాఖ అధికారులు.. బ్రిడ్జిలు, కల్వర్టులను పరిశీలిస్తూ, అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. తెగిపడ్డ విద్యుత్ తీగలు, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలను తొలగించాలని విద్యుత్ శాఖ అధికారులను కేటీఆర్ ఆదేశించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, విద్యుత్, పోలీసు, ఆరోగ్య శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పని చేయాలని చెప్పారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని కేటీఆర్ కోరారు.
శ్రీరాంసాగర్‌కు వరదపోటు…నిజామాబాద్ జిల్లాలో వరద పరిస్థితులపై కవిత ఆరా
భారీ వర్షాల కారణంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు 9 వరద గేట్ల ద్వారా గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 85,740 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా… ప్రస్తుతం 1087అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 90 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం 75 టీఎంసీలుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ ఔట్ ప్లో 41 వేల క్యూసెక్కులుగా ఉంది. ఇక నిజామాబాద్ జిల్లాలో నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరద ముంచెత్తుతుంది. భారీ వర్షాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ క్రిస్టినాతో ఎమ్మెల్సీ కవిత ఫోన్లో మాట్లాడారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ సౌకర్యం, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సత్వర కార్యచరణ రూపొందించాలని ఎమ్మెల్సీ కవిత ఆదేశించారు.
ఉస్మాన్ సాగర్‌కు వరదపోటు…రెండు గేట్లు ఎత్తి మూసికి విడుదల
ఉస్మాన్ సాగర్ జలాశయంలోకి వరద ఉధృతి కొనసాగుతోంది. ఉస్మాన్ సాగర్‌కు 300 క్యూసెక్కుల ఇన్‌ప్లో వొస్తుంది. ఉస్మాన్ సాగర్ నుంచి రెండు గేట్ల ద్వారా మూసిలోకి నీరు వెళుతుంది. ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా..ప్రస్తుత నీటి మట్టం 1786 అడుగులకు చేరుకుంది. హిమాయత్ సాగర్‌కు వస్తున్న 500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వొచ్చి చేరింది. హిమాయత్ సాగర్ రెండు గేట్ల ద్వారా 686 క్యూసెక్కుల నీరు మూసిలోకి వెళుతుంది. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1760.55 అడుగులకు చేరింది.



