నదీజలాల అనుసంధానంపై చర్చించాలి

వర్షాభావ పరిస్థితులు పదేళ్లకోసారి తప్పవని నిపుణులు అంటున్నారు. నైరుతి ప్రవేశించినా నేటికీ వర్షం జాడలేదు. అడపాదడపా అక్కడక్కడా పడుతున్న వర్షం లెక్కల్లోకి రాదు. వర్షాలు ముఖం చాటేస్తే జలాశయాలు వట్టిపోతాయి. గతంలో లాగా వాగులు వంకలు పొంగే పరిస్థితి లేదు. వర్షాల తీరు ఇలాగే ఉంటే నీటి కష్టాలు తప్పేలా లేవు. ఇలాంటి సందర్భాల్లోనే ప్రత్యామ్నాయాలు ఆలోచన చేయాలి. పాలకులకు దూరదృష్టి అవసరం. నదీజలాలలను ఏటా వృధాగా సముద్రంలోకి వదలాల్సిన దుస్థితి నుంచి బయటపడాలి. వాటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి. నదీ జలాలలను దేశం మొత్తానికి అందేలా…ప్రణాళికలు రూపొందించాలి. నదుల అనుసంధానంపై చర్చించాలి. దీనిపై సమగ్ర నివేదికలు రూపొందించాలి. నిపుణలను నియమించి గంగా,యమున,బ్రహ్మపుత్ర నదులను అనుసంధా నించే ప్రక్రియ చేపట్టాలి. ఈ దశలో నీటి సంరక్షణతో పాటు, రైతు సంక్షేమానికి చర్యలు తీసుకునే ప్రణాళికలు ముందుకు సాగాలి. మోదీ తొలినాళ్లలో నదుల అనుసంధానం గురించి మాట్లాడారు. కానీ ఇప్పుడా మాట ఎత్తడం లేదు. ఇకపోతే వర్షాల ద్వారా మనం పాఠాలు నేర్చుకోవాలి. వరదలను నివారించి, నీటిని నిల్వ చేసుకునే పద్దతలను అవలంబించాలి. దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగుతున్న సమయంలో వాటిని జలాశయాల్లోకి మళ్లించేలా ప్రణాళికలు చేసుకోవాలి. ఉన్నకొద్దిపాటు ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల చేయడంతో మళ్లీ సముద్రంలోకి నీరు చేరుతోంది. ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతో దేశంలో నీటి యాజమాన్యం సరిగా లేదని ఏటా కురుస్తున్న వర్షాలు స్పష్టం చేస్తున్నాయి. దీనికితోడు అనేక జలాశయాల్లో పూడిక పేరుకుని పోతోంది. ఏటేటా వర్షాలతో ఒండ్రు చేరుతోందని నిపుణులు చెబుతున్నారు. గతంలో వరదలకు ఉత్తరాది, దక్షిణాది అన్న తేడా లేకుండా అనేక నదులు ఉప్పొంగాయి. చివరకు మళ్లీ నీరు సముద్రానికి చేరింది. ఈ దుస్థితి పోవాలంటే నీటి యాజమాన్యం అవసరం. ఇప్పటికైనా పాలకులు జాతీయ జలవిధానం రూపొందించాల్సి ఉంది. అలాగే వ్యవసాయం పై కూడా జీతాయ విధానంతో ముందుకు సాగాలి. వ్యవసాయాన్ని లాభసాటి చేసేలా, దిగుబడులు పెంచుకునేలా రైతులను ప్రోత్సహిచేలా చూసుకోవాలి. వివిధ రాష్టాల్ల్రో చెరువులను కబ్జాకోరులు మింగిన పాపానికి ఏటా కురుస్తున్న వర్షాలకు నగరాలు, పట్టణాలు, గ్రామాలు నీట మునిగిపోతున్నాయి. ఇదంతా పాలకుల పాపం కాక మరోటి కాదు. ఈ క్రమంలో గొలుసుకట్టు చెరువులను రక్షించు కోవాలి. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని కనీసం ఇప్పటి నుంచయినా నీటి అవసరాలను గుర్తించి పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి. వర్షపునీటిని ఒడిసి పట్టుకుని ముందుకు సాగేలా ప్రణాళికలు చేసుకోవాలి. ఇది రాష్టాన్రికి, దేశానికి కూడా వర్తించేలా ఉండాలి.

దేశ జనాభా పెరుగుతున్న క్రమంలో మన వ్యవసాయాన్ని బలోపేతం చేసుకునే దిశగా ఆలోచనలు చేయాలి. వ్యవసాయ ఉత్పత్తులను పెంచి విదేశాలకు ఎగుమతి చేసే విధంగా సన్నద్దం కావాలి. ఆర్థికమాంద్యం ముంచుకొస్తున్న వేళ కేంద్రం ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటే ఓ పదేళ్లకు కాని ఆచారణలోకి రాదు. వ్యవసాయరంగం పురోగమిస్తే, ధాన్యం దిగుబడులు తగ్గితే తప్ప భారత ఆర్థికరంగం పురోగ మించదు. ఇప్పటికే వరిధాన్యం ఇబ్బడి ముబ్బడిగా పండించడం వల్ల గోదాముల్లో మగ్గి పోతోంది. వాటిని వాడుకునే విధంగా కార్యక్రమాలు అమలు చేసుకోవాలి. అదేపని గా వరి పండించకుండా ఇతర పంటలపైనా ప్రోత్సాహం కల్పించాలి. వంటనూనెల కోసం విదేశాలపై ఆధారపడకుండా దేశీయంగా నూనెగింజల ఉత్పత్తులను పెంచుకోవాల్సి ఉంది. ప్రధానంగా అనేకరకాల పప్పు ధాన్యాలు, వంట నూనెల దిగుమతులను పూర్తిగా నిషేధించుకుని, దేశీయంగా పండించుకునేలా వ్యవసాయాన్ని ప్రోత్సహిం చాలి. కనీసం ఓ పదేళ్ల పాటు వ్యవసాయరంగ ఉత్పత్తులపై దృష్టి సారిస్తే భారతదేశం ఆర్థకంగా మళ్లీ పుంజుకోగలదు. ఆధునిక వ్యవసాయం దిశగా పురోగమించాలి. రోజురోజుకూ నిరుద్యోగం పెరిగడంతో.. ప్రజలు ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు. వారిని వ్యవసాయం వైపు మళ్లించేలా పథకాలు చేపట్టాలి. తక్షణ ఉపాధికి ఇదొక్కటే ప్రత్యామ్నాయం కాగలదు. దీంతో ఆహార ఉత్పత్తులు కూడా పెరగ గలవు. కరువులు వచ్చినా, అధికంగా వర్షాలు కురిసినా రైతుల దుర్భర పరిస్థితులలో ఎలాంటి మార్పూ కనిపించడం లేదు. మరోవైపు ప్రతి సంవత్సరం వేలాది మంది రైతులు పట్టణాలకు వలస వెళ్ళి దినసరి కూలీలుగా మారు తున్నారు.

చిన్నాచితక వ్యాపారాలతో తోపుడు బళ్లు నడుపుతున్నారు. వ్యవసాయ భూమి లేని కూలీలు కౌలుకు తీసుకొని నష్టాలపాలయి బ్రతుకునీడ్చ లేక,అవమానం భరించలేక, చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు అనేకమంది మళ్లీ వ్యవసాయం వైపు మళ్లుతున్నారు. వారి శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకునేలా చేయాలి. ఈ క్రమంలో విదేశాలకు భారీగా ఎగుమతి చేసేలా పంటలు పండించగలగాలి. దీంతో మనకు విదేశీమారకం కూడా ఆదా కాగలదు. అలా పంటలు పండించే సత్తా మన రైతాంగానికి ఉందని గుర్తుంచుకోవాలి. మన రైతులనే ప్రోత్సహించి మన పంటలనే కాపాడుకునేలా రైతాంగ విధానాలు వస్తే తప్ప వారు బతికి బట్ట కట్టేలా లేరు. రైతుల సమస్యలను పట్టించుకునే దిశగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకోవాలి. ఏటా ఒక విధానంగా గాకుండా, రుణ మాఫీలు అవసరం లేని విధంగా రైతులు స్వయం సమృద్దిగా ఎదిగేలా చేయాలి. రైతుల సమస్యలు రాజకీయ పక్షాలకు ప్రచార కార్యక్రమంగానే మిగిలిపోయాయి. పాలకపక్షం అయినా, ప్రతిపక్షం అయినా రైతుల సమస్యలను పరిష్కరిం చడానికి చిత్తశుద్ధితో ఆలోచించడం లేదు. గిట్టుబాటు ధరలు లేక వచ్చిన ఆదాయం కూలీల ఖర్చుకు సరిపోతుంది. లక్షలాది మంది రైతులు వర్షాలు కురిసి కాలం కలసివచ్చినా ధరలు రాక నష్టపోతున్నారు. వర్షాలు పడని సంవత్సరంలో పంటలు ఎండిపోయి నష్ట పోతున్నారు. కాలం అయినా గాని, కరువు అయినా గాని రైతుకు మిగిలేది అప్పులే. నిపుణుల సలహాతో వ్యవసాయరంగాన్ని పారిశ్రామిక రంగంగా అభివృద్ది చేయగలిగితే దేశం ఆర్థికంగా బలోపేతం కాగలదు.
-ప్రజాతంత్ర డెస్క్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *