పచ్చని నీటి రంగులతో భూకాన్వాస్ పై
తన నాగలి కుంచెతో అద్భుత
ఊపిరి కళాఖండాల్ని సృష్టిస్తాడు
ఈ కర్షక కళాకారుడు
మొదట గీస్తాడు తలంపై పొలాన్ని
చక్కగా చారలు చేసి చల్లుతాడు
మొలకెత్తే రంగులను.. ఆపై
ఒక తడి అలను అలా జిలకరిస్తాడు అంతే!
ఒక నిఖార్సైన కళాజీవి మస్తిష్కంలోకి
ఈ ప్రపంచం తీసుకోబడి
చిలికి చిలికి మధించి
పెల్లుబికుతుంది ఓ సందేశం
ఓ ప్రశ్న ఓ వ్యాఖ్యానం విస్ఫోటనంలా
అలాగే చీల్చుకుని పైకొస్తాయి
కొత్త వర్ణపు మొలకలు తేటగా
మెరుస్తూ పరుచుకుని మొత్తం
ఒక సౌష్టవంగా కొన్ని ఆకృతులలో
ఒక లయగా పునరావృతమై…
తన వదనం పరవశిస్తుంది అపుడు
పడ్డ శ్రమకు ఒక అమోఘ రూపం
నా చేతుల మీదుగా అబ్బా
అని మురిసిపోయి ముసిముసి నవ్వుతూ…
తను గీయనివి కొన్ని వాలిపోయి
అందులో అమరిపోతుంటాయి
పక్షులు పిట్టలు పశువులు ఎర్రలు ఇవన్నీ
ఆ చిత్రానికి ఎరువునిస్తాయి
కాంతులను అద్దుతాయి ఇంకా
పగలు రాత్రులు ఎండా వానలు కూడా
ఒక్కోమారు నీటిలో ముంచెత్తబడుతుంది
ఒక్కోమారు బీటలు వారుతుంది
ప్రకృతి చేతిలో అది చిట్టచివరికి
కన్న కష్టాలకోర్చి తన కళాఖండం
ఇక ప్రదర్శనకు సిద్ధమై
తగిలించబడుతుంది మార్కెట్లో
దళారుల చేతుల్లోనో
విక్రయదారుల జేబుల్లోనో
ఎంతకో నష్టానికో లాభానికో
వేలం వేయబడి…
తెచ్చుకున్న సామగ్రికి రంగులకు
సృష్టించడానికి వెచ్చించిన వాటికి
అప్పులు కడుతూ వడ్డీలు చెల్లిస్తూ
ఇంకో చిత్రాన్ని గీయడానికి మళ్ళా
కాన్వాస్ ను వెతుక్కుంటో
విషయాన్ని ఆలోచిస్తో
గదవకు చేతుపెట్టుకుని
తీక్షణంగా చూస్తుంటాడు
పొడుస్తున్న పొద్దుకేసి
ఆవులిస్తున్న నేలకేసి
పాపం తనకు సృష్టించడమే
తెలుసు కదా ఎప్పటికీ…
బతికించటమే తెలుసు కదా చివరికీ..!!
– రఘు వగ్గు




