‘‘శివగూడెం, మర్రిగూడా, డిండి ప్రాజెక్టు, ఉమ్మడి జిల్లాలోని పూర్తికాని ప్రాజెక్టులు నేటికీ పూర్తి చేయలేదు. ఆయా ప్రాజెక్టుల కింద భూ నిర్వాసితులకు నష్టం పరిహారం చెల్లించలేదు. మునుగోడులో అనేక సమస్యలు పెరుకుపోయాయి, వాటిని ఎందుకు అధికారంలో ఉన్న పార్టీలు న్యాయం చేయలేకపోయాయి. ఎన్నికలు వచ్చినప్పుడు తప్ప ప్రజలు గుర్తుకురాని అధికారంలో ఉన్న పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది..’’
ఉప ఎన్నిక సాధారణంగా ప్రజా ప్రతినిధి మరణిస్తే, లేదా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గతంలో ప్రజల కోరిక మేరకు రాష్ట్రాన్ని సాధించాలని తపనతో రాజీనామా చేసి ఉప ఎన్నికలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి.కానీ మునుగోడు ఉప ఎన్నిక మాత్రం రాజగోపాల్ రెడ్డి,బీజేపీ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే వచ్చిందని వివిధ రకాల విమర్శలు వస్తున్నాయి. తెలంగాణలో బిజెపి బలోపేతం అయి అధికారమే లక్ష్యంగా ముందు వస్తున్న నేపథ్యంలో దానికి ఒక సందర్భంలో బీజేపీ తెలంగాణలో బలపడడానికి టీఆర్ఎస్ సహకరించింది అనే వాదనా లేకపోలేదు. బహుశా రాజగోపాల్ రెడ్డికి కాంట్రాక్టు ఇచ్చి ఉప ఎన్నిక తీసుకువచ్చింది అని ప్రత్యర్థి పార్టీలు చెపుతున్నప్పటికీ స్వయంగా రాజగోపాల్ రెడ్డి ఓ టీవీ ఇంటర్వ్యూలో కాంట్రాక్ట్ వచ్చిన మాట వాస్తవమేనని చెప్పాడు.
రాజగోపాల్ రెడ్డిని సైతం బిజెపి ఊబిలో నెట్టి వేయడంలో బిజెపి అధిష్టానం సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. కరుడుగట్టిన కాంగ్రెస్ నాయకుడు రాజగోపాల్ రెడ్డి, పారదర్శకంగా కాంట్రాక్ట్ వచ్చింది తప్ప రాజకీయాలకు సంబంధం లేదు అని చెప్పే దానిని బట్టి చూస్తే ,రాజగోపాల్ రెడ్డి బిజెపిలోకి చేరాల్సిన అవసరం లేదని ఒక వర్గం చెప్పుతుంది. తెలంగాణలో బిజెపి అధికారమే లక్ష్యంగా అంతర్గతంగా చేస్తున్న కుట్రలు తెలంగాణ సమాజానికి,మునుగోడు ప్రజలకు ముందు ముందు అర్థం అవ్వక తప్పదు. అభివృద్ధి, ఆత్మ గౌరవం కోసం మునుగోడు ఉపఎన్నిక వచ్చిందంట. మునుగోడు ప్రజలు ఏ నాడు కూడా స్థానిక ఎమ్మెల్యే రాజీనామా చేయాలని కానీ ఆత్మగౌవరం లేదని కానీ నిరసనలు పోరాటం చేసిన దాఖలాలు లేవు. ఆత్మగౌరవం తెలంగాణ ప్రజలకు ఎప్పటికీ ఉంటుంది. ప్రజలు ఎక్కడ కూడా ఆత్మ గౌరవాన్ని కోల్పోకుండా నిఖార్సైన పోరాటాలు చేసే తెలంగాణ గడ్డపై ఆత్మగౌరవం లేదంటే ప్రజలకు ఆత్మగౌరవం లేదా ? ఉప ఎన్నిక తీసుకువచ్చిన వారికి రాజకీయాల్లో ఆత్మగౌరవం లేదా ?? అనేది తెలుగు నేలపై సభ్య సమాజం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆత్మగౌరవం అనే నినాదంతో ప్రజలను పావులుగా వాడుకొని మరోసారి ఎమ్మెల్యేగా గెలిచేందుకు దానితో పాటు తెలంగాణలో బిజెపికి తిరుగు లేదనే ప్రభావాన్ని వేయవచ్చని ముందుస్తూ ఎన్నికలు తీసుకువచ్చారానేది స్పష్టం గా తెలుస్తుంది.
ప్రతిదీ డబ్బుతో సాధ్యపడుతుందనే భ్రమల్లోకి వెళ్లిన వ్యక్తులు ఉప ఎన్నిక తీసుకువచ్చారనే వాదనలు తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. అభివృద్ధి జరగడం లేదంటే.. ప్రజాస్వామ్య యుతంగా రాజ్యాంగబద్ధంగా ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వ్యక్తి ప్రజల అభివృద్ధి కోసం ప్రజల పక్షాన తమ ఫ్లాట్ ఫామ్ గా ఉన్న అసెంబ్లీ శాసనమండలి , జిల్లా పరిషత్ ,మండల పరిషత్, గ్రామపంచాయతీ స్థాయి నుంచి ఆయా సమావేశాల్లో కానీ ప్రత్యక్ష పోరాటాలను ప్రజా ప్రతినిదిగా పోరాటం చేయవచ్చు..అభివృద్ధి కోసం రాజీనామా చేస్తే ..అదే పార్టీ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి,తమ యొక్క బలపరీక్షను నిరూపించుకోవచ్చు. కానీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ మారి ప్రజలను పావులుగా వాడుకోవడానికి పోరాటాలు,చైతన్యం, ఆత్మగౌవరం లాంటివి అడ్డు పెట్టుకుని చైతన్యం కలిగిన సమాజంపై ప్రజలను కించపరుస్తూ ఆత్మగౌరవం లేదని మాట్లాడడం సబబు కాదనేది ఒక వర్గం నుండి చర్చ జరుగుతుంది.
ఉప ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ఒకరికి ఒక్కరూ అభివృద్ధిపై మాట్లాడడం అంటే ఏంటి?? ప్రభుత్వాలు చేయాల్సిన అభివృద్ధిని చేయకుండా ఒకరికి ఒకరూ మాటలతో ప్రజలను పక్కదారి పట్టించి ఎన్నికల్లో గెలిచి టిఆర్ఎస్ ప్రత్యామ్నాయంగా బిజెపి బిజెపికి ప్రత్యామ్నాయంగా టిఆర్ఎస్ అనే నినాదాన్ని ప్రజల్లో బలంగా తీసుకుపోవడానికి ఉపఎన్నిక పనికి వస్తుంది తప్ప ,ప్రజలకు పెద్దగా ఒరిగింది ,ఒరిగేది ఏమి లేదనేది స్పష్టం .
తాత్కాలిక ప్రయోజనాలతో మునుగోడులో ఉప్ప ఎన్నిక జరగవచ్చు కానీ ,తదనంతరం ప్రజలకు పెద్దగా మేలు చేకూరుతుందేమో అనే ఆలోచన నుంచి బయటపడక తప్పదు. మద్యం ,డబ్బులు అధికార దుర్వినియోగం విచ్చలవిడిగా జరుగుతుందని సామాజిక మాధ్యమాలతో పాటు స్థానిక ప్రజలు చెబుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరుగుతున్నాయా? లేదా? డబ్బులు, మద్యం, బంగారం వేల కోట్ల రూపాయల చర్చ ఎందుకు వస్తుందన్న దానిపై ఎన్నికల కమిషన్ ఎంత మేరకు చొరవ తీసుకొని దానిని అరికట్టాగలదు ?
డబ్బు ఉంటేనే రాజకీయం అనే బలమైన విధానాన్ని ఈ పాలకులు తీసుకువెళ్లారనేది నిజమే అనిపిస్తుంది. బాబా సాహెబ్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కులను కాలరాయడంలో నిమగ్నమయ్యారనే వాదనకు బలం చేకూరుకుంది.
సామాన్యుడు ప్రజలకు సేవ చేసు ప్రజాప్రతినిధిగా బరిలో ఉండే అవకాశం లేకుండా , డబ్బులు ఉంటేనే రాజకీయం అనే సంకేతాలను విస్తృతంగా బలపరిస్తున్నారు.పిడికెడు పెట్టుబడి, దలారులు భూస్వాములు, వేలకోట్ల అధిపతులు ఉన్న వారే రాజకీయం చేస్తే ,వేలాది మంది లక్షలాదిమంది పేద మధ్య తరగతి బుద్ధి జీవులు మేధావులు ప్రజాస్వామ్య యుతంగా రాజకీయం చేయలేని పరిస్థితిని నేటి సభ్య సమాజంలో కల్పించారు. డబ్బులు మద్యం తాత్కాలిక ప్రయోజనాల వైపు మొగ్గుచూపకుండా బడుగు, బలహీన, దళిత ,ఆదివాసి గిరిజనులు సేవ చేసేందుకు ముందుకు రావాలి . ఎన్నాళ్లు దోపిడీదారుల కింద భూస్వాముల కింద జెండాలు మోసి వారికి ఊడింగం చేసుకుంటూ ఉందామన్న ఆలోచన నుంచి బయట పడాల్సి అవసరం ఉంది.
ప్రతి ఒక్కరూ ఓ రాజకీయవేత్తగా ప్రజాప్రతినిధిగా ప్రజల అవసరాలు తీర్చే మానవుడిగా మార్పు చెందాల్సిన అవసరం ఉంది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలోని ప్రజా ప్రతినిధులంతా తమ నియోజకవర్గాన్ని వదిలేసి, మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. తెలంగాణలోని దాదాపు అన్ని నియోజకవర్గాలలోని గ్రామ స్థాయి నుంచి ప్రజా ప్రతినిధులు నియోజకవర్గంలోని గ్రామంలోని సమస్యలతో ప్రజలు సతమతం అవుతుంటే మునుగోడు ప్రచారంలో భాగస్వామ్యం అయ్యారు. నియోజకవర్గంలోని సమస్యలను పట్టించుకోకుండా మొత్తానికి ప్రభుత్వం పాలన ఉప ఎన్నికల్లో పనిచేస్తున్న ట్టుగానే ఉన్నది. తమ నియోజకవర్గ పరిధిలోని సమస్యల వైపు ఎమ్మెల్యేలు మంత్రులు ,గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధులు లేరనే చెప్పుకోవచ్చు. మును’’గోడు ‘’మా పార్టీ తీర్చగలదు అనే హామీని కేంద్రంలోనూ ,రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న రెండు పార్టీలు ఇవ్వకుండా ఒకరిని ఒకరూ తిట్టుకోవడంతోనే ఎన్నికలు జరుగుతున్నాయి.
గతంలో చేసింది భవిష్యత్తులో చేసేది ఏంటి అనే ఒక చర్చను తీసుకురాకుండా పక్కదారి పట్టించి నాయకులు ఒకరికి ఒకరు మాటలు అనుకోవడంతోనే సరిపోతుంది. ప్రతి ఎన్నికల్లోను ప్రజలకు జవాబు దారితనంగా ఏమి చేయగలుగుతాము అనే స్పష్టమైన హామీలను ఇవ్వాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య వ్యవస్థల్లో రాజ్యాంగబద్ధంగా ఎన్నికల్లో ఉండే అభ్యర్థులపై బాధ్యత ఉంటుంది. బాధ్యతను మరిచి డబ్బులతో అంగ,అర్థ బలాలతో ఎన్నికల్లో గెలిచి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే కుట్రలకు వడిగట్టారు. ఉప ఎన్నికలతో సామాన్య మానవుడికి వచ్చింది ఏంటో? ఒక్కసారి ఆలోచన చేసుకొవాలి.పేద వాడు పనికి పోకుండా ఉంటే పస్తులు ఉండక తప్పడం లేదు. మునుగోడు నియోజకవర్గం లోని ప్రజలకు ఎంత మేరకు మేలు చేకూరుతుందో అర్థం చేసుకోవాలి.ఉపఎన్నికల తో ప్రజలకు నిజమైన అభివృద్ధి జరిగేలా ఉంటే తెలంగాణలోని ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే అంతా రాజీనామా చేయాల్సిందేమరి.
శివగూడెం,మర్రిగూడా, డిండి ప్రాజెక్టు ,ఉమ్మడి జిల్లాలోని పూర్తికాని ప్రాజెక్టులు నేటికీ పూర్తి చేయలేదు.ఆయా ప్రాజెక్టుల కింద భూ నిర్వాసితులకు నష్టం పరిహారం చెల్లించలేదు. మునుగోడు లో అనేక సమస్యలు పెరుకుపోయాయి, వాటిని ఎందుకు అధికారంలో ఉన్న పార్టీలు న్యాయం చేయలేక పోయాయి. ఎన్నికలు వచ్చినప్పుడు తప్ప ప్రజలు గుర్తుకురాని అధికారంలో ఉన్న పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది..
– గోపీనాథ్




